తూతూ మంత్రంగా జలజీవన్‌ మిషన్‌ పనులు

ABN , First Publish Date - 2023-03-26T01:28:15+05:30 IST

మండలంలోని జలజీవన్‌ మిషన్‌ పథకం పనులను కాంట్రా క్టర్లు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని పలువురు సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

తూతూ మంత్రంగా జలజీవన్‌ మిషన్‌ పనులు

తర్లుపాడు, మార్చి 25: మండలంలోని జలజీవన్‌ మిషన్‌ పథకం పనులను కాంట్రా క్టర్లు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని పలువురు సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తర్లుపాడు మండల సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సూరెపల్లి సర్పంచ్‌ నవ్య మాట్లాడుతూ.. ఆరునెలల క్రితం జలజీవన్‌ మిషన్‌ పథకం పనులను సదరు కాంట్రాక్టర్‌ తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారన్నారు. ఒక్క ఇంటికి కూడా సక్రమంగా నీరు వచ్చిన దాఖలాలు లేవని సమావేశం దృష్టికి తీసుకొ చ్చారు. మండలంలో మరికొన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు జలజీవన్‌ మిషన్‌ పథకం పనులను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపేస్తామని ఆర్‌డబ్ల్యూ ఎస్‌ జేఈ జ్యోతి సృజన సమాధానం ఇచ్చారు. కేతగుడిపిలో సర్వే నెం.194 నుంచి 201 వరకు రెవెన్యూ భూములు అయినప్పటికీ సోషల్‌ ఫారెస్ట్‌ అధికారులు తమ భూములు అంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామ సర్పంచ్‌ దూదేకుల పెద్దమస్తాన్‌ సభ దృష్టికి తీసుకొచ్చారు. జగన్నాథపురంలో కూడా రెండు బోర్లు మరమ్మతులకు గురికావడంతో గ్రామంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొందని సర్పంచ్‌ గంటా వెంకటరెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. తహసీల్దార్‌ వరకుమార్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్‌.నరసింహులు, ఎంఈవో డి.సుజాత, ఏవో చంద్రశేఖర్‌, వైద్యాధి కారి సిందూజ, మండలంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

త్రిపురాంతకం : మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి కోరారు. మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఉపాధి పనుల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారని సక్రమంగా పనులు చేయాలని సూచించారు. ఉమ్మడివరం ఎంపీటీసీ సభ్యుడు ఆళ్ల ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ సంబంధంలేని వ్యక్తులు చెప్తే ఉపాధిపనులు చేస్తున్నారని తన గ్రామంలో తనకు తెలియకుండా పనులు చేశారని, తను చెప్పిన పనులు చేయడంలేదని ఉపాది సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిపురాంతకం సర్పంచ్‌ పి.వెంకటలక్ష్మీ మాట్లాడుతూ శివారు ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లు, స్తంభాలు లేవని అధికారులు స్పందించి త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమం లో తహసీల్దారు వి.కిరణ్‌, ఎంఈవో మల్లికార్జుననాయక్‌, ఎంపీడీవో మరియదాసు, పలువురు అధికారులు, ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T01:28:15+05:30 IST