నగరం నడిబొడ్డున దుర్గంధం..!

ABN , First Publish Date - 2023-09-26T00:24:27+05:30 IST

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ఒకవైపు ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. అందులో భాగంగా చెత్త రహిత పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు క్లీన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని చేపట్టామని పాలకులు డప్పు కొడుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితిలో చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఒంగోలు నగరం తయారైంది. నగరంలో సేకరించిన చెత్తను నగర నడిబొడ్డున వేయడంతో దుర్గంధం వ్యాపించి ప్రజార్యోగానికి భరోసా కరువైంది.

నగరం నడిబొడ్డున దుర్గంధం..!
ఊరచెరువులో డంపింగ్‌ చేస్తున్న చెత్త వాహనాలు

ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న కార్పొరేషన్‌

ఒంగోలు (కార్పొరేషన్‌), సెప్టెంబరు 25 : ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ఒకవైపు ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. అందులో భాగంగా చెత్త రహిత పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు క్లీన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని చేపట్టామని పాలకులు డప్పు కొడుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితిలో చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఒంగోలు నగరం తయారైంది. నగరంలో సేకరించిన చెత్తను నగర నడిబొడ్డున వేయడంతో దుర్గంధం వ్యాపించి ప్రజార్యోగానికి భరోసా కరువైంది. ఊరచెరువులో చెత్త వేయడాన్ని ఇటీవల చేపల మార్కెట్‌ వ్యాపారులు తీవ్రంగా ప్రతిఘటించారు. చెత్తా, చెదారాన్ని గుత్తికొండవారిపాలెంలోని డంపింగ్‌ యార్డులో పోయకుండా, క్లాప్‌ ఆటోలు ఊరచెరువులోనే డపింగ్‌ చేయడాన్ని అడ్డుకుని ఆందోళనచేపట్టి సరిగా వారం రోజులు కూడా కాలేదు. అయితే మళ్లీ అక్కడే చెత్తను డంపింగ్‌ చేయడం చూస్తుంటే ప్రజారోగ్యం పట్ల కార్పొరేషన్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధం అవుతోంది. చేపల వ్యాపారులు ఆందోళన చేపట్టగా కార్పొరేషన్‌ పారిశుధ్య అధికారులు డంపింగ్‌ చేయడాన్ని నిలిపివేస్తామన్నారు. పదిరోజుల్లో ప్రత్యామ్నాయంగా ఊరి చివరిలో చెత్తను వేస్తామని తెలిపారు. ఆయితే ఆ దిశగా చర్యలు లేకపోగా, మళ్లీ అక్కడే చెత్త వేయడం, ఇటీవల కురుస్తున్న వర్షాలకు దుర్గంధం వ్యాపించి పలువురు రోగాల బారిన పడుతున్నారు. కేవలం చేపల వ్యాపారులే కాకుండా మార్కెట్‌కు వెళ్ళే కొనుగోలుదారులు సైతం ఈ దుర్గంధం వలన అల్లాడిపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ‘వీరింతే మారరంతే’ అన్నట్లుగా వ్యవహరిస్తున్న కార్పొరేషన్‌ తీరుపై పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఊరచెరువులో పార్కు కోసం కేటాయించిన స్థలంలో చెత్త వేయకుండా ప్రజా ప్రయోజనార్థం వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-09-26T00:24:27+05:30 IST