ఆక్రమణల చెరలో ప్రధాన వీధులు

ABN , First Publish Date - 2023-03-19T00:30:22+05:30 IST

పట్టణంలో ప్రధాన వీధులన్ని ఆక్రమణలకు గురై రానురాను కుంచించుకుపోతున్నాయి.

ఆక్రమణల చెరలో ప్రధాన వీధులు

మార్కాపురం(వన్‌టౌన్‌), మార్చి 18: పట్టణంలో ప్రధాన వీధులన్ని ఆక్రమణలకు గురై రానురాను కుంచించుకుపోతున్నాయి. ప్రధానంగా మార్కాపురం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి నాలుగు మాడ వీధులు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. ఆ రోడ్లు గతంలో 120 అడుగుల వెడల్పు ఉండేవని పెద్దలు చెప్తుంటారు. దానికి ఆనవాళ్లుగా ఇప్పటికీ కొన్ని గృహాలు ఆ వీధులలో వెలుపలకే ఉన్నాయి. కానీ ఈ వీధులన్ని నేడు పూర్తి స్థాయిలో ఆక్రమణలకు గురయ్యాయి. చెన్నకేశవస్వామి ఆలయం ఎదురు అయ్యప్ప స్వామి గుడి, రథం వీధి, అరవిందఘోష్‌ వీధి, నాయుడు వీధి, రాజాజీ వీధి, పాత బస్టాండ్‌లో వాణిజ్య దుకాణాల వారు తమ పరిధిని మించి దాదాపు 15 అడుగుల ముందుకు వచ్చారు. పాత కాలంలో రేడియో స్టేషన్‌ సమీపంలోని చెరువు అలుగు నుంచి అరవిందాఘోష్‌ వీధి పట్టాభి రామస్వామి గుడి వరకు బస్సులు ఆగేయని అది పాతకాలం నాటి బస్‌స్టాండ్‌ అని పెద్దలు చెప్తుంటారు. కానీ అరవింద్‌ఘోష్‌ వీధి పట్టాభిరామస్వామి గుడి వీధి ఆక్రమణలకు గురైంది. రథం బజార్‌లోని వినాయక స్వామి గుడి వద్ద చెన్నకేశస్వామి రథం తిరగే మూలమలుపు మరింత ప్రమాదకరంగా తయారైంది. అక్కడ కూల్‌డ్రింక్‌ షాపులు, టిఫిన్‌ సెంటర్లు దాదాపు రోడ్డును మూసేశాయి. దుకాణాల యజమానులు ఇటీవల కాలంలో దాదాపు 10 అడుగుల రోడ్లు ఆక్రమించి రోడ్లపైనే ఇనుమ మెట్లు నిర్మించుకున్నారు. అంగుళం కూడా వదలకుండా మార్కాపురం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో రోడ్డు మార్జిన్‌లను కూడా ఆక్రమించి వివిధ బంకుల వారికి అద్దెలకు ఇచ్చి వేలాది రూపాయలు అద్దెలు వసూలు చేస్తున్నారు. అరవిందఘోష్‌ వీధిలో విద్యుత్‌ స్తంబాన్ని ఆనుకొనే రేకుల షెడ్డు నిర్మించి రోడ్డును ఆక్రమించారు. మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పట్టణంలో ఎక్కడపడితే అక్కడ విద్యుత్‌ స్తంభాలు వేయడంతో వాటిని ఆసరాగా చేసుకొని ఆక్రమణదారులు వారే హద్దులు నిర్ణయిస్తున్నారు. ఈ పరిస్థితి పాత బస్టాండ్‌, నాయుడు బజార్‌ మూలమలుపు, కంభం సెంటర్‌ తదితర ప్రాంతాల్లో ఉంది. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు మూలమలుపు వద్ద ఆక్రమణలు ముందుకు వచ్చాయి. అటవీ శాఖ కార్యాలయం నుంచి బాలికల ఉన్నత పాఠశాల వరకు ఆర్‌అండ్‌బీ కాలువను ఆక్రమించి బంకులు వేశారు. ప్రైవేట్‌ వ్యక్తులు వేలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. విశేషమేమిటంటే మార్కాపురం మున్సిపల్‌ పాలకులు ఎవరున్నా పట్టణంలోని ఆక్రమణలు తొలగించేందుకు సాహసించరు. గతంలో సామాన్లు బయట పెట్టుకునే దుకాణాదారులు ఆ స్థలాలలో షెట్టర్లు వేసుకొని తమదిగా సొంతం చేసుకున్నారు. అయ్యప్పస్వామి గుడి వద్ద, రాజాజీ వీధి, గురునాధం బజ్జీల దుకాణం వద్ద ఇటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి వీధులలో ఉన్న ఆక్రమణలు తొలగించి పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్‌లు నిర్మించాల్సి ఉంది.

Updated Date - 2023-03-19T00:30:22+05:30 IST