పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్‌చేస్తా

ABN , First Publish Date - 2023-06-03T00:42:07+05:30 IST

జగన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ హెచ్చరించారు.

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్‌చేస్తా
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

అధికారులను హెచ్చరించిన కలెక్టర్‌

త్రిపురాంతకం, జూన్‌ 2: జగన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ హెచ్చరించారు. త్రిపురాంతకంలోని జగనన్న కాలనీలో లబ్ధిదారులు, అధికారులతో కలిసి శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణంలో జాప్యంపై లబ్ధిదారులు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు సకాలంలో మెటీరియల్‌ను అందించలేదని తేలడంతో వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ చేయకపోతే ఎలా? అని నిలదీశారు. మీరు ఒక నెల జీతం రాకపోతే ఊరుకుంటారా..? అని ప్రశ్నిం చారు. మెటీరియల్‌ సక్రమంగా సరఫరా చేయకపోతే శాఖ ఎందుకు ఉందని ప్రశ్నించారు. హౌసింగ్‌ విభాగం పనితీరు సక్రమంగా లేదన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. కాలనీల్లో డ్రైనేజీలు, తాగునీరు, రోడ్లు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులన్నింటినీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. త్రిపురాంతకంలో 582మందికి పట్టాలు ఇవ్వగా 318 మంది పనులు ప్రారంభించారని, మిగిలిన వారు ప్రారంభించలేదన్నారు. లబ్ధిదారులంతా ఇళ్లు కట్టుకోవాలని సూచించారు. కట్టకపోతే పట్టాలు రద్దవుతాయని, నిధులు కూడా వెనక్కు వెళతాయని పేర్కొన్నారు. ఈనెల 15 నాటికి నిర్మాణాలు ప్రారంభించాలని కోరారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోకపోతే మిగిలిన అర్హులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. మహిళలను పొదుపు గ్రూపుల్లో చేర్పించి రుణాలు ఇప్పించాలని సూచించారు. అంతకు ముందు రాజుపాలెంలోని ఎస్సీ ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక జడ్పీ పాఠశాలలో జేవీకే కిట్ల నాణ్యతను చూశారు. త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాలను సందర్శించి స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. కార్యక్రమాలలో ట్రైనీ కలెక్టర్‌ శౌర్యపటేల్‌, సబ్‌కలెక్టర్‌ సేతుమాధవన్‌, హౌసింగ్‌ పీడీ, డీఎల్‌డీవో సాయికుమార్‌, హౌసింగ్‌ డీఈఈ, ఏఈఈ, ఎంపీడీవో సాంబశివరావు, ఎంఈవో మల్లికార్జుననాయక్‌, డీటీ భ్రమరాంబ, ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:42:07+05:30 IST