Share News

నిరసన వెల్లువ

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:53 AM

డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారానికి 18వ రోజుకు చేరింది.

నిరసన వెల్లువ
ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు

అంగన్‌వాడీలకు కార్మిక సంఘాల మద్దతు

ఒంగోలులో నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ

జిల్లావ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు

18వ రోజుకు చేరిన సమ్మె

టంగుటూరులో పాల్గొన్న ఎమ్మెల్యే స్వామి

కనిగిరిలో శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన ఉగ్ర

ఒంగోలు నగరం, డిసెంబరు 29 : డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారానికి 18వ రోజుకు చేరింది. వారి ఆందోళనకు పలు కార్మిక సంఘాలు మద్దతు తెలియజేయడంతోపాటు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొన్నాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమై హెడ్‌ పోస్టాఫీసు, చర్చి సెంటర్‌ మీదుగా కలెక్టరేట్‌ వద్దకు చేరుకుంది. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు నినాదాలు చేశారు. ప్రభుత్వం మొండివైఖరిని వీడాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం ప్రకాశం భవనం వద్ద జరుగుతున్న అంగన్‌వాడీల దీక్షా శిబిరం వద్దకు చేరుకుని నాయకులు ప్రసంగించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకుడు ఆర్‌.మోహన్‌, రైతుసంఘం నాయకుడు చుండూరి రంగారావు మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు, రిటైర్మెంట్‌ ప్రయోజనాల కోసం కార్యకర్తలు, ఆయాలు 18 రోజులుగా పోరాడుతుంటే రాష్ట్రప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరించడం తగదన్నారు. అంగన్‌వాడీల ఉద్యమాన్ని చిన్నచూపు చూస్తోందని, ట్రేడ్‌ యూనియన్లు కూడా వారితో కలిసి ప్రభుత్వ దిగొచ్చే స్థాయికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

స్వామి, ఉగ్ర మద్దతు

జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీలు చేస్తున్న ఆందోళనకు మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. టంగుటూరులోని దీక్షా శిబిరం వద్దకు కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి వెళ్లి తన మద్దతు తెలిపారు. ప్రభుత్వం అంగన్‌వాడీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిగిరిలోని దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి సందర్శించారు. వారి పోరాటానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. జగన్‌ పాలనలో ఏ ఉద్యోగీ ఆనందంగా లేడని ఆయన ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. అంగన్‌వాడీల న్యాయమైన కోర్కెలను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించటం తగదన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కేంద్రాల్లో జరుగుతున్న దీక్షలకు స్థానిక ప్రజాప్రతినిధులు, ట్రేడ్‌ యూనియన్‌, ప్రజా సంఘాల నాయకులు తమ మద్దతు తెలియజేస్తూ దీక్షల్లో పాల్గొన్నారు. ఒంగోలులో శుక్రవారం దీక్షలను అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ గత 18రోజులుగా జిల్లాకేంద్రంలో, ప్రాజెక్టు కేంద్రాల్లో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర నాయకులు జి.వి. సుజాత, డెయిరీ ఈయూ నాయకులు శ్రీనివాసరావు, సీఐటీయూ నగర కార్యదర్శి మహేష్‌, నగర ఉపాధ్యక్షులు దామా శ్రీనివాసులు, కెవి.సుబ్బమ్మ, కె.ప్రశాంతి, హేమీమా, సిహెచ్‌.జ్యోతి, సంధ్యారాణి పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:53 AM