Share News

ఇదేం విచారణ!

ABN , Publish Date - Dec 28 , 2023 | 11:19 PM

వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన పోస్టుల భర్తీ అక్రమాల్లో కేవలం ఉద్యోగులను మాత్రమే విచారించి అధికారులను వదిలేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2020 కరోనా విపత్కర పరిస్థితుల్లో చేపట్టిన నియామకాల్లో అక్రమాలపై కేవలం కిందిస్థాయి ఉద్యోగులను బాధ్యులను చేసి అప్పట్లో కీలకంగా పనిచేసిన నలుగురు డీఎంహెచ్‌వోలను వదిలేయడం ఏమిటనే ప్రశ్నలు ఉద్యోగవర్గాల్లో తలెత్తుతున్నాయి.

ఇదేం విచారణ!
వైద్యఆరోగ్యశాఖపై విచారణను పునఃపరిశీలించాలని కలెక్టర్‌ను కోరుతున్న ఎన్‌జీవో సంఘం నాయకులు

వైద్యశాఖలో పోస్టుల భర్తీ వ్యవహారం

కేవలం ఉద్యోగులనే బాధ్యులను చేయడమేమిటి?

అధికారులకు తెలియకుండానే నియమకాలు జరుగుతాయా..

కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించిన ఎన్‌జీవో సంఘం నేతలు

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 28 : వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన పోస్టుల భర్తీ అక్రమాల్లో కేవలం ఉద్యోగులను మాత్రమే విచారించి అధికారులను వదిలేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2020 కరోనా విపత్కర పరిస్థితుల్లో చేపట్టిన నియామకాల్లో అక్రమాలపై కేవలం కిందిస్థాయి ఉద్యోగులను బాధ్యులను చేసి అప్పట్లో కీలకంగా పనిచేసిన నలుగురు డీఎంహెచ్‌వోలను వదిలేయడం ఏమిటనే ప్రశ్నలు ఉద్యోగవర్గాల్లో తలెత్తుతున్నాయి. నియామకాలపై పెద్దఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. జడ్పీ సీఈవో జాలిరెడ్డి నేతృత్వంలో ముగ్గురు అధికారులను నియమించి నోటిఫికేషన్‌ నాటి నుంచి పోస్టుల నియామకం వరకు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో పనిచేసిన ఉద్యోగులను మాత్రమే విచారించారు. అదే సమయంలో పనిచేసిన ఉన్నతాధికారులను మాత్రం విచారించలేదు. అధికారులకు తెలియకుండా ఉద్యోగులు నియామకాలు చేస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నమతవుతోంది. వైద్యశాఖలో నోటిఫికేషన్‌ నాటి నుంచి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే నాటికి నలుగురు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పనిచేశారు. వారి ప్రమేయం లేకుండా కిందిస్థాయి ఉద్యోగులే పోస్టులు ఇచ్చే పరిస్థితి ఉండదు. స్టాప్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్‌తో పాటు పలురకాల పోస్టుల నియామకాల ప్రక్రియ అధికారులే చేపట్టాలి. సంబంధిత ఉద్యోగులు మెరిట్‌ జాబితాలు, సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. వారు సక్రమంగా చేశారా.. లేదా? పరిశీలించిన తర్వాత ఉద్యోగాలు ఇస్తారు. వైద్యశాఖలో ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఉద్యోగులను మాత్రమే విచారణ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

విచారణ నివేదికను పరిశీలించాలి

కేవలం నలుగురు ఉద్యోగులను బాధ్యులను చేయడాన్ని ఏపీఎన్‌జీవో సంఘం నాయకులు ఖండించారు. గురువారం ఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే శరత్‌బాబు, ఆర్‌సీహెచ్‌ కృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో ఎన్‌జీవో సంఘం నాయకులు కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అప్పటి కలెక్టర్‌ పర్యవేక్షణలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ నియాకాలు జరిగాయని తెలిపారు. ఆ సమయంలో కేవలం అప్పట్లో పనిచేసిన ఉద్యోగులను మాత్రమే విచారణ చేసి వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మాత్రం విచారణ చేయలేదన్నారు. ఈ విచారణ నివేదికను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నివేదికను పరిశీలించాక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Updated Date - Dec 28 , 2023 | 11:19 PM