తీరంలో గోవా మద్యం పరవళ్లు

ABN , First Publish Date - 2023-09-21T23:28:14+05:30 IST

జిల్లాలోని తీరప్రాంతంలో గోవామద్యం పరవళ్లు తొక్కుతోంది. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అక్కడి నుంచి మద్యం కొనుగోలు చేసి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. కొంతకాలంగా గట్టుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని ఎస్‌ఈబీ రట్టుచేసింది. ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేసింది. రూ.3లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.

తీరంలో గోవా మద్యం పరవళ్లు
స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను చూపిస్తున్న ఎస్‌ఈబీ అధికారులు

రూ.3లక్షల విలువైన సరుకు, కారు స్వాధీనం

ఐదుగురు అరెస్టు.. పరారీలో నలుగురు

వివరాలు వెల్లడించిన

ఎస్‌ఈబీ జిల్లా అధికారి సుధీర్‌బాబు

ఒంగోలు (క్రైం), సెప్టెంబరు 21 : జిల్లాలోని తీరప్రాంతంలో గోవామద్యం పరవళ్లు తొక్కుతోంది. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అక్కడి నుంచి మద్యం కొనుగోలు చేసి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. కొంతకాలంగా గట్టుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని ఎస్‌ఈబీ రట్టుచేసింది. ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేసింది. రూ.3లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. వివరాలను ఎస్‌ఈబీ జిల్లా అధికారి సుధీర్‌బాబు గురువారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది, గోవాకు చెందిన ఒకరు ముఠాగా ఏర్పడ్డారు. గోవాలోని కార్వాన్‌ అనే ప్రాంతంలో మద్యం కొనుగోలు చేసి జిల్లాకు తరలిస్తున్నారు. దాన్ని గుర్తించకుండా ఇక్కడి మద్యం అన్నట్లుగా లేబుళ్లు తయారు చేయించి బాటిళ్లపై అంటించి విక్రయిస్తున్నారు. వీటితోపాటు మన జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్‌ వైజర్లు, సిబ్బందితో సంబంధాలు ఏర్పరచుకొని ఇక్కడి మద్యాన్ని కూడా కొనుగోలు చేసి రెండూ కలిపి బెల్ట్‌షాపులకు చేరవేస్తున్నారు. ఆ విషయమై సమాచారం అందుకున్న ఎస్‌ఈబీ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ లత, జేడీ బృందం సీఐ వంశీ, ఎస్సై శ్రీనివాసులు, ఎస్‌ఈబీ ఎస్సై గోపాలకృష్ణలు మద్యాన్ని కారులో తరలిస్తుండగా కొత్తపట్నం మండలం మడనూరు వద్ద మాటు వేసి పట్టుకున్నారు. అందులో ఉన్న నాగులుప్పలపాడు మండలం చిన్నంగారి పట్టంపాలెంనకు చెందిన మేకల బాబు, సింగరాయికొండ మండలం ఊళ్లపాలెంనకు చెందిన అరవ ప్రవీణ్‌, ఉలవపాడు మండలం టెంకాయిచెట్లపాలెం గ్రామానికి చెందిన వి.వెంకటేశ్వర్లు, కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెంనకు చెందిన కటారి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. వారి వద్ద రూ.3లక్షల విలువైన మద్యాన్ని, కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాటిలో గోవా మద్యం బాటిళ్లు 416, అంధ్ర మద్యం బాళ్లు 282 ఉన్నాయి. ఈ ముఠాలోని సభ్యులైన కోడూరి సింఽధు, ములగాని శివరెడ్డి, పబ్బిశెట్టి మధుసూధనరెడ్డి, ప్రాన్సిస్‌లు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఈబీ జిల్లా అధికారి తెలిపారు. వీరందరిపై గతంలో అనేక పాత కేసులు ఉన్నాయన్నారు.

ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బందితో కుమ్మక్కు

గతంలో కంటైనర్‌లో తరలిస్తున్న గోవా మద్యాఇన్న బాపట్ల జిల్లా వేటపాలెం సమీపంలో ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఆ కేసులో సూత్రధారిగా ఉన్న మేకల బాబు, అరవపవన్‌తోపాటు పరారీలో ఉన్న కోడూరి సింధులు కూడా ప్రస్తుత కేసులో నిందితులుగా ఉన్నారు. అంతేకాకుండా ఫ్రాన్సిస్‌పై పొరుగు రాష్ట్రాలలో కూడా పలు కేసులు ఉన్నాయి. వీరు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సూపర్‌ వైజర్లు, సిబ్బందిని లోబర్చుకొని ఇక్కడ మద్యాన్ని కూడా కొనుగోలు చేసి గోవా సరుకుతో కలిపి బెల్ట్‌ షాపులకు తరలిస్తున్నట్లు ఎస్‌ఈబీ విచారణలో తేలింది.

కంటైనర్ల ద్వారా తరలింపు

జిల్లా నుంచి చేపలు, రొయ్యల లోడుతో కర్నాటక, గోవా, కేరళ రాష్ట్రాలకు వెళ్తున్న కంటైనర్‌లలో అక్కడ నుంచి మద్యం తెచ్చి తీరప్రాంతాలలో విక్రయిస్తున్నారు. గోవాలో ఫుల్‌ బాటిల్‌ను సుమారు రూ.450కు కొనుగోలు చేస్తున్న వారు ఇక్కడ రూ.1000 వరకూ విక్రయిస్తున్నారు. ఈ ముఠా ఏళ్ల తరబడి ఇదే పనిలో ఉన్నట్లు ఎస్‌ఈబీ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ కేసు ఇంకా విచారణలో ఉన్నదని, పరారీలో ఉన్న నలుగురి కోసం గాలిస్తున్నామని ఎస్‌ఈబీ జిల్లా అధికారి సుధీర్‌బాబు చెప్పారు. మద్యం రవాణాకు వినియోగించిన కంటైనర్‌ను గుర్తించామని దాన్ని కూడా సీజ్‌ చేస్తామన్నారు. ముఠా గుట్టును రట్టు చేసిన ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బంది అభినందించారు.

Updated Date - 2023-09-21T23:28:14+05:30 IST