Share News

నీటి కోసం పాట్లు

ABN , Publish Date - Dec 17 , 2023 | 10:18 PM

అద్దంకి నియోజకవర్గం లో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సుమారు ఐదారు సంవత్సరాల క్రితం రద్దు చేశారు. సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం ఉన్నా అద్దె భవనంలో అరకొర వసతుల మధ్య పై అంతస్థులలో నడుపుతున్నారు. అద్దంకి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం రోడ్డులో ఉన్న సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతిగృహంలో తరచూ నీటి సమస్య ఉత్పన్నమవుతుంది.

నీటి కోసం పాట్లు
ఓ వస్త్ర దుకాణం ముందు నీరు పట్టుకుంటున్న వసతి గృహం విద్యార్థినులు

వసతిగృహం విద్యార్థినుల తిప్పలు

రోడ్డు దాటి.. డివైడర్‌ ఎక్కి కుళాయి నీటిని తెచ్చుకుంటున్న వైనం

తరచూ ఇదే పరిస్థితి

పట్టించుకోని అధికారులు

అద్దంకి, డిసెంబరు 17: అద్దంకి నియోజకవర్గం లో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సుమారు ఐదారు సంవత్సరాల క్రితం రద్దు చేశారు. సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం ఉన్నా అద్దె భవనంలో అరకొర వసతుల మధ్య పై అంతస్థులలో నడుపుతున్నారు. అద్దంకి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం రోడ్డులో ఉన్న సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతిగృహంలో తరచూ నీటి సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో విద్యార్థినులు బకెట్‌లతో రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. సరిపడ నీరు అందించకపోవటంతో కళాశాలల పనిదినాలలో విద్యార్థినులు రా త్రి సమయంలో రోడ్డు, డివైడర్‌ దాటి ఎదురుగా ఉన్న వస్త్ర దుకాణం యజమాని దయా దాక్షిణ్యాలపై కుళాయి నీటిని పట్టుకొని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

వసతి గృహానికి నీటి సరఫరా చేసే మోటార్‌ శనివారం మరమ్మతులకు గురయింది. దీంతో ఆదివారం ఉదయం నుంచే విద్యార్థినులు పరాయి పంచన ఉండే కుళాయి వద్ద కు బకెట్‌లతో క్యూ కట్టారు. నీళ్ళ బకెట్‌లను రోడ్డు, డివైడర్‌ దాటుకుంటూ తీసుకువెళుతున్నారు. దీనికితోడు పైఅంతస్తుకు మోసుకు పోవాల్సి రావటం మరింత ఇబ్బందికరంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో విద్యార్థినులు బకెట్‌లతో నీరు తీసుకుపోవటం పట్ల పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సాయంత్రం, రాత్రి సమయాలలో ఆకతాయిల వేధింపులు కూడా చోటు చేసుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చి వస్తున్న విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు, రక్షణతో వసతి గృహం ఉండాల్సి ఉండగా, అవేమి అధికారులు పట్టించుకోకపోవటం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Dec 17 , 2023 | 10:18 PM