సాగుకు సాంకేతిక సలహాలు ఇక దూరం!

ABN , First Publish Date - 2023-03-30T23:22:30+05:30 IST

జిల్లా రైతాంగానికి వ్యవసాయ, సాంకేతిక సలహాలు, సూచనలు మరింత దూరం కానున్నాయి. ఇప్పటివరకు ఒంగోలు మార్కెట్‌ యార్డులో ఉన్న ఏరువాక కేంద్రం ఇక కనుమరుగు అవుతోంది. ఇక్కడి నుంచి ఆ కేంద్రాన్ని పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటకు తరలిస్తున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఒంగోలు కేంద్రం నర్సరావుపేటలో పనిచేయనుండగా పల్నాడు జిల్లాకు అది పరిమితం అవుతుంది. వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఆయా సందర్భాలలో పంటలకు ఆశించే తెగుళ్లు, పురుగులను పరిశీలించి రైతులకు సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయ యూనివర్సిటీ పర్యవేక్షణలో గతంలో జిల్లాకు ఒక వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం(ఏరువాక కేంద్రం) ను ఏర్పాటు చేశారు.

సాగుకు సాంకేతిక సలహాలు   ఇక దూరం!
ఒంగోలు ఏఎంసీ అవరణలో ఉన్న ఏరువాక కేంద్రం

రేపటి నుంచి నర్సరావుపేటలో ఒంగోలు కేంద్ర కార్యకలాపాలు

ప్రభుత్వ తీరును నిరసిస్తున్న రైతుసంఘాలు

నిజానికి కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాగా ఆగ్రభాగాన ప్రకాశం ఉండటమే కాక వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉంది. అలాంటి చోట వ్యవసాయ, ఉద్యాన రంగాలకు ఉపకరించే చర్యలను మరింతగా పెంచాల్సింది పోయి అంతోఇంతో ఉపకరిస్తున్న ఒంగోలులోని ఏరువాక కేంద్రాన్ని ఇక్కడి నుంచి తరలించి వేస్తున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రైతుసంఘాలు ప్రభుత్వానికి వినతులు పంపినా, నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేదు. జిల్లాకు చెందిన అధికారపక్ష ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితిగా రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. రేపటి నుంచి ఏరువాక కేంద్ర కార్యకలాపాలు నర్సరావుపేటలో కొనసాగుతాయి.

ఒంగోలు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లా రైతాంగానికి వ్యవసాయ, సాంకేతిక సలహాలు, సూచనలు మరింత దూరం కానున్నాయి. ఇప్పటివరకు ఒంగోలు మార్కెట్‌ యార్డులో ఉన్న ఏరువాక కేంద్రం ఇక కనుమరుగు అవుతోంది. ఇక్కడి నుంచి ఆ కేంద్రాన్ని పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటకు తరలిస్తున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఒంగోలు కేంద్రం నర్సరావుపేటలో పనిచేయనుండగా పల్నాడు జిల్లాకు అది పరిమితం అవుతుంది. వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఆయా సందర్భాలలో పంటలకు ఆశించే తెగుళ్లు, పురుగులను పరిశీలించి రైతులకు సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయ యూనివర్సిటీ పర్యవేక్షణలో గతంలో జిల్లాకు ఒక వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం(ఏరువాక కేంద్రం) ను ఏర్పాటు చేశారు. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా అలా ఒంగోలులో కేంద్రం నడుస్తోంది. ఒక సీనియర్‌ శాస్త్రవేత్త, మరో ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటుండగా జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, ఆదర్శ రైతులు సభ్యులుగా సలహామండలి ఉంది. మరోవైపు వ్యవసాయం విస్తరణ, పరిశోధనలకు సంబంధించి కూడా జిల్లాకు ఒక పరిశోధనా కేంద్రంను కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) పేరుతో నిర్వహిస్తున్నారు జిల్లాకు సంబంధించి దర్శి సమీపంలో ఈ కేంద్రం ఉంది.

కొత్తవి పెట్టకుండా ఇలా..

రాష్ట్రంలో గతంలో ఉన్న 13 జిల్లాల్లోనూ ఒక ఏరువాక కేంద్రం మరో కేవీకే పనిచేస్తున్నాయి. రైతులకు పూర్తిస్థాయిలో కాకపోయినా అవసరమైన సందర్భాల్లో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు ఉపయోగపడుతున్నారు. ప్రత్యేకించి వ్యవసాయ, ఉద్యాన అధికారులకు శిక్షణ తద్వారా రైతులకు మేలు జరిగేది. అలాగే పొలంబడి వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆదర్శ రైతులను గుర్తించి వారికి సాంకేతిక సలహాలు అందించడం ద్వారా ఇతర రైతులకు ఉపయోగపడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో ఈ కేంద్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన రంగాలలో రైతులకు ఉపకరించే రాయితీ పథకాలు, సాంకేతిక పథకాలను అటకెక్కించి రైతుభరోసా నిధులకు పరమితమైంది. తాజాగా రైతులకు సాంకేతిక, సలహాలు, సూచనలు ఇచ్చే కేంద్రాలను కూడా దూరం చేస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన నేపథ్యంలో కొత్తగా కేవీకే, ఏరువాక కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా రెండింటిలో ఒక కేంద్రాన్ని పాత జిల్లాలో, మరో కేంద్రాన్ని కొత్త జిల్లాకు తరలించే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఒంగోలులో ఉన్న ఏరువాక కేంద్రాన్ని పల్నాడు జిల్లాకేంద్రమైన నర్సరావుపేటకు తరలిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ఒంగోలులో ఉన్న ఏరువాక కేంద్రం ఏప్రిల్‌ 1 నుంచి అక్కడ పనిచేయనుంది.

పెద్ద జిల్లా.. వ్యవసాయమే ఆధారం

కొత్త జిల్లాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో ప్రకాశమే పెద్ద జిల్లా. పైగా ఎక్కువ శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి చోట రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం, కేంద్రాలు పెట్టడం వంటివి చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా ఉన్న వాటినీ తరలించేస్తోంది. మొత్తం మీద ఏరువాక కేంద్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుండటంతో ఇక జిల్లాలోని రైతులు అంతా దర్శి వద్ద ఉన్న కేవీకేపై ఆధారపడాల్సి రానుంది. అది జిల్లా కేంద్రానికే కాక, జిల్లాలోని అధిక ప్రాంతానికి దూరంగా ఉండటం వల్ల సరిగా సేవలు అందే అవకాశం లేదన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. కాగా ఏరువాక తరలింపు చర్యను సలహామండలి సభ్యుడు మ ండవ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ చర్య వల్ల ఇప్పటికే అంతంతమాత్రంగా రైతులకు అందుతున్న సాంకేతిక సలహాలు, సూచనలు మరింత దూరం అవుతున్నాయన్నారు. దీని వల్ల రైతులకు జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-30T23:22:30+05:30 IST