చేపలు కొట్టేద్దాం!

ABN , First Publish Date - 2023-06-01T02:03:06+05:30 IST

కన్నుపడిందంటే చాలు వైసీపీ నాయకులు దేనినీ వదలడం లేదు. ఆదాయం వచ్చే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. అందుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు.

చేపలు కొట్టేద్దాం!
చెరువులో చనిపోతున్న చేపలను చూపుతున్న జాలర్లు

వైసీపీ నేతల పన్నాగం

ఆందోళనలో జాలర్లు

యానాది జాలర్ల సంఘం ఎన్నికలు జరగకుండా కుట్ర

శాంతిభద్రతల సమస్య పేరుతో వాయిదా

ప్రత్యేకాధికారినే ఉంచి చెరువులను ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు

రూ.50లక్షలు పెట్టుబడి పెట్టిన సంఘ సభ్యుల కన్నీరు

న్యాయం చేయాలని సోషల్‌ మీడియా ద్వారా వేడుకోలు

పోరాటం చేస్తామన్న ఎమ్మెల్యే స్వామి

కన్నుపడిందంటే చాలు వైసీపీ నాయకులు దేనినీ వదలడం లేదు. ఆదాయం వచ్చే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. అందుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అవసరమైతే అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. పొన్నలూరు మండలంలో చేపలు పెంచుతున్న చెరువులపై కన్నేసిన వారు వాటిని కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారు. గతం నుంచి ఉన్న యానాది జాలర్ల సంఘ సభ్యుల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారు. సంఘాన్ని ప్రత్యేకాధికారి పాలనలోనే ఉంచి పని చక్కబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో రూ.లక్షలు ఖర్చుపెట్టిన సంఘ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని సోషల్‌ మీడియా ద్వారా అధికారులను వేడుకుంటున్నారు.

పొన్నలూరు, మే 31 : అధికారపార్టీ నాయకులు చివరకు పేదలు పెంచిన చేపలను కొట్టేయడానికి కూడా సిద్ధమైపోయారు. అందుకోసం అధికారుల సహకారంతో పక్కాగా పథకాన్ని అమలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పొన్నలూరు మండలంలోని నాగిరెడ్డిపాలెం, చెరుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం, చెన్నిపాడుకు చెందిన యానాదులు చేపల వేట ఆధారంగా జీవిస్తున్నారు. వీరంతా ఒక సంఘంగా ఏర్పడ్డారు. యానాది జాలర్ల సహకార సంఘం పేరుతో ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. రెండేళ్లకు ఒకసారి పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. ఆ ప్రకారం 2019లో ఎన్నికైన సంఘ సభ్యులు పొన్నలూరు, భోగనంపాడు, వెంకుపాలెంలోని బడేసాహెబ్‌ చెరువులను లీజుకు తీసుకొని చేపలు వేశారు. వీరిలో ఎక్కువ మంది టీడీపీ సానుభూతిపరులు ఉన్నారు. వీరంతా చేపల పెంపకం కోసం అప్పులు తెచ్చి రూ.50లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. రెండేళ్లకు చేపలు పట్టుకోవాల్సి ఉంది. కానీ అప్పట్లో కరోనా ఇతరత్రా కారణాలతో పట్టుకోలేకపోయారు. ఈలోపు సంఘ పాలకవర్గం గడువు పూర్తయ్యింది. అనంతరం ప్రత్యేకాధికారికి బాధ్యతలు అప్పగించారు. ఎట్టకేలకు మత్స్యశాఖ అధికారులు సంఘ ఎన్నిలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 28న నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆప్రకారం ఈనెల 29న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో వైసీపీ నేతలు రంగంలోకి దిగారు.

చేపల కోసం వైసీపీ నేతల ఎత్తుగడ

మండలంలోని మూడు చెరువుల్లో చేపలు పట్టి అమ్ముకోవాలని వైసీపీ నేతలు భావించారు. అందుకోసం పన్నాగం పన్నారు. సంఘ ఎన్నికలు జరగకుండా ప్రత్యేకాధికారి పాలనలో ఉంచి తమ పనిని చక్కబెట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. యానాది సంఘం సభ్యుల్లో ఆరుగురిని తమవైపు తిప్పుకున్నారు. వారితో తహసీల్దార్‌కు, మత్స్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయించారు. దీంతో ఈనెల 29న చేతులెత్తే పద్ధతిలో నిర్వహించాల్సిన సంఘ ఎన్నికలను శాంతిభద్రతల సమస్య పేరుతో అధికారులు నిలిపివేశారు.

సంఘ సభ్యుల ఆందోళన

నాగిరెడ్డిపాలెం యానాది సంఘ సభ్యులంతా పేదలు. వారంతా అప్పులు తెచ్చి మూడు చెరువుల్లో చేపల పెంపకం కోసం రూ.50లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమ ఇబ్బందులను అధికారులు తొలగించాలని వారు సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చెరువుల్లో నీరు అడుగంటుతోంది. ఎండల తీవ్రత కూడా పెరగడంతో చేపలు చనిపోతున్నాయి. దీంతో సభ్యులు కలవరపడుతున్నారు. లక్షల్లో అప్పులు తెచ్చామని, ఇప్పుడు చేపలు పట్టుకోకపోతే వాటిని చెల్లించలేమని సంఘ బాధ్యురాలు కోటేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ ఎన్నికలు జరిగితేనే చేపలు పట్టుకునేందుకు వీలుంటుందని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

అధికారులు స్పందించకపోతే న్యాయ పోరాటం : ఎమ్మెల్యే స్వామి

రాజకీయ స్వార్థం కోసం సంఘంలో విభేదాలు సృష్టించడం సరికాదని ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ సంఘ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి శాంతిభద్రతల సమస్య లేదన్నారు. అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించవచ్చన్నారు. ఈవిషయమై కలెక్టర్‌, మత్స్యశాఖ అధికారులను కలిసి పేదలు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని కోరుతానన్నారు. వారు పట్టించుకోకపోతే యానాదుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2023-06-01T02:03:06+05:30 IST