లారీ రివర్స్‌ గేర్‌!

ABN , First Publish Date - 2023-03-20T00:12:23+05:30 IST

రెండువేలకు పైగా లారీలు... ఏటా జనవరి 1వతేదీన 500 కొత్త లారీల కొనుగోలు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి. ఇదీ సింగరాయకొండలో ఒకప్పటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. లారీ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భారీ జరిమానాలు, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా కిరాయిలు లేకపోవడం, సుబాబుల్‌, జామాయిల్‌ సాగు విస్తీర్ణం తగ్గడం తదితర కారణాలతో లారీ సంఖ్య ఏటికేడు తగ్గుతూ ప్రస్తుతం 500కు పడిపోయింది.

లారీ   రివర్స్‌ గేర్‌!
పాత సింగరాయకొండ వద్ద యూనియన్‌ కార్యాలయంలో నిలిచి ఉన్న లారీలు (ఇన్‌సెట్లో) బాడీబిల్డింగ్‌ షెడ్‌లో లారీకి మరమ్మతులు చేస్తున్న కార్మికుడు

ఏటికేడు కుదేలు

గతంలో సింగరాయకొండలో

2000కు పైగా లారీలు

రెండో విజయవాడగా గుర్తింపు

ప్రస్తుతం సగానికిపైగా తగ్గిపోయిన వాహనాలు

దయనీయంగా యాజమానుల పరిస్థితి

ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని వినతి

మోటార్‌ ఫీల్డ్‌లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే సింగరాయకొండకు ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘకాలం ఈ రంగంలో ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు ప్రాభవాన్ని కోల్పోతోంది. విజయవాడ తర్వాత మోటార్‌ ఫీల్డ్‌ అంటే సింగరాయకొండ అనే గుర్తింపు గతంలో ఉండేది. కానీ ప్రస్తుతం ఆ రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న అనాలోచిత విధానాలు, నిర్ణయాలు ఈ రంగానికి శాపంగా మారాయి. దీనికి తోడు కొవిడ్‌ సమయంలో సరుకు రావాణా స్తంభించడం పూర్తిగా దెబ్బతింది. గతంలో వేల లారీలతో కళకళలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు వందల సంఖ్యకు పడిపోయి వెలవెలబోతోంది. ఈరంగంపై ఆధారపడిన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది.

సింగరాయకొండ, మార్చి 19 : రెండువేలకు పైగా లారీలు... ఏటా జనవరి 1వతేదీన 500 కొత్త లారీల కొనుగోలు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి. ఇదీ సింగరాయకొండలో ఒకప్పటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. లారీ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భారీ జరిమానాలు, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా కిరాయిలు లేకపోవడం, సుబాబుల్‌, జామాయిల్‌ సాగు విస్తీర్ణం తగ్గడం తదితర కారణాలతో లారీ సంఖ్య ఏటికేడు తగ్గుతూ ప్రస్తుతం 500కు పడిపోయింది.

70 ఏళ్ల క్రితం రవాణా ప్రారంభం

సుమారు 70 ఏళ్ల క్రితం జాతీయ రహదారి పక్కనే ఉన్న సింగరాయకొండలో లారీలు లేని సమయంలో విజయవాడ నుంచి కొన్ని కుటుంబాలు వారు ఇక్కడికి వచ్చి రవాణా ప్రారంభించారు. అప్పటి నుంచి స్థానికంగా లారీ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. 2004-05 సమయంలో దాదాపు సింగరాయకొండ మండలంలో 2,000 లారీలకు పైన ఉండేవి. రానూరాను పరిస్థితుల ప్రభావం వల్ల క్రమంగా వీటి సంఖ్య గణణీయంగా తగ్గుతూ వచ్చింది. 2019 వరకూ కూడా సింగరాయకొండలో 1200కు పైగా లారీలు ఉండేవి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న విధానాలతో లారీ యాజమానులు తమ వాహనాలను రోడ్డెక్కించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేసమయంలో కొవిడ్‌ మహమ్మరి విజృంణతో పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో లారీ పరిశ్రమ మరింత కుంటుపడిపోయింది.

గతంలో ఏటా 500 లారీల కొనుగోలు

సింగరాయకొండలో లారీ పరిశ్రమ వృద్ధిచెందున్న సమయంలో ఏటా నూతన సంవత్సరం రోజున 100కుపైగా లారీల కొనుగోలు జరిగేది. ఇలా నూతన వాహనాలను కోలుగోలు చేయడం చాలా ఏళ్ల వరకూ కొనసాగింది. 2000 ఏడాదిలో ఎక్కువ మంది కొత్త లారీల కొనుగోలు చేయడంతో అప్పటి అశోక్‌లైలాండ్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ సంఘీ సింగరాయకొండను సందర్శించారు. అంతేకాకుండా ముంబైలోని టాటా మోటార్స్‌ కార్యాయలంలో కూడా సింగరాయకొండకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ప్రభుత్వ విధానాలతో కుదేలు

సింగరాయకొండలో గతంలో కళకళలాడిన లారీ పరిశ్రమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో కుదేలైంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు కూడా కారణమయ్యాయి. మండలంలోని పాతసింగరాయకొండ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న పెరల్స్‌ డిస్టలరీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. 2019 వరకూ ప్రతి నెలా 1000లోడులకు పైగా ఫ్యాక్టరీ నుంచి సరకు రావాణా జరిగేది. ప్రస్తుతం అది 50 లోడ్‌లకు పడిపోయిందని లారీ యాజమానులు చెప్తున్నారు. ప్రభుత్వ తీరుతో స్థానిక పారిశ్రామికవాడలోని గ్రానైట్‌ కటింగ్‌ యూనిట్లు, చిన్నతరహా పరిశ్రమలు చాలా వరకూ మూతపడ్డాయి. దీని ప్రభావం కూడా లారీ పరిశ్రమపై పడింది. అంతేకాకుండా పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీ పరిధిలో గతంలో వేలాది ఎకరాల్లో సాగుచేసే ఉప్పు విస్తీర్ణం తగ్గిపోవడంతో ఆ ప్రభావం రవాణా రంగంపై పడింది. సింగరాయకొండతో పరిసర గ్రామాల్లో గతంతో పోల్చుకుంచే జమాయిల్‌, సరుగుడుతోట్ల పెంపకం, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం కూడా రావాణారంగంలో భాగమైన లారీ రంగం కుదేలవడానికి కారణమైంది.

భారీ జరిమానాలతో బెంబేలు

ప్రభుత్వ నిబంధనల పేరుతో రవాణా శాఖ అధికారులు విధిస్తున్న భారీ జరిమానాలకు దెబ్బకు లారీ యాజమానులు బెంబేలెత్తున్నారు. నూతన 10 టైర్ల లారీకి గత ప్రభుత్వంలో ఏడేళ్ల తర్వాత గ్రీన్‌టాక్స్‌ చార్జీ కేవలం రూ.200 మాత్రమే ఉండేది. ఇప్పడు ఏడేళ్ల తరువాత 3,750, 10 ఏళ్లకి 6,500, 15 ఏళ్లకి రూ.13,000కు పెంచారు. అవి కూడా లారీ పరిమాణం పెరిగే కొద్దీ మరింత అధికంగా కట్టాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఫిట్‌నెస్‌ చార్జీలు లారీ (10టైర్ల)కి రూ.1000 లోపు ఉండేవి. ప్రస్తుతం వాటిని రూ.13,500కి పెంచేశారు. ఏటా ఇన్సూరెన్స్‌తోపాటు టోల్‌రేట్ల టారి్‌ఫను ప్రభుత్వం దాదాపు 5శాతం మేర పెంచింది. గతంలో ఓవర్‌లోడ్‌తో రోడెక్కిన లారీలకు కాంపౌడ్‌ పెనాల్టీ రూ.2000, అధికంగా ఉన్న సరుకుకు ఒక టన్నుకు రూ. 1000 పెనాల్టీ కట్టించుకునే వారు. ఇప్పుడు కాంపౌడ్‌ చార్జీని రూ.20,000కు పెంచేశారు. ఓవర్‌హైట్‌ లోడుకి గతంలో రూ.1000 ఉన్న కాంపౌండ్‌ చార్జీని సైతం రూ.20వేలు చేశారు. వీటిని సైతం స్థానిక లారీలకు మాత్రమే విధిస్తున్నారని, కార్పొరేట్‌ సంస్థలకు చెందిన లారీను పట్టించుకోకుండా వదిలేస్తున్నారని వారు వాపోతున్నారు. దీనికితోడు డీజిల్‌ ధరల పెంపు కూడా భారమైంది. మన రాష్ట్రంతో పోల్చుకుంటే డీజిల్‌ ధరలు ఒక లీటర్‌కు పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో రూ.12, తమిళనాడులో రూ.4, ఒడిశాలో రూ.3 తక్కువుగా ఉన్నాయి. డీజిల్‌ రేట్లు భారీగా అందుకు అనుగుణంగా కిరాయి రేట్లు పెరగక పోవడంతో నష్టాల పాలై లారీలను అమ్మకుంటున్నామని యాజమానులు వాపోతున్నారు.

ఉపాధికి గండి

లారీలు అధికసంఖ్యలో ఉన్న సమయంలో సింగరాయకొండలో మెకానిక్‌, టైర్లు, విడిభాగాల దుకాణాలు ఎక్కువుగా ఉండేవి. వ్యాపారం కూడా మెండుగా జరిగేది. దీంతోపాటు అనుబంధంగా పనిచేసే కార్మికులకు చేతినిండా పని దొరికేది. లారీ రంగం పరిస్థితి నానాటికి దయనీయంగా మారడంతో పరిశ్రమకు అనుబంధంగా ఉన్న విభాగాల్లో పనిచేస్తున్న వారు ఉపాధిని కోల్పోయారు. ప్రస్తుతం టింకరింగ్‌, పెయింటింగ్‌, అద్దాలు, స్టిక్కరింగ్‌, ఎలక్ట్రికల్‌ వర్కర్లు, లారీ కట్టల పని చేసేవారికి ఉపాధిలేక ఇళ్లు గడవటమే గగనంగా మారింది. కొందరు ప్రత్యామ్నాయ పనులకు వెళ్తున్నారు.

ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించాలి

లారీ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యాజమానులు పరిస్థితి దయనీయంగా మారింది, డీజల్‌ రేట్లు అధికంగా పెరగడం, నిబంధనల పేరిట విధిస్తున్న పెనాల్టీలు యాజమానులకు శాపంగా మారాయి. దీంతో యజమానులు లారీలు తిప్పలేక అమ్మివేస్తున్నారు. లారీ పరిశ్రమను కాపాడటానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సహకాలను కల్పించాలి. లేకపోతే లారీపరిశ్రమ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

- చిగురుపాటి గిరి, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

గతంలో 9 లారీలు.. ప్రస్తుతం ఒక్కటి మాత్రమే

నేడు 25 ఏళ్ల నుంచి లారీలు కోనుగోలు చేసి తిప్పుతున్నాను. కొవిడ్‌ ముందు వరకు కూడా 9 లారీలు ఉండేవి. పెరిగిన డీజిల్‌ ఽధరలు, అమాంతంగా పెంచిన పెనాల్టీలలో నడపలేక 8 లారీలను అమ్మివేశా. ప్రస్తుతం ఒక లారీ మాత్రమే ఉంది. దానికి ఉన్న డ్రైవర్‌కి కూడా జీతం ఇవ్వలేక తొలగించాను. నేనే డ్రైవర్‌గా వెళ్తున్నాను.

- ఎస్‌కే ఆరీఫ్‌, లారీయాజమాని, సింగరాయకొండ

కొత్త లారీల కొనుగోలు గణనీయంగా తగ్గింది

అంబటి కోటేశ్వరరావు, లారీ బాడీ బిల్డింగ్‌ యాజమాని

నేను 35 ఏళ్ల నుంచి లారీ బాడీ బిల్డింగ్‌ పనులు చేయిస్తున్నా. 2019 వరకూ నెలకు దాదాపు 50 లారీలకు బాడీ బిల్డింగ్‌ చేసే వాళ్లం. యాజమానులు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా నూతనంగా లారీలను కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం నెలలో ఒకటి లేదా కొన్ని నెలలో పూర్తి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. షెడ్‌కు అద్దె చెల్లించడం కూడా కష్టంగా మారింది.

Updated Date - 2023-03-20T00:12:23+05:30 IST