నకిలీల దందా
ABN , First Publish Date - 2023-06-30T00:21:44+05:30 IST
జిల్లాలో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు, లేఖలతో హల్‌చల్ చేస్తున్నారు. గతంలో కొన్ని ప్రభుత్వ శాఖలకే పరిమితమైన ఈ మకిలీ ఇప్పుడు అన్నింటికీ విస్తరించింది. చివరికి కోర్టులనుసైతం తాకింది. కొందరు ముఠాలుగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేసి వారికి ఫోర్జరీ సంతకాలు, స్టాంపులతో నియామకత్రాలు ఇచ్చి నిలువునా మోసం చేస్తున్నారు.
జిల్లాలో వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు
ఓటీఎస్ లబ్ధిదారులకు ఫేక్ డాక్యుమెంట్లు
కోర్టుల పేరుతో నకిలీ లేఖలు
నిరుద్యోగులనూ మోసం చేస్తున్న ముఠాలు
కొన్ని వ్యవహారాల్లో వైసీపీ చోటా నేతల ప్రమేయం
ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పోలీసులు
పి.సి.పల్లి మండలం లక్ష్మక్కపల్లి సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎ్‌స) పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చారు. అందులో ఒకరు తనకు ఇచ్చిన పత్రాన్ని చదువుకున్న వ్యక్తి చూపించాడు. ఆయన దానిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా మరొకరి పేరు కనిపించింది. అది నకిలీదని తేలింది. ఇలాగే మరో 10 మందికి అక్కడి సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ నకిలీ పత్రాలు ఇచ్చినట్లు బయటపడింది.
ఒంగోలుకు చెందిన గంగిశెట్టి నరసింహారావు అనే వ్యక్తి బ్యాంకు అకౌంట్ సీజ్ అయ్యింది. దాన్ని తెరవాలని ఈ ఏడాది ఫిబ్రరిలో యాక్సెస్ బ్యాంక్ అధికారులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పేరుతో ఒక లేఖ వెళ్లింది. ఆ తర్వాత ఇది నకిలీదని గుర్తించారు. దీనిపై ఆ సంస్థ సూపరింటెండెంట్ గత శనివారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
కొద్ది నెలల క్రితం ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని వైసీపీకి చెందిన కింది స్థాయి నేత డబ్బులు తీసుకొన్నాడు. అనంతరం ఉద్యోగ నియామకపత్రం ఇచ్చాడు. అది తీసుకొని ఆ యువకుడు ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ దాన్ని పరిశీలించిన అధికారులు అవాక్కయ్యారు. అది నకిలీదని స్పష్టం చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి.
ఇలా.. జిల్లాలో నకిలీ పత్రాలు, లేఖల దందా జోరుగా నడుస్తోంది. కొందరు అక్రమ సంపాదనే ధ్యేయంగా ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు. వారికి నకిలీ నియామకపత్రాలు ఇచ్చి టోకరా వేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ సహాయంతో పక్కా గృహాలు నిర్మించుకున్న వారి కోసం అమలు చేస్తున్న ఒన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎ్‌స)లోనూ నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు వెలుగు చూడటం విస్మయం కలిగిస్తోంది. చివరికి న్యాయస్థానాల పేరుతో కూడా నకిలీ లేఖలు తయారు చేస్తుండటం వారి బరితెగింపును తెలియజేస్తోంది. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న ఈ తప్పుడు పత్రాలు, లేఖల వ్యవహారం కలకలం రేపుతోంది. గతంలో ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు నకిలీవి తయారు చేసిన ఉదంతాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఒక ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పని చేసినప్పుడు ఆయన లెటర్ ప్యాడ్‌ల ఫోర్జరీ వ్యవహారం సంచలనమైంది. అయినప్పటికీ ఈ నకిలీలకు అడ్డుకట్ట పడటం లేదు. పోలీసుల ఉదాసీనతే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒంగోలు (క్రైం), జూన్ 25 : జిల్లాలో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు, లేఖలతో హల్‌చల్ చేస్తున్నారు. గతంలో కొన్ని ప్రభుత్వ శాఖలకే పరిమితమైన ఈ మకిలీ ఇప్పుడు అన్నింటికీ విస్తరించింది. చివరికి కోర్టులనుసైతం తాకింది. కొందరు ముఠాలుగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేసి వారికి ఫోర్జరీ సంతకాలు, స్టాంపులతో నియామకత్రాలు ఇచ్చి నిలువునా మోసం చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఇలాంటి లేఖలు ఇస్తున్న వారు సంఖ్య పెరిగింది. తీరా అవి నకిలీవని అధికారులు చెప్పడంతో నిరుద్యోగులు నివ్వెరపోతున్నారు. తాము మోసపోయినట్లు తెలుసుకొని లబోదిబోమంటున్నారు. పోలీసులకు సైతం ఫిర్యాదులు చేస్తున్నారు. వీటితోపాటు కొన్ని ప్రభుత్వ పథకాల్లోనూ నకిలీ పత్రాలు హల్‌చల్ చేస్తున్నాయి.
ఓటీఎస్ పత్రాల్లో నకిలీలలు
తాజాగా ఒన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) రిజిస్ట్రేషన్ పత్రాల్లో నకిలీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం నకిలీ పత్రాల ముఠాకు ఆదాయ వనరుగా మారింది. ఇటీవల పీసీపల్లి మండలంలోని లక్ష్మక్కపల్లి సచివాలంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోలప్పనాయుడు ఓటీఎస్ పేరుతో లబ్ధిదారులకు నకిలీ పత్రాలు ఇచ్చి లక్షలు గడించిన వైనం వెలుగుచూసింది. పేదలకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకంలో ఇలాంటి వ్యవహారం చోటుచేసుకోవడం యావత్ యంత్రాంగాన్ని కుదిపివేస్తోంది. దీనిపై అధికారులు ప్రాథమిక విచారణ మాత్రమే చేపట్టారు. పూర్తిస్థాయి విచారణ చేస్తే భారీ అవినీతి బాగోతం వెలుగు చూసే అవకాశం ఉంది. అసలు ప్రభుత్వం ఇచ్చే పత్రాలు నకిలీవి తయారు చేయడం వెనుక ఎవరి హస్తం ఉందన్నది తేలాల్సి ఉంది.
నాయస్థానాల పేరుతోనూనకిలీ లేఖలు
నకిలీ లేఖల వ్యవహారం నాయస్థానాన్ని కూడా తాకడం చర్చనీయాంశమైంది. ఇటీవల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పేరుతో కొన్ని నకిలీ లేఖలు జారీ అయ్యాయి. ఒంగోలుకు చెందిన గంగిశెట్టి మాధవరావుకు సంబంధించి సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లు తిరిగి తెరవాలని ఈ ఏడాది ఫిబ్రరిలో యాక్సెస్ బ్యాంక్ అధికారులకు లేఖ వెళ్లింది. అదేవిధంగా అద్దంకి డిపోలో ఓ ఉద్యోగి సస్పెన్షన్ విషయమై మరో లేఖ సంబంధిత అధికారులకు జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ నుంచి వెళ్లినట్లు గుర్తించారు. అయితే ఈ రెండు లేఖలు నకిలీవని నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీన్ని ఆమె ఒంగోలు ఒన్‌టౌన్ పోలీసులకు పంపారు. న్యాయస్థానానికి సంబంధించిన నకిలీ లేఖల తయారీ వెనుక ఎవరి హస్తం ఉందన్న విషయమై పోలీసులు విచారిస్తున్నారు.
గతంలో ఓ మంత్రి లెటర్ ప్యాడ్‌లు హల్‌చల్
జిల్లాలో ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే మూడేళ్ల క్రితం మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన లెటర్ ప్యాడ్‌లు బయటకు వచ్చాయి. దీని వెనుక ఎవరున్నారన్న చర్చ అప్పట్లో జోరుగా సాగింది. దీనిపై మంత్రి కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది పెద్ద దూమారం రేపింది. అయితే కొద్ది రోజులకే టీ కప్పులో తుఫాన్‌లా సమసిపోయింది. రాజముద్ర ఉన్న మంత్రి లెటర్ ప్యాడ్‌లు నకిలీవి తయారు చేయడం ఎలా సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై నేరుగా ఎస్పీకి సైతం ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ పోలీసులు ఈ విషయంగా అంత సీరియ్‌సగా దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఈ ముఠా వెనుక అధికార పార్టీకి చెందిన చోటా నాయకుడు ఉన్నాడని భాధితులు బాహాటంగానే చెప్పారు. అయినా పోలీసులు కేసును మమ అనిపించారు.
పోలీసుల ఉదాసీనత
నకిలీ పత్రాలు తయారు చేసే వారి పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్వహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అప్పట్లో మంత్రి లెటర్‌ప్యాడ్‌లు నకిలీవి తయారు చేసిన సమయంలో కఠినంగా వ్యవహరించే ఇలాంటి పరిణామాలు పునరావృతమయ్యే అవకాశం ఉండేది కాదన్న చర్చ సర్వత్రా నడుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. నకిలీ లేఖలు, పత్రాలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్న ముఠాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.