దీక్షల జోరు
ABN , First Publish Date - 2023-09-25T23:25:19+05:30 IST
జిల్లాలో టీడీపీ శ్రేణుల నిరసనలు ఏమాత్రం తగ్గడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసు నమోదు, అరెస్టును వ్యతిరేకిస్తూ పక్షం రోజులుగా జిల్లాలో వివిధ రూపాలలో చేస్తున్న ఆందోళనలు సోమవారం కూడా కొనసాగాయి

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళన
పలు ప్రాంతాల్లో రిలే దీక్షలు, విభిన్న వర్గాల హాజరు
ఇతర రూపాల్లోనూ సంఘీభావ కార్యక్రమాలు
ఒంగోలు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో టీడీపీ శ్రేణుల నిరసనలు ఏమాత్రం తగ్గడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసు నమోదు, అరెస్టును వ్యతిరేకిస్తూ పక్షం రోజులుగా జిల్లాలో వివిధ రూపాలలో చేస్తున్న ఆందోళనలు సోమవారం కూడా కొనసాగాయి. పలు ప్రాంతాల్లో ముఖ్యనేతల పర్యవేక్షణలో రిలేదీక్షలు కొనసాగగా విభిన్న వర్గాల ప్రజలు, టీడీపీ కార్యకర్తలు అందులో పాల్గొంటున్నారు. అలాగే పోస్టుకార్డుల ఉద్యమం, కొవ్వొత్తుల ర్యాలీలు వంటి కార్యక్రమాలతో మద్దతు తెలుపుతున్నారు. కొన్నిచోట్ల చంద్రబాబును అక్రమంగా ఆరెస్టు చేశారంటూ విస్తృతంగా ప్రజలకు కరపత్రాల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సోమవారం జరిగిన కార్యక్రమాలను పరిశీలిస్తే ఒంగోలు నియెజకవర్గ కార్యాలయంలో జరిగిన దీక్షలో నగరంలో 18 నుంచి 28 డివిజన్ల పరిధిలోని క్టస్లర్ యూనిట్ ఇన్‌చార్జీలు పాల్గొనగా ముగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజ రై దీక్షలు విరమింపజేశారు. కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశానికి హాజరు కాగా కొండపిలో మండల నాయకులు దీక్షలు నిర్వహించారు. ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో జరిగిన దీక్షల్లో నాగులుప్పలపాడు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కనిగిరిలోని దీక్షా శిబిరంలో పీసీపల్లి మండల నాయకులు కూర్చోగా అక్కడి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి పాల్గొన్నారు. అక్కడ కార్యకర్తలు చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, దర్శిలో మాజీ ఎమ్మెల్యే పాపారావు, వైపాలెంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబుల నేతృత్వంలో రిలే దీక్షలు జరగ్గా మార్కాపురంలో కందుల రామిరెడ్డి నేతృత్వంలో సాగాయి.