సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన ఉధృతం
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:30 AM
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పలువురు డిమాండ్ చేశారు.
వినూత్నరీతిలో నిరసనలు
ఒంగోలులో భారీ ర్యాలీ, మానవహారం
ఒంగోలు (కలెక్టరేట్), డిసెంబరు 23 : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పలువురు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసగా వారు చేపట్టిన ఉద్యమాన్ని ఉధృతం చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్షకు దిగారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయన్నారు. మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. అనంతరం ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ మొరను ఆలకించాలని నినదించారు. నల్ల రిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకోవడంతోపాటు తలకిందులుగా నిల్చొని శీర్షాసనంలో నిరసన తెలిపారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. చర్చి సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. ధర్నాకు టీఎన్‌యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాసరావు, నల్లూరి వెంకటనరసింహారావు, ఎం.రవీంద్రబాబులు సంఘీభావం తెలిపి ఆందోళనలకు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.హరిబాబు, యు.కల్యాణి పాల్గొన్నారు.