గిద్దలూరు రైల్వే కాలనీలోని సెయింట్ పాల్స్ ఎయిడెడ్ స్కూలు
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:00 PM
గిద్దలూరు సెయింట్ పాల్స్ యాజమాన్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏడు స్కూళ్లను నిర్వహిస్తున్నారు. ఇటీవల విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి వాటిలో జరుగుతున్న అక్రమాలను గుర్తించారు. విద్యార్థులకు కనీస వసతులు లేవు. పాఠశాలలు నిర్వహిస్తున్న రేకుల షెడ్లు శిఽథిలావస్థకు చేరాయి.
సెయింట్ పాల్స్ ఎయిడెడ్ స్కూల్‌లో భారీ అక్రమాలు
విద్యార్థులకు కనీస వసతులు కరువు
పెద్దఎత్తున బోగస్ హాజరు
చర్యలకు ప్రభుత్వ ఆదేశం
ఒంగోలు (విద్య), డిసెంబరు 17 : గిద్దలూరు సెయింట్ పాల్స్ యాజమాన్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏడు స్కూళ్లను నిర్వహిస్తున్నారు. ఇటీవల విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి వాటిలో జరుగుతున్న అక్రమాలను గుర్తించారు. విద్యార్థులకు కనీస వసతులు లేవు. పాఠశాలలు నిర్వహిస్తున్న రేకుల షెడ్లు శిఽథిలావస్థకు చేరాయి. తాగునీరు, టాయిలెట్లు, సైన్స్ ప్రయోగశాలలు లేవు. కొన్ని స్కూళ్లలో అసలు విద్యార్థులకు సౌకర్యాలు కూడా లేవు. దాదాపు అన్నిచోట్లా భారీగా బోగస్ హాజరును కూడా విచారణాధికారులు గుర్తించారు. ఒక పాఠశాలలో అయితే ఏకంగా పందులు సంచరిస్తున్నాయి. రాష్ట్రస్థాయి అధికారి నివేదిక మేరకు ఆ పాఠశాలపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ స్కూళ్లపై ఈనెల 15లోపు చర్యలు తీసుకుని ఆ వివరాలను తనకు వ్యక్తిగతంగా కలిసి వివరించాలని ఆర్‌జేడీ, డీఈవోలను ఆదేశిస్తూ పాఠశాల విద్యా కమిషనర్ ఎస్.సురే్‌షకుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.
రాష్ట్రస్థాయి అధికారుల తనిఖీలో వెల్లడైన వివరాలను పాఠశాల వారీగా ఇలా ఉన్నాయి.
గిద్దలూరులోని సత్యనారాయణనగర్‌లో ఉన్న సెయింట్ పాల్స్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతి వరకూ 152మంది చదువుతున్నట్లు హాజరుపట్టీలో నమోదు చేశారు అయితే అధికారి తనిఖీ చేసిన సమయంలో 122మంది హాజరైనట్లు చూపారు. అయితే వీరిలో 59 మందిని ఇతర పాఠశాలల విద్యార్థులుగా తనిఖీ అఽధికారి గుర్తించారు.
గిద్దలూరు రైల్వే కాలనీలోని ఎయిడెడ్ హైస్కూల్‌లో 6 నుంచి 10వ తరగతి వరకూ 247మంది చదువుతున్నట్లు పేర్లు నమోదు చేశారు. అయితే అధికారి తనిఖీ రోజు కేవలం సగంమంది అంటే 127 మంది హాజరు కాగా వీరిలో 16మంది ఇతర పాఠశాలలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
గిద్దలూరు రైల్వే కాలనీలోని ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులకు 144 మంది విద్యార్థులు చదువుతున్నట్లు పేర్లు నమోదు చేయగా 61మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 39 మంది ఇతర పాఠశాలల విద్యార్థులు కావడం గమనార్హం.
గిద్దలూరు నల్లబండ బజారులోని ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 1నుంచి 5 తరగతులకు 150 మంది పిల్లల పేర్లు నమోదు చేయగా వీరిలో మూడోవంతు అంటే 58 మంది మాత్రమే హాజరయ్యారు. అందులో కూడా ఇతర పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. అక్కడ కూడా పందులు యథేచ్ఛగా సంచరిస్తుండటాన్ని అధికారులు గుర్తించారు.
గిద్దలూరు నాల్గో వార్డు గణే్‌షనగర్‌లోని ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులకు 90మంది పేర్లు నమోదు చేయగా 70మంది హాజరైనట్లు చూపించారు. వీరిలో 33 మంది ఇతర పాఠశాలల విద్యార్థులు కావడం గమనార్హం.
గిద్దలూరు సొసైటీ కాలనీలోని ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులను 169 మంది చదువుతున్నట్లు పేర్లు చూపగా కేవలం 77మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 36మంది ఇతర స్కూళ్ల వారు కావడం గమనార్హం. అదేవిధంగా అక్కడి హైస్కూలులో 6 నుంచి 10 తరగతులకు 346మంది పేర్లను రికార్డుల్లో చూపిస్తుండగా కేవలం 171 మంది మాత్రమే హాజరయ్యారు.
రాచర్ల మండలం వద్దులవాగుపల్లి ఎయిడెడ్ పాఠశాలలో 6 నుంచి 10 తరగతుల్లో 127 మంది విద్యార్థులు ఉన్నట్లు చూపిస్తుండగా కేవలం 71మంది మాత్రమే హాజరయ్యారు.
పాఠశాలల్లో కనీస వసతులు లేకుండా నిర్వహించడంతోపాటు పాఠశాలల్లో భారీగా బోగస్ ఎన్‌రోల్‌మెంట్ నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇతర పాఠశాలల విద్యార్థులను తరలించి బోగస్ హాజరు వేస్తున్నట్లుగా ఆ అధికారి గుర్తించారు. ఈ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.