Share News

కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:55 AM

అంగన్వాడీల సమ్మె శనివారానికి ఐదో రోజుకు చేరింది. కార్యకర్తలు, ఆయాలు ఉద్యమాన్ని రోజురోజుకూ ఉధృతం చేస్తున్నారు.

కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె
ఒంగోలులో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతున్న కార్యకర్తలు, ఆయాలు

తాళాలు పగులగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ధర్నాలు

కేంద్రాల నిర్వహణకు పొదుపు సంఘాలు

రంగంలోకి దింపిన ప్రభుత్వం

ఒంగోలు నగరం, డిసెంబరు 16: అంగన్వాడీల సమ్మె శనివారానికి ఐదో రోజుకు చేరింది. కార్యకర్తలు, ఆయాలు ఉద్యమాన్ని రోజురోజుకూ ఉధృతం చేస్తున్నారు. ఆందోళనను అణచివేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటు న్నా ఏమాత్రం వెనుకంజ వేయటం లేదు. శనివారం కూడా జిల్లాలో కొన్ని కేంద్రాలను సచివాలయ సిబ్బంది బలవంతంగా తీశారు. ఆ సందర్భంగా పలుప్రాంతాల్లో అంగన్వాడీల నుంచి ప్రతిఘటన ఎదురైంది. జిల్లాలోని 13 ప్రాజెక్టుల్లో ఉన్న 2,903 కేంద్రాలూ పనిచేస్తున్నాయని ఐసీడీఎస్‌ అధికారు లు చెబుతున్నా సగానికిసగం కేంద్రాలు తెరుచుకోవడం లేదు. అంగన్వా డీలు ఒకపక్క సమ్మె పాటిస్తూనే మరోపక్క ఆయా ప్రాజెక్టు కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నారు. కేంద్రాల తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించటం పట్ల తీవ్రఆగ్రహంతో ఉన్న అంగన్వాడీలు శనివారం ఎక్కడికక్కడ పోలీసు స్టేషన్‌లకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. అక్రమంగా లోపలికి ప్రవేశించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐటీయూ నాయకులు మహేష్‌, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా నాయకులు కేవీ సుబ్బమ్మ, ప్రశాంతి, జయశ్రీ తదితరులు ఒంగోలు డీఎస్పీ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

రంగంలోకి పొదుపు సంఘాలు

చర్చలు విఫలమవుతున్నా ఏమాత్రం జంకకుండా సమ్మె బాటలో అంగ న్వాడీలు కొనసాగుతుండగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించింది. సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను తెరిపిస్తున్నా పూర్తిస్థాయిలో సేవలందించటం వారికి సాధ్యపడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో శనివారం నుంచి పొదుపు సంఘాల మహిళల్ని ప్రభుత్వం రంగంలోకి దింపింది. పాఠశాలల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు అక్కడే తయారుచేస్తున్న మధ్యాహ్న భోజనం అందించాలని, అదే పాఠశాలకు దూరంగా ఉన్న కేంద్రాల్లోని పిల్లలకు పొదుపుసంఘాల మహిళలు వండి వార్చాలని ఆదేశాలు అందాయి. దీంతో వైఎస్సార్‌కేపీ, మెప్మా పథకాల్లోని వీవోఏలు, పొదుపుసంఘాల మహిళలు శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాల బాట పట్టారు.

Updated Date - Dec 17 , 2023 | 12:55 AM