వైభవంగా వినాయక చవితి

ABN , First Publish Date - 2023-09-20T00:06:27+05:30 IST

వినాయక చవితి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు కూడళ్లలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

వైభవంగా వినాయక చవితి

గిద్దలూరు, సెప్టెంబరు 19 : వినాయక చవితి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు కూడళ్లలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, సీవీఆర్‌ ఫౌండేషన్‌ అధినేత, వైసీపీ నాయకులు చేరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి, పలువురు నాయకులు పట్టణంలోని పలు వినాయక మండపాలకు వెళ్లగా నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహిం చారు. నవవస్త్ర గణపతి, యల్లావారివీధి, గణేష్‌నగర్‌, వరసిద్ది వినాయకస్వామి దేవాలయం, పలు వినాయక మండపాలను భక్తులు వేలాదిగా దర్శించుకున్నారు. ్లకొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

కంభం : కంభం, అర్థవీడు మండలాల్లో సోమవారం వినాయక చవితి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. రెండు మండలాల్లోని అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఒక్క కంభం పట్టణంలోనే 50కి పైగా మండపాలు ఏర్పాటు చేశారు. పలువురు దాతలు మట్టివిగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. వినాయక పూజలో వినియోగించే పత్రి, ఇతర పూజా సామాగ్రి అధిక రేట్లకు అమ్మారు. పలు మండపాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

కంభం చెరువులో వినాయక నిమజ్జనం

చారిత్రాత్మక కంభం చెరువులో మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సోమవారం మండపాలలో భక్తులతో పూజలు అందుకున్న గణనాథులు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంభం, బేస్తవారపేట, అర్థవీడు మండలాలకు చెందిన వందలాది విగ్రహాలు కంభం చెరువులో నిమజ్జనం చేశారు. ఈ ఏడాది కంభం చెరువులో 15 అడుగుల మేర నీరు ఉండడంతో భక్తుల తాకిడి పెరగనుంది. ఉదయం నుంచి సాయంత్రం 6.30గంటలకు నిమజ్జనాలను ముగించాలని నిర్వాహకులకు పోలీసులు తెలిపారు. కంభం చెరువు వద్ద ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో భారీబందోస్తు ఏర్పాటు చేశారు. స్థానిక మత్స్యకారుల సహకారం కూడా తీసుకుంటున్నారు.

పొదిలి : వినాయకచవితి పర్వదినం సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామం, పట్టణంలోని పలు వీధుల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రావలోఓ్ల మండపాలను పోటాపోటీగా ఏర్పాటు చేసి ఉత్సాహభరితంగా పండుగను జరుపుకున్నారు. ఎన్నికల వాతావరణం నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు విగ్రహాల వితరణకు ఆసక్తి చూపారు. మండలంలో 60కి పైగా గణేష్‌ మండపాలు ఏర్పాటు అయినట్లు ఏఎస్‌ఐ రంగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డును కారంశెట్టి రవీంద్రకుమార్‌ రూ.50,116లకు దక్కించుకున్నారు.

త్రిపురాంతకం : వినాయకచవితి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాలలో భక్తులు సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. త్రిపురాంతకంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో, ఉత్తరపు బజారు, భారతీ పాఠశాల, పాత రామాలయం, కోదండ రామాలయం, బ్రహ్మంగారికాలనీ, నాగరాజుకాలనీ, పాతపోలీసుస్టేషను బజారులలో గణనాథులకు పూజలు చేశారు. అనంతరం ఇళ్లలో ఏర్పాటు చేసిన గణనాథులకు మంగళవారం స్థానికంగా ఉన్న కుంటలతోపాటు, పలు ప్రాంతాల్లో చెరువులలో నిమజ్జనం నిర్వహించారు.

పెద్ద దోర్నాల : మండలంలోని ప్రజలు వినాయక చవితి వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. దోర్నాలలో వీధి వీధినా గణేశుని విగ్రహాలను ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వహించారు. స్థానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో గాజులతో రూపొందించిన బొజ్జగణపయ్య అందరిని ఆకట్టుకున్నారు. శ్రీ విజయ గణపతి దేవాలయంలో, వడ్డేవారి వీధి, రజకుల వీధి, మెట్టబజారు, హీరో షోరూమ్‌ వద్ద, ఒకటవ వార్డులో, పీర్లచావిడి వద్ద, భారత్‌ పెట్రోలు బంకు సమీపంలో నటరాజ్‌ కూడలిలో ఆయా ప్రాంతాలలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. అన్ని గ్రామాల్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. యువత అధిక సంఖ్యల్లో పాల్గొని సంబరాలు చేస్తున్నారు.

తర్లుపాడు : వినాయకచవితి పర్వదినాన్ని భక్తులు అనందోత్సాహాలతో జరుపుకున్నారు. మండలంలో వాడవాడలా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. తర్లుపాడులో ఆర్యవైశ్య సంఘం, రెడ్డి యూత్‌, యాదవ్‌ యూత్‌, ముదిరాజ్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఐదు విగ్రహాలను ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాల వద్ద విద్యుత్‌ దీపాలతో మండపాలను ఏర్పాటు చేశారు. రాత్రి వేళ భజనా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కంభం చెరువులో నిమజ్జనానికి వినాయక విగ్రహాలను తరలిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కశ్శెట్టి జగన్‌బాబు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహం వద్ద దాత సరేందర్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : వినాయక చవితి పర్వదినాన్ని మార్కాపురం మండలం, పట్టణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఇళ్ల వద్ద వినాయకుని ప్రతిమలు, విగ్రహాలు ఉంచి భక్తితో పూజలు చేశారు. ఆలయాలలో వివిధ మండపాల వద్ద వినాయకునికి భక్తులు పూజలు చేశారు. పట్టణంలోని నెహ్రూ బజార్‌లో దశావాతారాల వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు. మెయిన్‌ బజార్‌, తూర్పు వీధి, బంగారమ్మ గుడి వీధి, అలుగు వీధిలతో పాటు వాడవాడల వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు నుంచే ఆయా మండపాల వద్ద సందడి నెలకొంది. మండలంలోని నికరంపల్లి, నాగులవరం, వేములకోట, తిప్పాయపాలెం, చింతగుంట, కొండేపల్లి, రాయవరం తదితర గ్రామాల్లో వినాయక చవితి ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.

కొమరోలు : మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి వేడుకలను సోమవారం ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. ప్రధానంగా కొమరోలు పట్టణంలోని వినాయకస్వామి గుడిలోని వినాయకున్ని మండల ప్రజలు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. గ్రామాల్లో ప్రతిష్ఠించిన వినాయకుని ప్రతిమల వద్ద పచ్చతోరణాలతో పందిర్లు వేసి పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ, ప్రతి వీధిలోనూ వినాయకుని ప్రతిమలను పోటాపోటీగా ఏర్పాటుచేసుకొని ఆ ప్రాంత వాసులు అందరూ కలసిమెలసి ఉల్లాసంగా జరుపుకున్నారు. గణనాథునికి ఇష్టమైన నైవేద్యాలను తయారుచేసి భక్తులకు పంచిపెట్టారు. సాయంత్రం చిన్నారులచే సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించి బహుమతులను అందజేశారు. మండలంలోని ఎక్కవ భాగం బుధవారం వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-20T00:06:27+05:30 IST