Share News

రోడ్డెక్కిన ఉపాధ్యాయులు

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:33 AM

ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయులు రోడ్డెక్కారు.

రోడ్డెక్కిన ఉపాధ్యాయులు
ఒంగోలులోని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న యూటీఎఫ్‌ నేతలు, టీచర్లు

తాలూకా, మండల కేంద్రాల్లో ఆందోళనలు

బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌

ఒంగోలు (విద్య), డిసెంబరు 27 : ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం సాయంత్రం జిల్లాలోని తాలూకా, మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలు, సరెండర్‌ లీవులు, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఆర్సీ, రెండు డీఏల బకాయిలు సుమారు రూ.12వేల కోట్లు, సరెండర్‌ లీవు బకాయిలకు సంబంధించి రూ.4500 కోట్లు ఉన్నా ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదని మండిపడ్డారు. పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ లోన్లు, పార్ట్‌ ఫైనల్‌ బకాయిలు మరో రూ.1,500 కోట్లు ఉందన్నారు. గత ఆగస్టులో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో అన్నిరకాల బకాయిలు సెప్టెంబరులో చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇంతవరకూ ఇచ్చిన పరిస్థితి లేకుండాపోయిందన్నారు. ఎస్‌.రవి అధ్యక్షతన జరిగిన ధర్నాలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, జి.ఉమామహేశ్వరి, చిన్నస్వామి, బాలరాజు, వెంకయ్య, ఝాన్సీ, ఎస్‌వి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 01:33 AM