శనగ ధర ధగధగ
ABN , First Publish Date - 2023-04-04T01:13:00+05:30 IST
శనగల ధర ఈ ఏడాది ఆశాజనకంగా ఉంది. కాక్-2 రకం క్వింటాకు రూ.7500 నుంచి రూ.8000 వరకూ లభిస్తోంది. పెట్టుబడులు పోను ఎకరాకు రూ.20వేల వరకూ ఆదాయం వస్తుండటంతో రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. కొండపి, జరుగుమల్లి, టంగుటూరు మండలాల్లో ఈఏడాది కాక్-2 (బోల్ట్) రకం శనగలు సాగు చేశారు. జీజే-11 రకం (ఎర్ర) శనగలు వేయలేదు. ఎర్రనేలల రైతులకు వాతావరణం అనుకూలించగా, నల్లరేగడి నేలల్లో పంట వేసిన పంటకు కొంత ప్రతికూల పరిస్థితి ఎదురైంది. పలు దఫాలు తేలికపాటి వర్షాలు కురవడంతో ఎర్రనేలల్లో శనగల దిగుబడి పెరిగింది.
దిగుబడి తగ్గినా ఆశాజనకంగా మార్కెట్
పొలాల్లోనే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
కొండపి, ఏప్రిల్ 3 : శనగల ధర ఈ ఏడాది ఆశాజనకంగా ఉంది. కాక్-2 రకం క్వింటాకు రూ.7500 నుంచి రూ.8000 వరకూ లభిస్తోంది. పెట్టుబడులు పోను ఎకరాకు రూ.20వేల వరకూ ఆదాయం వస్తుండటంతో రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. కొండపి, జరుగుమల్లి, టంగుటూరు మండలాల్లో ఈఏడాది కాక్-2 (బోల్ట్) రకం శనగలు సాగు చేశారు. జీజే-11 రకం (ఎర్ర) శనగలు వేయలేదు. ఎర్రనేలల రైతులకు వాతావరణం అనుకూలించగా, నల్లరేగడి నేలల్లో పంట వేసిన పంటకు కొంత ప్రతికూల పరిస్థితి ఎదురైంది. పలు దఫాలు తేలికపాటి వర్షాలు కురవడంతో ఎర్రనేలల్లో శనగల దిగుబడి పెరిగింది. సహజంగా ఈనేలల్లో ఎకరానికి నాలుగు క్వింటాళ్లు పండేవి. ఈ ఏడాది ఎకరానికి ఆరు క్వింటాళ్ల వరకూ వస్తున్నాయి. నల్లరేగడి నేలల్లో మాత్రం దిగుబడి తగ్గింది. సాధారణంగా ఎకరాకు 9 నుంచి 11 క్వింటాళ్లు వరకు ఉత్పత్తి వచ్చే ఈనేలల్లో ఈ ఏడాది ఏడు క్వింటాళ్లు మించడం లేదు. మొత్తంగా దిగుబడి తగ్గడంతో శనగలకు డిమాండ్ పెరిగింది. ఎకరా సాగుకు కౌలు, పెట్టుబడి కలిపి రూ.30వేల వరకూ రైతులు ఖర్చు చేయగా సరాసరిన రూ.20వేల వరకూ ఆదాయం లభిస్తోంది.
వ్యాపారులకు విక్రయించేందుకే రైతులు మొగ్గు
మార్కెట్‌లో వ్యాపారులు ప్రస్తుతం కాక్-2 రకం శనగలను క్వింటా రూ.7,500 నుంచి రూ.8,000కు కొనుగోలు చేస్తున్నారు. రైతులు కూడా తమ అవసరాల కోసం నూర్పిడి కాగానే అమ్మేస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచితే క్వింటాకు 5 కేజీల వరకు తూకం తగ్గే అవకాశం ఉండటంతో వెంటనే విక్రయిస్తున్నారు. సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అక్కడ రకరకాల నిబంధనలతోపాటు డబ్బులు రైతులకు వచ్చే సరికి దాదాపు నెల పట్టే అవకాశం ఉంది. ప్రైవేటు వ్యాపారులు నిబంధనలేవీ విధించకపోవడంతోపాటు వెంటనే నగదు చెల్లిస్తుండగా రైతులు వారికే అమ్ముకుంటున్నారు. మున్ముందు ధర మరింత పెరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేసిన వారు, డబ్బులు అవసరం లేని వారు పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు.