Share News

బటన్‌ నొక్కుడే.. లబ్ధి పడదే!

ABN , First Publish Date - 2023-11-19T23:11:38+05:30 IST

నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న పలు పథకాలు ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్లు మారాయి. రాష్ట్రప్రభుత్వం పలు పథకాలను పేదలకు అందించేందుకు సంక్షేమ క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ పథకాలు చివరికొచ్చేసరికి చతికిలపడ్డాయి

బటన్‌ నొక్కుడే.. లబ్ధి పడదే!

గడువు దాటిపోయి రెండు నెలలైనా నేటికీ పట్టించుకోలేదు

ఇంకా జమ కాని చేయూత నిధులు

అమలు కాని సంక్షేమ క్యాలెండర్‌

ఒంగోలు నగరం, నవంబరు 19 : నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న పలు పథకాలు ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్లు మారాయి. రాష్ట్రప్రభుత్వం పలు పథకాలను పేదలకు అందించేందుకు సంక్షేమ క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ పథకాలు చివరికొచ్చేసరికి చతికిలపడ్డాయి. ఆయా లబ్ధిదారులకు పథకాల ద్వారా అందాల్సిన నిధులు నెలలు గడుస్తున్నా అందడం లేదు. ఏ పథకం కింద అయినా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు డబ్బు జమ కావాలంటే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బటన్‌ నొక్కుతున్నారు. ఆ తర్వాత వెంటనే నిమిషాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని ఊదరగొడుతున్నారు. అయితే అవి సకాలంలో పడిన పరిస్థితి లేదు. ఇదిలా ఉండగా కొన్ని పథకాలకు ఆయన బటన్‌ నొక్కడం మర్చిపోయినట్లున్నారు. చేయూత పథకం కింద డబ్బులు విడుదల చేయాల్సిన గడువు ముగిసిపోయిన పట్టించుకోవడం లేదు. ఎంతకీ తమ ఖాతాల్లోకి డబ్బులు జమ కాకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులు ఆయన ఎప్పుడు బటన్‌ నొక్కుతారా? అని ఎదురుచూస్తున్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా..

రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత కింద 45ఏళ్లు నిండిన మహిళలకు ఏటా రూ.18,750 అందజేస్తోంది. ఈ పథకం ద్వారా మొత్తం నాలుగేళ్లలో రూ.75వేలు మహిళల ఖాతాల కు జమ చేయాల్సి ఉంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో 2020 ఆగస్టు 20న ప్రారంభించారు.రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 60ఏళ్ల వయస్సు ఉన్న ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఈ పథకం కింద లబ్ధి చేకూర్చుతున్నారు. ఈ సొమ్ముతో వారు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నది ప్రభుత్వ ఆశయం. నాలుగో విడతకి సం బంధించిన నిధులను సెప్టెంబర్‌లోనే ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి మహిళల ఖాతాలకు జమచేయాల్సి ఉంది. గడువు ముగిసి పోయి ఇప్పటికి రెండు నెలలు దాటుతోంది. అసలు ఆయన బటన్‌ నొక్కుతారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

అంతా గందరగోళమే

చేయూత పథకం కింద రూ.18,750 ఈ విడత ఇస్తారో లేదో కూడా తెలియని గందరగోళంలో మహిళలు పడిపోయారు. జిల్లాలో ఈ పథకం కింద ప్రతి విడత లక్షమంది మహిళల్ని లబ్ధిదారులుగా చూపిస్తున్నారు వైఎస్సార్‌కేపీ అధికారులు. ఈ విడత డబ్బులు విడుదల చేసేందుకు ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయానికి పంపించారు. నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి మాత్రం బటన్‌ నొక్కడం లేదు. దీంతోపాటు అక్టోబర్‌లో విడుదల కావాల్సిన రైతు భరోసా డబ్బులు కూడా ఇంకా చాలామంది బ్యాంకు ఖాతాల్లో పడకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో నిర్ణీత గడువులోపు బటన్‌ నొక్కి తమ ఖాతాలకు చేయూత డబ్బులు జమ చేస్తారనుకున్న మహిళలకు రెండు నెలల నుంచి ఎదురుచూపులే మిగిలాయి. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఏడాది సెప్టెంబరులో విడుదల కావాల్సిన చేయూత సొమ్మును బటన్‌ నొక్కి జమ చేయనున్నారని సమాచారం.

Updated Date - 2023-11-19T23:11:40+05:30 IST