వైద్యశాఖలో ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2023-03-26T00:55:02+05:30 IST

ప్రజారోగ్యం అంటేనే గుర్తుకొచ్చేది వైద్యశాఖనే. అలాంటి కీలకమైన శాఖకే అవినీతి జబ్బు చేసింది.

వైద్యశాఖలో  ఇష్టారాజ్యం

మన అనుకుంటే ఉద్యోగం కూడా చేయాల్సిన అవసరం లేదు

నియామకాల్లోనూ ఇదే పరిస్థితి

ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి కీలక ప్రాంతాల్లో వైద్యాధికారి పోస్టులు

కార్యాలయ పనివేళల్లో ఇంటి వద్దనే బేరాలు

కలిసొచ్చిన కరోనా కష్టకాలం

నియామకాలు, బదిలీల్లో చేతివాటం

ప్రజారోగ్యం అంటేనే గుర్తుకొచ్చేది వైద్యశాఖనే. అలాంటి కీలకమైన శాఖకే అవినీతి జబ్బు చేసింది. నియామకాల నుంచి డిప్యుటేషన్ల వరకు అంతా అక్రమాలే. ఏం కావాలి.. ఎంత ఇవ్వగలవు.. ఇదే తంతు జిల్లా కార్యాలయంలో షరామామూలైపోయింది. ఆఫీసులో కాకుండా ఇళ్ల వద్ద బేరాలు నడుపుతున్నారు. వైద్యశాఖలో జరిగే అవినీతి, అక్రమాలపై కలెక్టర్‌ నుంచి వైద్యశాఖ జాయింట్‌ డైరెక్టర్లు, ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదులు చేసినా స్పందించిన పరిస్థితి లేకుండా పోయింది. దీంతో జిల్లాలో ఆశాఖ అధికారులు చెప్పిందే రాజ్యం అన్నట్లుగా నడుస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అవినీతి జబ్బును బాగు చేసేది ఎవరు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఒంగోలు (కలెక్టరేట్‌), మార్చి 25 : ఏ జబ్బు వచ్చినా తమను ఆదుకొనేది వైద్యారోగ్యశాఖేనని ఇప్పటికీ జనా లు నమ్ముతూ ఉంటారు. అటువంటి కీలకమైన శాఖలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాము ఆడిందే ఆట.... పాడిందే పాట అన్న చందంగా పాలన సాగిస్తున్నారు. జిల్లా వెద్యారోగ్యశాఖ కార్యాల యం నుంచి క్షేత్ర స్థాయి వరకు అవినీతి రాజ్యమేలు తున్నా ఉన్నతాధికారి తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పోస్టుల నియామకాలు, బదిలీలు, డిప్యుటేషన్లు ఇలా అన్నింటా అవకతవకలు చోటుచేసుకుం టున్నాయి. సిఫార్సులు, అడిగినంత ఇచ్చుకో గలిగిన వారికి కోరినచోట స్థానం దొరుకు తోంది. అవసరం ఉన్నా లేకున్నా డిప్యుటేషన్లు నడుస్తున్నాయి. అలాగే నియామకాలు కూడా చేస్తున్నా రు. పోస్టుల కేటాయింపులోనూ బాగా చేతివాటం చూపుతున్నారు. ఇటువంటి అక్రమ వ్యవహారాలతో ఆశాఖ పరువు బజారున పడుతోంది. ఉన్నతాధికారుల ఉదాసీనతతో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమలుచేస్తున్న ఫ్యామిలీ ఫిజిషియన్‌ అభాసుపాలైంది.

కరోనాను అడ్డుపెట్టుకొని ఇష్టారీతిన ఉద్యోగాలు

కరోనా కష్టకాలంలో వైద్యశాఖ ద్వారా తాత్కాలిక సేవలు అందించేందుకు అప్పట్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. అనేక మంది ఔత్సాహికుల సేవల ను ఉపయోగించుకుంది. కరోనా సమయంలో వైద్యులు, నర్సులు, ఎల్‌టీఎం తదితర పోస్టుల్లో సేవలు అందించిన వారికి కొత్త పోస్టుల నియామాకాల్లో ప్రాధాన్యం ఇస్తామ ని అప్పట్లో ప్రకటించారు. దీంతో అనేకమంది తమకు వైద్యశాఖలో భర్తీచేసే పోస్టుల్లో ప్రాధాన్యత లభిస్తుందని ఆశించారు. కానీ వాస్తవంగా పనిచేసిన వారికి మొండిచే యి చూపుతున్నారు. వారికి కాకుండా అడిగింత ముట్టజె ప్పిన వారికి కరోనా సమయంలో పనిచేసినట్లుగా నకిలీ గుర్తింపు ఇస్తూ కొత్తగా నియమించే పోస్టుల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నారు. అలా ఇటీవల కాలంలో భర్తీచేసిన వివిధ రకాల పోస్టుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని కరోనా సమయంలో పనిచేసిన అభ్యర్థులు లబోదిబోమంటున్నారు.

ఇంటి వద్దనే మంతనాలు

వైద్యశాఖ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి.. నియామకాల్లో అంతా తానై వ్యవహారం నడుపుతున్నాడు. ఫైల్‌ను ఏ విధంగా పెట్టాలో సంబంధిత గుమస్తాలకు కూడా చెప్తుంటాడు. పోస్టుల నియామకం నుంచి బదిలీల వరకు ఏ విధంగా మాయ చేయాలో ఆ ఉద్యోగికి బాగా తెలుసు. తను అనుకున్న ఉద్యోగిని బదిలీ చేయాలన్నా, కొత్తవారికి పోస్టింగ్‌ ఇవ్వాలన్నా కార్యాలయంలో మాత్రం ఏమీ మాట్లాడరు. కార్యాలయ పనివేళల్లోనే వ్యవహారం నడుపుతాడు. బయోమెట్రిక్‌ వేసిన తర్వాత అవసరమైన వారిని ఇంటికి వచ్చి కలవాలని చెబుతాడు. బదిలీ కావాలన్నా, కొత్త ఉద్యోగం కావాలన్నా, డిప్యుటేషన్‌ వేయాలన్నా అక్కడే బేరం కుదుర్చు కుంటాడు. అందుకు పైస్థాయిలో పనిచేసే వారు కూడా అతనికి అనుకూలంగా ఉంటున్నారు. కానీ అన్నీ బాగా జరిగితే ఏమీ ఉండదు... ఏమైనా తేడాలు వచ్చి వివాదమైతే ఆ ఫైల్‌ విషయం తనకు తెలియదని తప్పించుకునే విషయంలో అందరికంటే ముందుంటాడు.

ఉద్యోగం చేయకపోయినా పట్టించుకోరు..

జిల్లాలో పనిచేసే అనేకమంది వైద్యులు ఉద్యోగం అంటేనే పట్టించుకోని పరిస్థితి ఉంది. కొందరు విధుల విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సమయపాలన పాటించడం లేదు ఈ విషయం వారు పనిచేసే వైద్యశాల నుంచి జిల్లా వైద్యశాఖ కార్యాలయం వరకు తెలిసినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో పనిచేసే ఒక మెడికల్‌ ఆఫీసర్‌ ఐదారు నెలల నుంచి విధులకు రాని పరిస్థితి ఉంది. ఆయన తన ప్రైవేటు వైద్యశాలలో పనిచేసుకుంటున్నారు. అయితే తాను పీహెచ్‌సీ పరిధిలోనే ప్రజలకు వైద్యం అందిస్తున్నట్లుగా మేనేజ్‌ చేసుకొని నెలవారీ లక్షల్లో జీతం తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా అనేక మంది వైద్యాధికారులు ఇదేవిధంగా వ్యవ హరిస్తున్నా పట్టించుకోవడం లేదు. దీని వెనుక కూడా వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగి ఉన్నట్లు తెలుస్తోంది.

అర్హత ఉన్నవారికి దక్కని ప్రాధాన్యం

వైద్యారోగ్యశాఖలో వివిధ రకాల పోస్టుల్లో అర్హతను బట్టి నియామకాలు చేస్తుంటారు. అయితే కరోనా సమయంలో ప్రభుత్వం ఇస్తామన్న ప్రాధాన్యతను ఆసరా చేసుకుని పోస్టులు అమ్ముకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నియమించిన వాటిలో 30 పోస్టుల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నా అవేమీ ఉన్నతాధికారి పట్టించుకోవడం లేదు. అలా 30మందిని మెడికల్‌ ఆఫీసర్స్‌, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టు పోస్టుల్లో నియమించారు. వారెవ్వరూ కరోనా సమయంలో పనిచేయలేదు. కానీ వారు పనిచేసినట్లు దొంగ గుర్తింపు ఇచ్చి డబ్బులు తీసుకుని నియమించారంటూ అర్హులైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల భర్తీచేసిన వైద్యాధికారి పోస్టుల్లో రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ చేసిన వారికి కాకుండా ఇతర రాష్ట్రాల్లో వైద్య విద్యను అభ్యసించి వచ్చిన వారికి ఇచ్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దగ్గర ప్రాంతాలకు రావాలంటే కష్టమే..

వైద్యశాఖలో దూరప్రాంతాల్లో పనిచేస్తూ వివిధ అనారోగ్య సమస్యలతో పట్టణ ప్రాంతాలకు తమను బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకుంటే వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి వారు ఏళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వైద్యారోగ్యశాఖలోని కొందరు అధికారులు తాము అనుకున్న వారిని మాత్రం ఒకచోట నుంచి మరోచోటకు బదిలీ చేయాలంటే ఒక్కరోజులోనే పూర్తిచేసేస్తున్నారు. అందుకు అనేక కారణాలు చూపుతుండటం గమనార్హం. ప్రజాప్రతినిధుల సిఫార్సులని ఒకపక్క చెబుతున్నారు. మరోవైపు కరోనా సమయంలో ఇక్కడ కష్టపడి పనిచేశారని చూపిస్తూ డబ్బులు ఇచ్చిన అనర్హులను మంచి పోస్టుల్లో నియమిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-03-26T00:55:02+05:30 IST