పొగాకు గరిష్ఠ ధర కిలో రూ.278
ABN , First Publish Date - 2023-08-09T00:49:24+05:30 IST
పొగాకు కిలో గరిష్ఠ ధర మరో మూడు రూపాయలు పెరిగింది.
తాజాగా మరో రూ.3 పెరుగుదల
ఒంగోలు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : పొగాకు కిలో గరిష్ఠ ధర మరో మూడు రూపాయలు పెరిగింది. వారం క్రితం రూ.275 లభించగా అప్పటి నుంచి ఆయా వేలం కేంద్రాల్లో ధరలు రూ.270 నుంచి రూ.275 మధ్య ఉంటున్నాయి. కాగా మంగళవారం మార్కెట్లో గరిష్ఠ ధర కిలో రూ.278 పలికింది. ఒంగోలు-1, పొదిలి కేంద్రాల్లో ఇది లభించింది. వెల్లంపల్లి, ఒంగోలు-2, టంగుటూరు, కందుకూరు-2 కేంద్రాల్లో రూ.277, అలాగే కందుకూరు-1లో రూ.276 లభించింది. ఇప్పటివరకు ఉన్న గరిష్ఠ ధర కన్నా తాజాగా కిలోకు రూ.3 మేర పెరి గింది. ఇదిలా ఉండగా మొత్తం 11 కేంద్రాల్లో మూడింటిలో వేలం పూర్తికాగా మరికొన్నింటిలో 14వతేదీనాటికి, మిగిలిన చోట్ల ఈనెల 20నాటికి వేలం పూర్తవుతుందని సమాచారం. మొత్తం 107 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి అంచనాతో వేలం ప్రారంభించగా ఇప్పటి వరకు సుమారు 114.25 మిలియన్ కిలోల కొనుగోలు జరిగింది. సగటున కిలోకు రూ.212.11 ధర లభించింది.