రైతుల్లో గుబులు

ABN , First Publish Date - 2023-03-19T02:14:35+05:30 IST

జిల్లాలో నెలకొన్న తాజా వాతావరణ పరిస్థితితో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మూడురోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గి ఆకాశం మేఘావృతమై ఉంది.

రైతుల్లో గుబులు

తాజా వాతావరణంతో ఆందోళన

పొలాల్లో పలు ప్రధాన పంటలు

కల్లాల్లో మిర్చి.. కోసి ఉన్న వరి, శనగ

వర్షం కురిస్తే పొగాకు నాణ్యత తగ్గే ప్రమాదం

ఒంగోలు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నెలకొన్న తాజా వాతావరణ పరిస్థితితో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మూడురోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గి ఆకాశం మేఘావృతమై ఉంది. పలుచోట్ల జల్లులు పడుతున్నాయి. కొన్ని మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. మరో రెండురోజుల పాటు వర్ష సూచన ఉండటంతో రైతుల్లో గుబులు మొదలైంది. గత డిసెంబరులో సంభవించిన మాండస్‌ తుఫాన్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేలాది ఎకరాల్లో పొగాకు, శనగ పంటలు తిరిగి వేయాల్సి వచ్చింది. అయినా వ్యయప్రయాసలతో సాగు చేపట్టారు. అయితే ప్రస్తుతం అధిక ప్రాంతాల్లో శనగ పంట పీకి ఒదెలుగా పొలంలోనే ఉంచారు. చాలాచోట్ల పొగాకు రెలుపులు కొనసాగుతున్నాయి. ఇక మిర్చి కోతలు జరిగి కళ్లాల్లో ఆరబోశారు. ఇలాంటి సమయంలో వాతావరణంలో వచ్చిన మార్పు రైతులను భయపెడుతోంది. ఇప్పుడు వర్షం కురిస్తే ఆ పంటలన్నీ దెబ్బతినే అవకాశం ఉంది. కల్లాల్లో ఉన్న మిర్చి, పొలంలో ఉన్న వరి, శనగ ఓదెలు తడిసిపాడైపోయే ప్రమాదం ఉంది. పొగాకు మొక్కలలో ఆకులపై ఉన్న మడ్డి కారి పంట నాణ్యత తగ్గుతుంది. తద్వారా భారీ నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులుగా జల్లులు పడుతుండటంతో అవకాశం ఉన్న వరకు కల్లాల్లో ఉన్న మిర్చిపై పట్టలు కప్పుతున్నారు. పీకిన శనగను విత్తనాలు రాల్చకుండానే ఇళ్లకు చేర్చుకుంటున్నారు. అక్కడక్కడా వరి ఓదెలను కుప్పలుగా వేస్తున్నారు. పొగాకు రైతులకు మాత్రం ఏమి చేయాలో అర్థం కావడం లేదు. శనివారం కూడా పలు ప్రాంతాల్లో జల్లులు పడటం వారిలో మరింత ఆందోళన కలిగిస్తోంది.

శనగ పనలను ఇళ్లకు చేర్చుకుంటున్న రైతులు

కొండపి : మండలంలో రెండు రోజులుగా తేలికపాటి వాన కురిసింది. మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీస్తున్నారు. పొలాల్లో కోసి కుప్పలు వేసిన శనగ పనలను ఇళ్లకు చేర్చుకుంటున్నారు. శనివారం ఉదయం మండలంలో తేలికపాటి జల్లులు, భారీగా గాలి వీచింది. భారీ వర్షం కురిస్తే శనగ కాయలు నీటి పాలయ్యే అవకాశం ఉండటంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళ్లకు తీసుకువచ్చిన శనగ పనలను షెడ్లు, పందిర్లలో ఉంచి పట్టలు కప్పుకుంటున్నారు.

Updated Date - 2023-03-19T02:14:35+05:30 IST