బియ్యం వ్యాపారులకు డీలర్ల ఝలక్!
ABN , First Publish Date - 2023-09-20T00:31:46+05:30 IST
అధికారం అండ ఉందనే పేరుతో రేషన్ అక్రమ వ్యాపారులు, డీలర్లు రెచ్చిపోతున్నారు.

ఇద్దరి వద్ద పుచ్చుకున్న అడ్వాన్సులు
మూడో వ్యక్తికి రేషన్ బియ్యం అందజేత
ఇదేమని ప్రశ్నిస్తే అధికారం అండతో దౌర్జన్యం
అందరూ వైసీపీ వారే కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి
ఒంగోలు(కలెక్టరేట్), సెప్టెంబరు 19 : అధికారం అండ ఉందనే పేరుతో రేషన్ అక్రమ వ్యాపారులు, డీలర్లు రెచ్చిపోతున్నారు. తాము ఏమి చేసినా అడిగేది ఎవ్వరు అంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు వారిలో వెన్నుపోట్లకు కారణమవుతోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమ ఆదాయం కోసం రేషన్ షాపుల డీలర్లు, బియ్యం అక్రమ వ్యాపారులు వెంపర్లాడుతున్న విషయం విదితమే. అయితే డీలర్ల దెబ్బకు వ్యాపారులుగా అవతారమెత్తిన వైసీపీ నేతలే లబోదిబోమంటున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో రేషన్ షాపులు మొత్తం అధికారపార్టీ ద్వితీయశ్రేణి నాయకుల చేతుల్లో ఉన్నాయి. అలాగే బియ్యం అక్రమ వ్యాపారులు కూడా ఆ పార్టీకి చెందినే వారే. అయితే ఇటీవల వరకు ఒకరిద్దరు మాత్రమే అంతా తమ చెప్పుచేతల్లో పెట్టుకుని అధికారపార్టీ అండదండలతో ఇష్టారీతిన బియ్యం కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తూ వచ్చారు. ప్రధానంగా ఓ మహిళా నేత అంతా తానై నడిపింది. ఇటీవల అలాంటి వారి సంఖ్య పెరిగిపోయింది. ఒక కార్పొరే టర్ భర్తతో పాటు ఐదారుగురు ఆ దందాలోకి దిగారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అక్రమార్కులు వేగం పెంచారు. ఇదేఅదనుగా రేషన్‌షాపుల డీలర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల వద్ద నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని మీకే ఇస్తామంటూ ఇద్దరు ముగ్గురు వ్యాపారుల వద్ద ముందస్తుగా అడ్వాన్స్‌లు తీసుకుంటున్నారు. తీరా బియ్యం చేతికొచ్చాక వారిద్దరికి కాకుండా మూడో వ్యక్తికి అందజేస్తున్నారు. అలా ఒంగోలు నగరంలో 10 మంది డీలర్లు ముందుగా అడ్వాన్స్ తీసుకున్న వ్యాపారులకు కాకుండా ఇతరులకు రేషన్ బియ్యాన్ని ఎత్తిస్తున్నారు. దీంతో ముందుగా డబ్బులు ఇచ్చిన వ్యాపారులు ఆ మొత్తాన్ని తిరిగివ్వాలని కోరినా డీలర్లు పట్టించుకోవడం లేదు. ఇలా ఒంగోలులో కొత్తగా రేషన్ బియ్యం వ్యాపారంలోకి వచ్చిన ఇద్దరు అధికార పార్టీ నేతలు అడ్వాన్స్‌ల కింద డీలర్లకు సుమారు రూ.30లక్షలకుపైగా చెల్లించినట్లు సమాచారం. బియ్యం అందక, అడ్వాన్స్‌లు తిరిగి రాక వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాలుగు రోజుల క్రితం ఇదే విషయమై బియ్యం వ్యాపారి, డీలర్ మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇద్దరూ అధికారపార్టీ నేతలు కావడంతో ఎవరికి ఏమి చెప్పాలో తెలియక అక్కడున్న వారంతా సర్దుకున్నట్లు సమాచారం. ఇలా ఒంగోలు నగరంలో కొత్తగా బియ్యం వ్యాపారంలోకి వచ్చిన ఒకరిద్దరు నేతలు భారీగా నష్టపోగా, తాము అధికారపార్టీలో ఉన్నందున ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే ఆలోచనతో డీలర్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎక్కడ ఏ గొడవ జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.