పది పరీక్షలు మరింత కట్టుదిట్టం

ABN , First Publish Date - 2023-04-06T00:45:43+05:30 IST

పదో తరగతి పరీక్షల నిర్వహణను మరింత కట్టుదిట్టం చేశారు. తెలంగాణలో వరుసగా తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు లీక్‌ కావడంతో ఇక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.

పది పరీక్షలు మరింత కట్టుదిట్టం

కేంద్రంలో ఏం జరిగినా చీఫ్‌, డీవోలదే బాధ్యత

ఒంగోలు (విద్య), ఏప్రిల్‌ 5 : పదో తరగతి పరీక్షల నిర్వహణను మరింత కట్టుదిట్టం చేశారు. తెలంగాణలో వరుసగా తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు లీక్‌ కావడంతో ఇక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరింత పెంచుతూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ప్రకారం పరీక్ష కేంద్రంలో అక్రమాలు, అవకతవకలు జరిగితే సంబంధిత చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, సీ సెంటర్‌ కస్టోడియన్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. తొలివేటు వీరిపైనే పడుతుంది. కేంద్రాలను నో మొబైల్‌ జోన్లుగా ప్రకటించినందున పరీక్షల విధుల్లో పాల్గొనే వారు తమ ఫోన్లను ఇంటిలో ఉంచి విధులకు హాజరుకావాలి. ఎవరైనా పొరపాటున తెస్తే కేంద్రంలోకి వెళ్లకముందే పోలీస్‌ పికెట్‌ వద్ద అప్పగించాలి.

ఒక్కసారి కేంద్రంలోకి వచ్చిన సిబ్బంది పరీక్ష ముగిసేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. అటెండర్లు, ఇతర సహాయకులు కూడా టీ ఇతర శీతల పానీయాలు వంటి అవసరాలకు కూడా బయటకు రాకూడదు. పరీక్షల విధులు లేని టీచర్లు కేంద్రాల పరిసరాల్లో ఉండకూడదు. కేంద్రాలు ఉన్న కేజీబీవీ, రెసిడెన్షియల్‌ పాఠశాలలకు చెందిన పరీక్ష విధులు లేని ఉపాధ్యాయులు ఆ సమయంలో పాఠశాలలో ఉండరాదు. పరీక్షా కేంద్రంలో బయటి వ్యక్తులు ఎవ్వరూ ఉండకూడదు.

ప్రశ్నపత్రాలు, వాటిపై వదంతులు వాట్సాప్‌ గ్రూపుల్లో కానీ, సామాజిక మాధ్యమాల్లో కానీ ప్రచారం చేయకూడదు. పరీక్షకు హాజరుకాని అభ్యర్థుల ప్రశ్నపత్రాలు, మిగిలినవి ఉదయం 10 గంటలలోపు చీఫ్‌ సూపరింటెండెంట్లు అకౌంట్‌ రాసి జాగ్రత్తగా కవర్‌లో సీల్‌ చేసి భద్రపర్చాలి. అన్ని కేంద్రాల్లో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ తాజాగా జారీచేసిన నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్‌ ఆదేశించారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసేంత వరకు కేంద్రాల్లో అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.

Updated Date - 2023-04-06T00:45:43+05:30 IST