పీటముడి
ABN , Publish Date - Dec 28 , 2023 | 11:15 PM
జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎంపికలో పీటముడి పడింది. దీంతో ఎంపిక కార్యక్రమాన్ని శుక్రవారానికి సీఎం వాయిదా వేశారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి విషయంలో బాలినేని సిఫార్సులకు సీఎం అభిప్రాయానికి మధ్య తేడాలు ఉండటమే అందుకు కారణమైంది. దీంతో మరోసారి విజయసాయి, బాలినేని చర్చించుకుని శుక్రవారం రావాలని ఆయన సూచించినట్లు సమాచారం. మరోవైపు లోక్‌సభ టికెట్ విషయంలో మాగుంట ప్రస్తావన వచ్చినప్పుడు ఇప్పుడు దానిపై చర్చ అనవసరం, ఏమి చేయాలో సమయం వచ్చినప్పుడు చూద్దామని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి మాత్రం తాటిపర్తి చంద్రశేఖర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే దర్శి నుంచి బూచేపల్లి ఎంపిక కూడా ఖరారైనట్లు సమాచారం.
వైసీపీ అభ్యర్థుల ఎంపికలో ప్రతిష్టంభన
కనిగిరిపై విజయసాయి వద్ద రచ్చ
బుర్రాకు వద్దని నాయకుల హడావుడి
శిద్దా కోసం పట్టుబట్టిన బాలినేని
మార్కాపురమా లేక గిద్దలూరా?
మాగుంటపై చర్చను తోసిపుచ్చిన జగన్
వైపాలెంకు చంద్రశేఖర్..దర్శికి బూచేపల్లే
నేడు ఖరారు చేయనున్న అధిష్ఠానం
జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎంపికలో పీటముడి పడింది. దీంతో ఎంపిక కార్యక్రమాన్ని శుక్రవారానికి సీఎం వాయిదా వేశారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి విషయంలో బాలినేని సిఫార్సులకు సీఎం అభిప్రాయానికి మధ్య తేడాలు ఉండటమే అందుకు కారణమైంది. దీంతో మరోసారి విజయసాయి, బాలినేని చర్చించుకుని శుక్రవారం రావాలని ఆయన సూచించినట్లు సమాచారం. మరోవైపు లోక్‌సభ టికెట్ విషయంలో మాగుంట ప్రస్తావన వచ్చినప్పుడు ఇప్పుడు దానిపై చర్చ అనవసరం, ఏమి చేయాలో సమయం వచ్చినప్పుడు చూద్దామని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి మాత్రం తాటిపర్తి చంద్రశేఖర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే దర్శి నుంచి బూచేపల్లి ఎంపిక కూడా ఖరారైనట్లు సమాచారం.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
రాష్ట్రం మొత్తంగా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను ఈనెల 30వ తేదీకి పూర్తిచేయాలని వైసీపీ భావిస్తోంది. ఆ మేరకు రీజనల్ కోఆర్డినేటర్లకు సమాచారం ఇచ్చిన జగన్ గురువారం సాయంత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలతో భేటీ అయ్యారు. తొలుత గురువారం ఉదయం విజయసాయిరెడ్డితో ఐప్యాక్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆ ప్రకారం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల వైసీపీ ఇన్‌చార్జిల ఎంపికపై ఓ జాబితా రూపొందించారు. మధ్యాహ్నం తర్వాత బాలినేనితో సాయిరెడ్డి మంతనాలు జరిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఇద్దరూ కలిసి సీఎం జగన్ వద్దకు వెళ్లారు. ముందు ప్రకటించిన కొండపి, సంతనూతలపాడు ఇన్‌చార్జిలుగా సురేష్, నాగార్జునల పేర్లును ఖరారు చేశారు. అద్దంకి నుంచి కూడా హనిమిరెడ్డి వైపే సీఎం మొగ్గుచూపినట్లు తెలిసింది. తర్వాత పర్చూరుకు చైతన్య పేరు పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. అయితే సీఎం మాత్రం ఆమంచి వైపే ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత పశ్చిమ ప్రాంత నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చ ప్రారంభమైంది.
బూచేపల్లి, చంద్రశేఖర్‌లకు ఖరారు
ముందుగానే చంద్రశేఖర్‌ను ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించేందుకు జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దర్శి విషయం పెద్దగా ప్రస్తావనకు రాకుండానే బూచేపల్లి పేరు ఖరారైనట్లు సీఎం సంకేతాలిచ్చారని చెబుతున్నారు
శిద్దా కోసం బాలినేని పట్టు
మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకి పోటీచేసే అవకాశం ఇవ్వాలని బాలినేని గట్టిగా సూచించినట్లు సమాచారం. ఆ మేరకు మార్కాపురంలో శిద్దా పోటీ చేస్తే బాగుంటుందని కూడా చెప్పినట్లు తెలిసింది. అయితే శిద్దాను గిద్దలూరు పంపిస్తే సరిపోతుందని ప్రతిపాదనను ఐ ప్యాక్ ప్రతినిధులు సూచించారు. దానిపై బాలినేని గిద్దలూరులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన సత్యనారాయణరెడ్డిని పోటికి పెట్టి కనిగిరిలో బుర్రాను తప్పించి మరో బీసీకి అవకాశం ఇవ్వాలని కూడా సూ చించినట్లు తెలిసింది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ప్రతిష్టంభన నెలకొంది. అందిన సమాచారం మేరకు.. సీఎంకు ఐప్యాక్ ద్వారా వెళ్లిన జాబితాలో మార్కాపురానికి నాగార్జునరెడ్డి, కనిగిరికి బుర్రా, గిద్దలూరుకు శిద్దా పేర్లు ఉన్నట్లు తెలిసింది. గిద్దలూరులో రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యతనివ్వాలని, అలాగే శిద్దాకు ఖచ్చితంగా అవకాశం ఇ వ్వాలని బాలినేని సూచించటంతో ఆలోచనలో పడినట్లు సమాచారం. దీంతో స్థానిక పరిస్థితులపై బాగా అధ్యయనం చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకుని మీరిద్దరు చర్చించుకుని శుక్రవారం సాయంత్రం రావాలని సాయి, బాలినేనిలకు సీఎం సూచించినట్లు తెలిసింది.
కనిగిరిపై రచ్చ
కనిగిరి నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు అక్కడికెళ్లారు. వారంతా సీఎం వద్దకు వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు విజయసాయిని కలిసి బుర్రాకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. లోపల సీఎం వద్ద బాలినేని కూడా అదే విషయాన్ని చెప్పగా కనిగిరిలోబీసీకి అవకాశం ఇవ్వాలన్న నిర్ణయంలో మార్పు లేదని సీఎం అన్నట్లు సమాచారం. బుర్రాకు కాకుండా ఎవరికైనా ఇవ్వాలని ఆ నియోజకవర్గంలోని కొందరు నాయకులు అంటున్న దశలో గిద్దలూరు, కనిగిరిలపై చర్చ జరిగినట్లు తెలిసింది. బుర్రాను గిద్దలూరు పంపి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణరెడ్డిని కనిగిరి వేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన కూడా వచ్చినట్లు తెలిసింది. కనిగిరి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బాబూరావు కూడా గురువారం అమరావతిలో నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో బీసీకి కనిగిరే ఇస్తారా ఇస్తే ఐప్యాక్ ప్రతినిధులు సూచించినట్లు బుర్రాకే అవకాశం వస్తుందా లేక బుర్రాను గిద్దలూరు పంపుతారా? అదే జరిగితే శిద్దా పరిస్థితి ఏంటనే విషయాలు ప్రశ్నార్థకంగా మిగిలాయి. అయితే బాలినేని సూచనలను గౌరవిస్తూ వైపాలెంలో చంద్రశేఖర్‌తోపాటు శిద్దాను గిద్దలూరు పంపి మార్కాపురంలో నాగార్జునరెడ్డికి, కనిగిరిలో బుర్రాకు అవకాశం ఇచ్చే వైపే అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం
ఎంపీ విషయం మళ్లీ చూద్దాం
ఈ చర్చల సమయంలో మాగుంట లోక్‌సభ టికెట్ విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మాగుంటకు గతంలో సీఎం రెండు షరతులు విధించగా ఆయన వాటిని అంగీకరించనివిషయం తెలిసిందే. కారణం ఏమైనప్పటీకీ లోక్‌సభ విషయం తర్వాత చూద్దాం. పార్టీ చెప్పిన విషయాలపై మాగుంట మున్ముందు ఎలా స్పందిస్తారో చూద్దామంటూ ఇప్పుడు అసెంబ్లీ అభ్యర్థుల విషయమే మాట్లాడండి అని సీఎం కరాఖండిగా చెప్పినట్లు తెలిసింది.
నాయకులతో బాలినేని మంతనాలు
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి బాలినేని విజయవాడలో ఉండి ఆయా నియోజకవర్గాల నాయకులతో నేరుగా, ఫోన్‌లో మంతనాలు ప్రారంభించారు. అప్పటికే విజయవాడ చేరిన శిద్దా తనకు దర్శి నుంచి అవకాశం ఇవ్వాలని వేరే నియోజకవర్గాలపై ఆసక్తిలేదని చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత అక్కడున్న కనిగిరి నాయకులతోనూ, అలాగే గిద్దలూరు, మార్కాపురంలకు చెందిన కొందరు నాయకులతోనూ బాలినేని సమాలోచనలు జరిపినట్లు సమాచారం. శుక్రవారం మరోసారి బాలినేని, విజయసాయి సమావేశమై ఈ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చించుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం జగన్ వద్ద ఇంచార్జిల ఎంపిక ఖరారుకానుంది.