బాలికను మింగిన ముసి

ABN , First Publish Date - 2023-06-18T00:57:45+05:30 IST

రొయ్యల చెరువులు చూసేందుకు వచ్చిన ఇరువురు బాలికలు కాలుజారి ముసిలో పడ్డారు. వీరిలో ఒకరు నీట మునిగి మృతి చెందగా, మరో బాలికను మత్స్యకారులు కాపాడారు.

బాలికను మింగిన ముసి
సాయిఅక్షయ మృతదేహం

ప్రమాదవశాత్తు జారి ఏరులో పడిపోయిన ఇద్దరు

ఒకరిని కాపాడిన జాలర్లు

అనంతవరం (టంగుటూరు), జూన్‌ 17 : రొయ్యల చెరువులు చూసేందుకు వచ్చిన ఇరువురు బాలికలు కాలుజారి ముసిలో పడ్డారు. వీరిలో ఒకరు నీట మునిగి మృతి చెందగా, మరో బాలికను మత్స్యకారులు కాపాడారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం మండలంలోని అనంతవరం చెక్‌డ్యాం వద్ద చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. కొండపి మండలం కట్టావారిపాలెంనకు చెందిన కట్టా అజయ్‌ ఈతముక్కలలో కోళ్లఫారమ్‌ లీజుకు తీసుకొని చికెన్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. ఆయన భార్య సోదరి పిల్లలైన పేర్నమిట్టకు చెందిన సాయిఅక్షయ (14), హర్షవర్థ న్‌రెడ్డి ఈతముక్కలలోని అజయ్‌ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చారు. అదంతా తీరప్రాంతం కావడంతో వీరికి రొయ్యల చెరువులు చూద్దామన్న కోరిక కలిగింది. ఈతముక్కలలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేసే సుబ్రహ్మణ్యం శనివారం చికెన్‌ సెంటర్‌కు వెళ్లాడు. సాయి అక్షయ, హర్షవర్థన్‌రెడ్డితోపాటు అజయ్‌ కుమార్తె అయిన హర్షిత రొయ్యల చెరువులు చూపించమని ఆయన్ను కోరా రు. దీంతో సుబ్రహ్మణ్యం ముగ్గురినీ స్కూటీపై ఎక్కించుకొని రొయ్యల చెరువుల వైపు తీసుకెళ్లారు. అనంతవరం చెక్‌డ్యాం వద్దకు వెళ్లగానే ఒక్కసారిగా బండి దిగిన ఇద్దరు బాలికలు పరుగున ముసి ఒడ్డుకు వెళ్లారు. కాలుజారి ఇద్దరూ ముసిలో పడ్డారు. సుబ్రహ్మణ్యం పెద్దగా కేకలు వేయడంతో దగ్గరలో చేపలు పట్టుకుంటున్న జాలర్లు వెంటనే అక్కడికి చేరుకుని ముసిలోకి దిగారు. హర్షితను పట్టుకొని ఒడ్డుకు చేర్చారు. సాయిఅక్షయ ఆచూకీ మాత్రం లభించలేదు. కొద్దిసేపటికి ఆమె మృతదేహం పైకి తేలింది.

Updated Date - 2023-06-18T00:57:45+05:30 IST