ఆరంభశూరత్వం

ABN , First Publish Date - 2023-03-30T23:28:33+05:30 IST

అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని నిరుపేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకు మంజూరైన సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఐనముక్కుల గ్రామం పరిసర ప్రాంతంలో రూ.49.26 కోట్ల ఈ వైద్యశాల నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ యాజమాన్యం 2023 నవంబరు 27వ తేదీ నాటికి పూర్తిచేసేందుకు 2021 మే 28న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ గడువు పూర్తికావడానికి కేవలం 8 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే క్షేత్రస్థాయి నిర్మాణం పరిశీలిస్తే పదిశాతం మించి పనులు జరగలేదు.

ఆరంభశూరత్వం
పునాదులలోనే వైద్యశాల నిర్మాణం పనులు

లక్ష్యం నవంబరు 2023

క్షేత్రస్థాయిలో కదలని పనులు

ఇప్పటికి పది శాతం కూడా కాలేదు

కనీసం రోడ్డు బిల్లులకు దిక్కు లేదు

పెద్దదోర్నాల, మార్చి 30: అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని నిరుపేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకు మంజూరైన సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఐనముక్కుల గ్రామం పరిసర ప్రాంతంలో రూ.49.26 కోట్ల ఈ వైద్యశాల నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ యాజమాన్యం 2023 నవంబరు 27వ తేదీ నాటికి పూర్తిచేసేందుకు 2021 మే 28న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ గడువు పూర్తికావడానికి కేవలం 8 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే క్షేత్రస్థాయి నిర్మాణం పరిశీలిస్తే పదిశాతం మించి పనులు జరగలేదు. నిర్మాణాలు పునాదులలోనే ఉన్నాయి. ప్రధానంగా చెంచు గిరిజనులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. పాలకులు, అధికారుల తీరు చూస్తే అంతా ఆరంభశూరత్వంగానే ఉందని గిరిజనులు పెదవి విరుస్తున్నారు.80శాతం నాబార్డు నిధులు, ఇరవై శాతం ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న వైద్యశాల పనులు పునాదులను మించి ముందుకు సాగడం లేదు.

పేదలకు పూర్తిగా ఉచిత వైద్యం

సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల పూర్తయితే మార్కాపురం డివిజన్‌లోని పేదలందరికీ కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా లభించే అవకాశముంది. ఈ డివిజన్‌లో ఏ పూటకు ఆ పూట కూలినాలీ చేసుకొని జీవనం సాగించే చెంచు గిరిజనులు, ఎస్సీలు అధికసంఖ్యల్లో ఉన్నారు. అటవీ ప్రాంతంలో నివసించే చెంచులకు ఎప్పుడు ఏ వైపు నుంచి ప్రమాదం వస్తుందో తెలీదు. నిత్యం అడవిలో ఫలసేకరణలో క్రూరమృగాల దాడులు, విషసర్పాల కాట్లతోపాటు రక్తహీనతతో వీరు ఇబ్బందులు పడుతుంటారు. మరోవైపు ఘాట్‌ రోడ్లలో ప్రమాదాలు ఎక్కువగానే చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సమయానికి సరైన వైద్యం అందక ప్రాణాలు పోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వైద్యశాల నిర్మాణం పూర్తయి అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తే తమ వారి ప్రాణాలు కాపాడుకోగలమని బలంగా నమ్మిన పేదలకు నిర్మాణ పనులు నిరాశ కలిగిస్తున్నాయి. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి, ఈ ప్రాంత శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్‌ ఇప్పటికైనా వైద్యశాల నిర్మాణంపై దృష్టిసారించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.

ప్రధాన రహదారి నిర్మాణానికి నిధుల లేమి

ఈక్రమంలో ప్రభుత్వం వైద్యశాల నుంచి కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిని అనుసంధానిస్తూ ప్రధాన రహదారిని నిర్మించేందుకు రూ.76లక్షలు ఉపాధి నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పటి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తదితరులు 2021 మార్చి 12న ఈ పనులకు శిలాఫలకం ఆవిష్కరించారు. దీంతో గ్రామానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు ముందుగా రూ.80 లక్షలు వెచ్చించి గ్రావెల్‌ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే రెండేళ్లు కావస్తున్నా ఆ రహదారి నిర్మాణానికి సంబంధించిన బిల్లులు రూపాయి కూడా మంజూరు కాలేదు. కనీసం ఎం-బుక్‌ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. దీంతో సదరు నేత మంత్రి సురేష్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు ఆస్పత్రిని దాన్ని అనుసంధానం చేసే రహదారిని త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-30T23:28:33+05:30 IST