ప్రాణాలమీదకు తెచ్చిన నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2023-09-04T00:36:18+05:30 IST

గమ్యస్థానాలకు వెళ్లాలన్న తొందరో.., తేలికపాటి వరదే అన్న నిర్లక్ష్యమో.., తేలికగానే వాగుదాటేస్తామన్న ధైర్యమో తెలీదు కానీ.., ద్విచక్రవాహనంపై ఓ వ్యక్తి వాగుదాటేందుకు చేసిన ప్రయత్నం తనతోపాటు, తన కుమార్తె ప్రాణాలమీదకు తెచ్చింది.

ప్రాణాలమీదకు తెచ్చిన నిర్లక్ష్యం

పుల్లలచెరువు, సెప్టెంబరు 3: గమ్యస్థానాలకు వెళ్లాలన్న తొందరో.., తేలికపాటి వరదే అన్న నిర్లక్ష్యమో.., తేలికగానే వాగుదాటేస్తామన్న ధైర్యమో తెలీదు కానీ.., ద్విచక్రవాహనంపై ఓ వ్యక్తి వాగుదాటేందుకు చేసిన ప్రయత్నం తనతోపాటు, తన కుమార్తె ప్రాణాలమీదకు తెచ్చింది. అయితే ఆఖరినిమిషంలో వాగు అంచున ఆసరాగా చెట్టుకొమ్మ దొరకడం, భార్య వాగు ఒడ్డున ఉండి, స్థానికుల సహాయం కోరడంతో ఈ ఆపద నుంచి వీరు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండంలంలోని తెల్లగట్ల గ్రామానికి చెందిన కొమ్మనబోయిన వెంకటేశ్వర్లు ఆయన భార్య, ఐదేళ్ల కుమార్తెతో కలిసి పల్నాడు జిల్లా వినుకొండకు ఆదివారం ఉదయం మోటరు సైకిల్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో వేకువజామున కురిసిన వర్షానికి ముటుకుల - గుట్లపల్లి మధ్యలో కల్లేరు వాగు ఉధృతిగా ప్రవహిస్తోంది. ఆ సమయంలో అక్కడ పోలీసులు కూడా ఎవరూ లేరు. ఈ క్రమంలోనే వాగు ఉదృతిని అంచనా వేయకుండానే భార్యను వాహనంపై నుంచి కిందకు దింపాడు. తండ్రి కుమార్తెలు బైకుపై నేలచప్టామీదగా, వాగుదాటేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వాగు ఉదృతికి ద్విచక్రవాహనంతో సహా వాగులో పడిపోయారు. అయితే ఈత రావడంతో చాకచక్యంగా కుమార్తెను పట్టుకొని వాగులోనే ఇంచుమించు 100 మీటర్లు కోట్టుకుపోయాడు. అదృష్టవశాత్తు ఓ చెట్టుకొమ్మ వీరికి ఆసరాగా దొరికింది. తండ్రికుమార్తెలు ఆ చెట్టుకొమ్మను పట్టుకొని ఉన్నారు. ఇక ఒడ్డున ఉన్న ఆయన భార్య వెంటనే కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. తాళ్లు, ట్రాక్టరు ట్యూబులు తెచ్చి తండ్రికుమార్తెలను ఒడ్డుకు తెచ్చారు. ముటుకుల-గుట్టపల్లి మధ్య వాగుపై సరైన వంతెన లేకపోవడంతో నిత్యం వినుకొండకు వేళ్లె ఆర్టీసీ బస్సులు, వాహనదారులు వర్షం పడినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2023-09-04T00:36:18+05:30 IST