అధిక పంటపై పెనాల్టీని రద్దు చేయాలి

ABN , First Publish Date - 2023-02-21T01:15:22+05:30 IST

అధిక పంట ఉత్పత్తిపై పొగాకు బోర్డు రైతుల నుంచి వసూలు చేస్తున్న పెనాల్టీ (అపరాధ రుసుం)ను ప్రస్తుత సీజన్‌కు రద్దు చేయాలని పొగాకు రైతు ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

అధిక పంటపై పెనాల్టీని రద్దు చేయాలి

పొగాకు రైతుప్రతినిధుల డిమాండ్‌

అధికారులను కలవాలని నిర్ణయం

ఒంగోలు, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): అధిక పంట ఉత్పత్తిపై పొగాకు బోర్డు రైతుల నుంచి వసూలు చేస్తున్న పెనాల్టీ (అపరాధ రుసుం)ను ప్రస్తుత సీజన్‌కు రద్దు చేయాలని పొగాకు రైతు ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది తుఫాన్‌ కారణంగా రైతులు రెండు మూడుసార్లు పంట సాగు చేయాల్సి వచ్చిందన్నారు. దీంతో పెట్టుబడు లు భారీగా పెరిగాయన్నారు. ఇలాంటి తరుణంలో పెనాల్టీలను వసూలు చేస్తే మరింత భారం అవుతుందని వారు పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి దక్షిణాదిలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్‌బీఎస్‌ రీజియన్‌ పరిధిలోని రైతు ప్రతినిధులు పలువురు సోమవారం ఒంగోలు లో భేటీ అయ్యారు. స్థానిక రామనగర్‌లోని ఎంపీ మాగుంట కార్యాల యంలో ఈ సమావేశం జరిగింది. బోర్డు అనుమతి ఇచ్చిన దాని కన్నా కొన్ని గ్రామాల్లో పంట కొంతమేర అధికంగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ గతంతో పోల్చితే ఈ ఏడాది ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరిగాయని వారు అభిప్రాయపడ్డారు. ఆ పరిస్థితులలో అదనపు ఉత్పత్తి పేరుతో బోర్డు పెనాల్టీలు వసూలు చేస్తే క్వింటాకు సగటున రూ.వెయ్యికి పైగా భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్‌కు కర్ణాటకలో పెనాల్టీల రద్దుతోపాటు అనధికార బ్యారన్ల ద్వారా అమ్మకాలకు అనుమతి ఇచ్చినందున ఆ వెసులుబాటును ఇక్కడి రైతులకు కూడా కల్పించాలని కోరారు. ఆమేరకు బోర్డు ఉన్నతాధికారులతో పాటు కేంద్ర వాణిజ్య శాఖ అధికారులను కలిసి కోరాలని తీర్మానించారు. సమావేశంలో బోర్డు సభ్యులు వరప్రసాద్‌, ఎం.సుబ్బారెడ్డి, పమ్మి భద్రిరెడ్డి, వివిధ వేలం కేంద్రాల ప్రతినిధులు వడ్డెళ్ళ ప్రసాద్‌, అబ్బూరి శేషగిరి, రావి ఉమామ హేశ్వరరావు, నన్నూరి నాగేశ్వరరావు, రామాంజనేయులు ఉన్నారు.

Updated Date - 2023-02-21T01:15:23+05:30 IST