ఇంటి బిల్లు బాబోయ్‌!

ABN , First Publish Date - 2023-06-03T00:38:35+05:30 IST

గృహనిర్మాణ పఽథకం కింద ఇల్లు నిర్మించుకుని నాలుగేళ్లు గడుస్తున్నా బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు తల్లడిల్లుతున్నారు.

ఇంటి బిల్లు బాబోయ్‌!
దర్శి హౌసింగ్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న జీమేసు

అప్పు చేసి కట్టుకున్నా డబ్బులివ్వడం లేదు

హౌసింగ్‌ కార్యాలయం ఎదుట లబ్ధిదారుడి బైఠాయింపు

దర్శి, జూన్‌ 2: గృహనిర్మాణ పఽథకం కింద ఇల్లు నిర్మించుకుని నాలుగేళ్లు గడుస్తున్నా బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు తల్లడిల్లుతున్నారు. దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్‌నగర్‌కు చెందిన బత్సలకూరి జీమేసు అనే లబ్ధిదారుడికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగృహం మంజూరైంది. ఇల్లు పూర్తిగా నిర్మించుకుని నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు. దీందో ఓపిక నశించిన జీమేసు దర్శిలోని హౌసింగ్‌ కార్యాలయం వద్ద శుక్రవారం బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అప్పులు చేసుకుని ఇల్లు నిర్మించుకొని నాలుగేళ్లు దాటినా బిల్లులు రాకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని వాపోయారు. ఈ విషయమై హౌసింగ్‌ అధికారులను వివరణ కోరగా గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరై నిర్మించుకున్న 211 మంది లబ్ధిదారులకు బిల్లులు రావాల్సి ఉందన్నారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం వివరాలు ప్రభుత్వానికి నివేదించామని, నిధులు మంజూరు కాగానే చెల్లిస్తామన్నారు.

Updated Date - 2023-06-03T00:38:35+05:30 IST