Share News

ఊడ్చిన చెత్త ఊరి నెత్తినే..!.

ABN , Publish Date - Dec 28 , 2023 | 11:22 PM

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఆ ప్రభావంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి నగర వీధులన్నీ కంపుకొడుతున్నాయి. పైగా రోజువారీగా ఇళ్లలో చెత్తను సేకరించే ఆటోల పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీంతో నగరంలోని వీధుల్లో ఉన్న చెత్త డబ్బాలు నిండిపోయాయి.

ఊడ్చిన చెత్త ఊరి నెత్తినే..!.
ఒంగోలులో పేరుకున్న చెత్త

కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే

తీవ్రమవుతున్న ఉద్యమం

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల దృష్టి

ఒంగోలు (కార్పొరేషన్‌), డిసెంబరు 28: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఆ ప్రభావంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి నగర వీధులన్నీ కంపుకొడుతున్నాయి. పైగా రోజువారీగా ఇళ్లలో చెత్తను సేకరించే ఆటోల పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీంతో నగరంలోని వీధుల్లో ఉన్న చెత్త డబ్బాలు నిండిపోయాయి. వాటి చుట్టూ భారీగా చెత్త చేరడంతో అటువైపు వెళ్లడానికే జనం భయపడుతున్న పరిస్థితి. దుర్వాసన వెదజల్లుతూ పరిసరాలు దారుణంగా తయారయ్యాయి. ఒంగోలు నగరంలో 50 డివిజన్‌లు ఉండగా, నగర జనాభా 2.52లక్షలకు చేరింది. దీంతో ప్రతిరోజు సుమారు 120టన్నుల తడి, పొడి చెత్త ఉత్పత్తవుతుంది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్‌ పరిధిలో ఐదు పారిశుధ్య సేకరణ డివిజన్‌లుగా విభజించగా, అందులో పర్మినెంట్‌ కార్మికులు 122 మంది, కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు 681మంది వరకు ఉన్నారు. గత మూడు రోజులుగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగడంతో వీధుల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది.

చెవిలో పువ్వులతో కార్మికుల నిరసన

పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం మూడవ రోజుకు చేరుకుంది. దీంతో కార్మికులు ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకురాలు సామ్రాజ్యం, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతుందని, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడంతోపాటు, ప్రజారోగ్యాన్ని కూడా పట్టించుకోవడం లేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా..

కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగడంతో కార్పొరేషన్‌ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. నగర కమిషనరు ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలో గురువారం ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు. ఆటోల ద్వారా ఇంటింటి చెత్తను సేకరించగా, పర్మినెంట్‌ కార్మికులతో ప్రధాన రహదారుల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. అయితే నగరంలో ప్రతిరోజు 120 టన్నుల వరకు ఉత్పత్తయ్యే చెత్తను సేకరించడం సమస్యగా మారింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా సమస్యకు పరిష్కారం లభిచండం లేదు. వీధులను శుభ్రం చేయడం, కాలువల్లో మురుగు తొలగింపు పనులు నిలిచిపోవడంతో ఉన్న కొద్దిమంది కార్మికులతో కార్పొరేషన్‌ అధికారులు నానాతంటాలు పడుతున్నారు. రోజువారి పనివేళల కంటే, అదనంగా పనిచేయిస్తున్నప్పటికీ పారిశుధ్యం మెరుగుపడటం లేదు. దీంతో వీధుల్లో పేరుకుపోయిన చెత్త కుప్పల తొలగింపునకే పరిమితం కావడంతో పరిస్థితి దారుణంగా మారింది.

Updated Date - Dec 28 , 2023 | 11:22 PM