చూసిన కనులదే భాగ్యం

ABN , First Publish Date - 2023-03-31T00:23:48+05:30 IST

శ్రీరామనవమిని పురస్కరించుకొని మార్కాపురం పట్టణం శ్రీరామ నామస్మరణలతో పులకించిపోయింది.

చూసిన కనులదే భాగ్యం

మార్కాపురం(వన్‌టౌన్‌), మార్చి 30: శ్రీరామనవమిని పురస్కరించుకొని మార్కాపురం పట్టణం శ్రీరామ నామస్మరణలతో పులకించిపోయింది. పట్టణంలోని ప్రసన్న రామాలయం, పట్టాభి రామాలయం, రజకవీధి, కోనేరు వీధులతో పాటు పలు వీధులలో రామాలయాల వద్ద కల్యాణం నిర్వహించారు. ప్రసన్న రామస్వామి ఆలయంలో అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, ఏవీకే నరసింహాచార్యులు, నంద్యాల రంగాచార్యుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ ఘట్టాలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై కళ్యాణాన్ని తిలకించారు. పానకం, వడపప్పు భక్తులకు పంచారు.

గిద్దలూరు : శ్రీరామనవమి వేడుకలు గ్రామాల్లో, పట్టణాల్లో వైభవంగా జరిగాయి. ప్రజలు తమ ఇళ్లలో పూజలు ముగించుకుని రామాలయాలకు వెళ్లి సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని పాత బద్వేలు రోడ్డులోని రామాలయంలో, న్యూ బద్వేలు రోడ్డులోని పట్టాభి రామస్వామి దేవాల యంలో, శ్రీవాసవి కన్యకాపరమే శ్వరి దేవాలయంలో, షిర్డిసాయిబాబా దేవాలయంలో సీతారాముల కల్యాణం పట్టాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చొని క్రతువు నిర్వహించారు. సంజీవ రాయునిపేట గ్రామంలో కల్యాణానికి వచ్చిన భక్తులకు వాసవిక్లబ్‌ ప్రతినిధులు పానకం, వడపప్పు ప్రసాదాలు పంచిపెట్టారు. పట్టణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి, కొత్తపల్లి, కొండపేట, కే.ఎస్‌.పల్లి, ముండ్లపాడు, పొదలకొండపల్లి తదితర గ్రామాల్లోని రామాలయాలు, ఆంజనేయస్వామి దేవాలయాల్లో శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు పొదలకొండపల్లిలో ఎడ్లబల ప్రదర్శన పోటీలు నిర్వహించారు.

కంభం : కంభం, అర్థవీడు మండలాల్లో పలు గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా రామాల యాలు భక్తులతో కిటకిటలాడాయి. లింగోజీపల్లిలో గురువారం ఉదయం అంకురార్పణ, సహస్త్రనామ పూజ అనంతరం సీతారాముల కల్యాణం వేదపండి తుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. పట్టణంలోని శ్రీపట్టాభిరామస్వామి దేవాలయం, కందులా పురంలోని రాములవారి దేవాలయాలలో భక్తులు తరలివచ్చారు. వడపప్పు, పానకాలు పంపిణీ చేశారు. అన్నదానం నిర్వహించారు.

రాచర్ల : మండలంలోని అన్ని గ్రామాలలో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గురువారం రాములవారి ఆల యాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. అనుమలవీడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్‌రెడ్డి తనయుడు పిడతల ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి సీతారాముల కల్యాణం నిర్వహించారు. పలువురు భక్తులు పాల్గొని కల్యాణాన్ని వీక్షించారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

త్రిపురాంతకం : శ్రీరామనవమి వేడుకలను భక్తులు గురువారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పాతరామాలయం, కోదండ రామాలయం, టి.చెర్లోపల్లిలోని వెంకటేశ్వరాలయాలతోపాటు అన్ని గ్రామాలలో చలువ పందిళ్లు ఏర్పాటుచేసి మంత్రోచ్చరణల నడుమ సీతారామకల్యాణం నిర్వహించారు. అనంతరం పానకం, వడపప్పు పంపిణీ చేశారు.

ఎర్రగొండపాలెం : శ్రీరామనవమి సందర్భంగా మండలంలోని రామాలయాలు శ్రీరామ నామస్మరణతో మారుమోగాయి. మండలంలో అన్ని గ్రామాల్లో గురువారం ఉదయం నుంచి రామాలయాల్లో సీతారామలక్ష్మణుల మూలవిరాట్‌లకు ప్రత్యేక అలంకరణ చేశారు. ఎర్రగొండపాలెంలోని పట్టాభిరామస్వామి ఆలయం, నరసాయపాలెం, గంగాపాలెం, బోయలపల్లె, వాదంపల్లి, అమానిగుడిపాడు, కొలుకుల, గంజివారిపల్లె, వీరభద్రాపురం, గోళ్లవీడపి గ్రామాల్లో ఉదయం 10గంటలనుంచి 12గంటలలోపు వేదమంత్రోచ్చారణతో సీతారాముల ఉత్సవమూర్తులకు కల్యాణం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఎర్రగొండపాలెంలో పట్టాభిరామస్వామి ఆలయం అర్చకులు బి.పవన్‌కుమార్‌, ఎస్‌.వీ.రమేష్‌, భక్తులు పాల్గొన్నారు.

తర్లుపాడు మండలంలోని శ్రీరామనవమి వేడుకలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాల వద్ద చలువ పందిళ్లు వేసి విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తర్లుపాడులోని పట్టాభిరామస్వామి, కోదండరామస్వామి, ముదిరాజ్‌ కాలనీ, కోటవీధి, రజకవీధులలో కల్యాణ మహోత్సవాలు నిర్వహించారు. అర్చకులు ఓరుగంటి పవన్‌ ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామాలయాల వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పానకం, వడపప్పు స్వీకరించారు. స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

కొనకనమిట్ల : మండలంలోని పలు గ్రామాలలో గురువారం శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సీతాసమేత శ్రీరామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయా గ్రామాలలో స్వామివారి కల్యాణం నిర్వహించేందుకు దంపతులు పీటలపై కూర్చున్నారు. వేదపండితులు దంపతులతో సీతాసమేత రామచంద్రమూర్తి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

పుల్లలచెరువు : పుల్లలచెరువు మండలంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి.గురువారం మండల కేంద్రమైన పుల్లలచెరువులోని రామాలయంలో గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిపించారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. పలు గ్రామాల్లో ఉదయం నుంచే రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు.

పెద్దదోర్నాల : మండలంలో శ్రీరామనవమి వేడుకలను గురువారం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. స్థానిక పట్టాభిరామస్వామి దేవాలయం వద్ద నిర్వహించిన సీతారాముల కల్యాణ వేడుకల్లో రాష్ట్ర పట్టణ పరుపాలక శాఖ మంత్రి ఆదిమూలపు రమేష్‌ తనయుడు విశాల్‌ పట్టువస్త్రాలను అందజేశారు. మండలంలోని అయినముక్కల, తిమ్మాపురం గ్రామాల్లో సీతారామస్వామి దేవాలయాల్లో జానకిరాములకు కల్యాణం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం పానకం, వడపప్పు పంచిపెట్టారు. సాయంత్రం ఆయా దేవాలయాల్లో సీతారాములను ప్రత్యేకరథంపై ప్రతిష్టించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్‌ వెచ్చా హరగోపాల్‌ వైసీపీ మండల కన్వీనర్‌ వెంకటరమణారెడ్డి, నాయకులు గురవారెడ్డి పాల్గొన్నారు.

పొదిలిరూరల్‌ : శ్రీరామనవమి వేడుకలను గురువారం మండలంలో ఘనంగా నిర్వహించారు. సీతాసమేత శ్రీరామచంద్రుడికి ప్రత్యేక పూజలు చేసి వడపప్పు పానకం పంచిపెట్టారు. పట్టణంలోని జూనియర్‌ కళాశాల రోడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలను ఉంచి అత్యంత వైభవంగా కల్యాణం నిర్వహించారు. పాతూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న గునుపూడివారి ఆధ్వర్యంలో సీతారామ కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. అదేవిదంగా కాటూరివారిపాలెం, ఉప్పలపాడు, తలమళ్ల, కుంచేపల్లి తదితర గ్రామాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం భక్తులకు వడపప్పు, పానకం, అన్నదాన కార్యక్రమాలు, ప్రసాదాలు పంపిణీ చేశారు.

Updated Date - 2023-03-31T00:23:48+05:30 IST