కొండపి ఎమ్మెల్యే స్వామి హౌస్ అరెస్ట్
ABN , First Publish Date - 2023-08-20T01:44:08+05:30 IST
తరచూ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న కొండపి నియోజకవర్గంలోని పాకల గ్రామ సర్పంచ్ ఉపఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు.
పాకల ఎన్నికలకు వెళ్లొద్దంటూ నోటీసు
ఫంక్షన్లకూ పోనివ్వకుండా అడ్డగింత
బైక్‌పై ఒంగోలుకు ఎమ్మెల్యే, ఫంక్షన్ హాలు వద్ద హడావుడి
ఒంగోలు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : తరచూ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న కొండపి నియోజకవర్గంలోని పాకల గ్రామ సర్పంచ్ ఉపఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఏకంగా ఎమ్మెల్యేకే కఠిన ఆంక్షలు పెట్టారు. గ్రామంలో దాదాపు 250 మంది సిబ్బంది, డజను మందికి పైగా పోలీసు అధికారులు మోహరించి బయటి వ్యక్తులు ఎవరు రావద్దంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులను సైతం ఆపి తనిఖీలు చేశారు. ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ డీఎస్‌బీవీ స్వామిని హౌస్ అరెస్టు చేశారు. సింగరా యకొండ మండలంలోని పాకలలో సర్పంచ్ ఉప ఎన్నిక జరుగుతుండగా శుక్రవారం రాత్రి వరకు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అశోక్‌బాబు గ్రామంలోనే ఉండి ఎన్నికలను పర్యవేక్షించారు. అదే సమయంలో బయటి నుంచి వచ్చారనే పేరుతో టీడీపీకి చెందిన కొందరిపై స్థానిక వైసీపీ కార్యకర్తలు దాడికి దిగడమే కాక అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని సింగరాయకొండ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ స్వామి సింగరాయకొండ చేరుకోగా అర్ధరాత్రి అటు పాకలలో, ఇటు సింగరాయకొండలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసు అఽధికారుల జోక్యంతో శనివారం తెల్లవారుజామున ఎమ్మెల్యే స్వామి తన స్వగ్రామమైన టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం చేరుకున్నారు. అనంతరం కొంతసేపటికి వైసీపీ ఇన్‌చార్జి అశోక్‌బాబును పోలీసులు టంగుటూరు చేర్చారు. ఇదిలా ఉండగా శనివారం తెల్లవారేసరికి పోలీసులు నాయుడు పాలెంలోని ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్ద పహారా పెట్టారు. విషయం తెలుసుకున్న స్వామి ఎస్పీ మలిక గర్గ్‌కు ఫిర్యాదు చేయగా పాకలలో ఎన్నిక య్యేంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం కొద్దిసేపటికి పాకలలో బయటి ప్రాంతాలకు చెందిన వారికి ప్రవేశం లేదని తెలియజేస్తూ సింగరాయకొండ సీఐ పేరుతో ఎమ్మెల్యే స్వామికి పోలీసులు నోటీసు ఇచ్చారు. అయితే పోలింగ్ జరుగుతున్న పాకలకు తాను వెళ్లనని ఒంగోలుతోపాటు ఇతర చోట్ల పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లాల్సి ఉందని, అవసరమైతే ఎస్కార్ట్ పెట్టుకోమని ఎమ్మెల్యే స్వామి చెప్పినా వారు అంగీక రించలేదు. దీంతో ఇంటి నుంచి మరోమార్గం ద్వారా బయటికు వచ్చి బైక్‌పై ఎక్కి ఎమ్మెల్యే స్వామి ఒంగోలు చేరుకున్నారు. కొద్దిసేపటికి విషయం తెలుసుకొని అవాక్కైన పోలీసులు ఒంగోలులో అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. అందుకోసం ఫంక్షన్ హాలు వద్ద నిఘా పెట్టారు. అయినప్పటికీ ఒంగోలులోనే మధ్యాహ్నం వరకు ఉండి మరో మార్గంలో స్వామి ఇంటికి చేరుకోగా అక్కడ భారీ బందోబస్తుతో ఇంటి చుట్టూ పహారా పెట్టారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు స్వామిని ఇంటి నుంచి కదలనివ్వలేదు. పోలీసు చర్యలను టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా వైసీపీ ఇన్‌చార్జి అశోక్‌ను కూడా టంగుటూరులోని వైసీపీ కార్యాలయం నుంచి బయటకు రా కుండా పోలీసులు అడ్డుకున్నారు. పా కల ఎన్నికల్లో టీడీపీ ఘన విజ యం సాధించింది.