ఓట్ల తొలగింపుపై గరం గరం
ABN , First Publish Date - 2023-08-22T21:51:30+05:30 IST
ఓట్ల ఇంటింటి సర్వే కార్యక్రమానికి సంబంధించి జరిగిన సమావేశం వాడివేడీగా సాగింది. పర్చూరు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గస్థాయి రాజకీయ పార్టీ నేతలతో సమావేశం జరిగింది. ఓట్ల ఇంటింటి సర్వే కార్యక్రమం ముగింపు సందర్భంగా పర్చూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి.వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో టీడీపీ నేతలు అక్రమాలపై ధ్వజమెత్తారు.
వాడివేడిగా రాజకీయ పార్టీ నేతల సమావేశం
అక్రమంగా ఫామ్ 7 దాఖలు చేశాారంటూ టీడీపీ మండిపాటు
క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్
పర్చూరు, ఆగస్టు 22: ఓట్ల ఇంటింటి సర్వే కార్యక్రమానికి సంబంధించి జరిగిన సమావేశం వాడివేడీగా సాగింది. పర్చూరు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గస్థాయి రాజకీయ పార్టీ నేతలతో సమావేశం జరిగింది. ఓట్ల ఇంటింటి సర్వే కార్యక్రమం ముగింపు సందర్భంగా పర్చూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి.వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో టీడీపీ నేతలు అక్రమాలపై ధ్వజమెత్తారు. అధికార వైసీపీ అక్రమ మార్గంలో పెద్ద మొత్తంలో ఓట్లు తొలగింపుకు ఫామ్ 7 దాఖలు చేసిందన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక బీఎల్‌ఏ రోజుకు ఐదు చొప్పున గరిష్ఠంగా 30 దరఖాస్తు చేయాలి. అయితే, వందల సంఖ్యలో అక్రమ మార్గంలో ఓట్ల తొలగింపునకు పాల్పడ్డారని అన్నారు. ఇందుకు కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పర్చూరు నియోజకవర్గంలో ఫామ్6, ఫామ్ 7, ఫామ్ 8కు సంబంధించి మొత్తం 16వేలు దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అందులో పది వేల ఓట్లను అక్రమ మార్గంలో తొలగింపునకు దరఖాస్తు చేశారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఓట్ల తొలగింపునకు ఫామ్ 7 ద్వారా 21వేలు దరాఖాస్తులు రాగా, అందులో 10వేలు ఒక్క పర్చూరు నియోజకవర్గంలోనే నమోదు కావటం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. తెలుగు మహిళ మార్టూరు మండల అధ్యక్షురాలు రమాదేవి తన ఓటు సైతం ఫామ్ 7 ద్వారా తొలగింపు చర్యకు పాల్పడ్డారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకొచ్చారు. నేతల ఓట్లను సైతం అక్రమ మార్గంలో తొలగిపు చర్యలకు పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆయా మండలాల తహసీల్దార్‌లు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.
దరఖాస్తు చేసినంత మాత్రాన ఓటు రద్దు కాదు
అర్హుల ఓట్లను అక్రమ మార్గంలో తొలగించేందుకు దరఖాస్తు చేసినా ఓటు రద్దుకాదని పర్చూరు నియోజకవర్గ ఎన్నికల అదనపు అఽధికారి టి.వెంకటనారాయణ తెలిపారు. ఈ దరఖాస్తులపై విచారణ చేసి అర్డులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పిస్తామని చెప్పారు. నిబంధనలను అతిక్రమించి పెద్ద మొత్తంలో ఫామ్ 7 ద్వారా ఓటు హక్కును తొలగించేందుకు పాల్పడిన వారిపై 13, 14 నోటీసు జారీచేసి చర్యలకు కలెక్టర్‌కు సిఫార్సు చేస్తామన్నారు.
అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
ఓట్ల తొలగింపునకు అక్రమ పద్ధతిలో ఫామ్ 7 దాఖలకు కారకులైనవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశం అనంతరం కార్యాలయం బయట టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు సైతం ఓట్ల తొలగింపులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇందుకు కారకులపై నోటీసులు జారీపేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
నేతలకు ఓ న్యాయం, ఓటర్లకు ఓ న్యాయమా..
రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ఓట్ల తొలగింపుకు అధికార వైసీపీ పాల్పడుతుందని జై బీం పర్చూరు నియోజవర్గ బాధ్యుడు జెట్టి శివ అన్నారు. తాను పర్చూరు నియోజకవర్గ పార్టీ భాద్యునిగా ఉన్నానని, తన ఓటు సైతం ఫామ్ 7 ద్వారా తొలగింపునకు కుట్రపన్నారని అన్నారు.