గుండ్లకమ్మ స్థలం గుటకాయస్వాహా..!
ABN , First Publish Date - 2023-07-15T00:13:30+05:30 IST
ఇప్పటి వరకూ ప్రభుత్వ, వివాదాస్పద స్థలాలపై కన్నేసిన అధి కారపార్టీ నేతలు ఇప్పుడు సహజ సిద్ధమైన ప్రకృతి వనరులపై కన్నేశారు.
మార్కాపురం, జూలై 14: ఇప్పటి వరకూ ప్రభుత్వ, వివాదాస్పద స్థలాలపై కన్నేసిన అధి కారపార్టీ నేతలు ఇప్పుడు సహజ సిద్ధమైన ప్రకృతి వనరులపై కన్నేశారు. ఆలోచన వచ్చిం దే తడువుగా ఆచరణలో పెట్టారు. ప్రతి రోజూ మండల, డివిజన్ స్థాయి అధికారులు వెళ్లే మార్గంలోనే యథేచ్ఛగా గుండ్లకమ్మ స్థలాన్ని ఆక్రమించారు. అయినప్పటికీ, అధికారులు ఆ వైపు చూడడం లేదు. అధికారపార్టీకి చెందిన కీలకవ్యక్తి అండదండలతో ఈ ఆక్రమణల పరంపరకు ద్వితీయశ్రేణి నాయకులు శ్రీకారం చుట్టడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
గుండ్లకమ్మ స్థలంపై కబ్జాదారుల కన్ను
మార్కాపురం పట్టణానికి కూతవేటు దూరంలో పడమర దిక్కున గుండ్లకమ్మ నది ప్రవహిస్తోంది. ఈ నది మార్కాపురం పట్టణ ప్రజలను దాహార్తిని తీర్చే ప్రధాన నీటివనరు. చాలాకాలం వరకూ గుండ్లకమ్మలో నీటి నిల్వల కారణంగా పట్టణంలో భూగర్భజలాలు అందు బాటులో ఉండేవి. ఇటీవల కాలంలో సరిపడా వర్షాలు లేకపోవడంతో గుండ్లకమ్మనది ఎండు ముఖం పట్టింది. దీంతో నీళ్లు అడుగంటాయి. ఇంతటి విలువైన గుండ్లకమ్మ నది భూములపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. 50 అడుగులకు పైగా వ్యర్థాలతో పూడ్చి భూమిని చదును చేశారు. కోట్లు విలువ చేసే భూమి ఆక్రమించారు.
పట్టించుకోని అధికార యంత్రాంగం
గుండ్లకమ్మ నదిని బహిరంగంగా ఆక్రమి స్తుంటే అధికార యంత్రాంగం ఆవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రెవెన్యూ, నీటిపారు దలశాఖ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుం టూ కాలయాపన చేస్తున్నారు. అధికారపార్టీ నాయకులంటే భయమో లేక తమకు ముట్టాల్సిన ముడుపు చేతికొచ్చాయో తెలియదుకానీ గుండ్లకమ్మను పరిరక్షించాల్సిన బాధ్యతను మాత్రం మరిచారు.