విద్వేష ఫ్లెక్సీలపై కన్నెర్ర
ABN , First Publish Date - 2023-06-03T00:40:30+05:30 IST
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కించపరుస్తూ నాగులుప్పలపాడు బస్టాండ్ సెంటర్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జనసైనికులు కన్నెర్ర చేశారు.

తీస్తారా.. లేకమమ్మల్నీ కట్టమంటారా?
వైసీపీ ఫ్లెక్సీలు తొలగించాలని పోలీసు స్టేషన్ ఎదుట జనసేన ధర్నా
ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన, అధికారులకు వినతిపత్రం
తొలగించిన గ్రామపంచాయతీ సిబ్బంది
నాగులుప్పలపాడు(ఒంగోలు రూరల్), జూన్ 2: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కించపరుస్తూ నాగులుప్పలపాడు బస్టాండ్ సెంటర్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జనసైనికులు కన్నెర్ర చేశారు. వాటిని తొలిగించండి, లేదంటే తాము కూడా పోటీ ఫ్లెక్సీలు పెడతామంటూ హెచ్చరించారు. పోలీసు స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో దిగివచ్చిన పోలీసులు వాటిని తొలగించారు. వివరాల్లోకి వెళితే.. పవన్ కల్యాణ్‌ను కించపరుస్తూ నాగులుప్పలపాడు బస్టాండ్‌లో గురువారం రాత్రి వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టారు. ఇవి ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకుని విద్వేషపూరిత బ్యానర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దానిని తొలగించాలంటూ నినాదాలు చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం ఎంపీడీవో కార్యాలయం ఎదుట జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనంతరం కార్యాలయంలోని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయకుమార్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ను కించపరుస్తూ పెట్టిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించకపోతే సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై తాము ఫ్లెక్సీలు పెడతామని హెచ్చరించారు. దీంతో స్పందించిన పోలీసులు.. పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో కలిసి వెళ్లి బస్టాండ్ సెంటర్‌లోని ఫ్లెక్సీలను తొలిగించారు. ఆందోళనలో నాయకులు ధనుష్, శివ, అమరనాథ్, ఫణిమోహన్, నవీన్, సునీల్‌కుమార్, విశ్వనాఽథ్, సాయికిరణ్, వెంకటేష్, టి.దానమూర్తి పాల్గొన్నారు