Share News

నకి‘లీలలు’

ABN , First Publish Date - 2023-12-10T23:12:21+05:30 IST

వైద్యారోగ్యశాఖలో 2020లో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు బయటపడుతున్నారు. నకి‘లీలలు’ వెలుగు చూస్తున్నాయి. దీంతో అటు ఉద్యోగాలు పొందిన వారితోపాటు ఇటు నియామకాల సమయంలో పనిచేసిన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వైద్యారోగ్యశాఖలో నియామకాలపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు.

నకి‘లీలలు’

వైద్యశాఖ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు

విచారణలో వెలుగులోకి వాస్తవాలు

నేడో, రేపో కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్న అధికారులు

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 10 : వైద్యారోగ్యశాఖలో 2020లో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు బయటపడుతున్నారు. నకి‘లీలలు’ వెలుగు చూస్తున్నాయి. దీంతో అటు ఉద్యోగాలు పొందిన వారితోపాటు ఇటు నియామకాల సమయంలో పనిచేసిన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వైద్యారోగ్యశాఖలో నియామకాలపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. జడ్పీ సీఈవో జాలిరెడ్డి నేతృత్వంలో ముగ్గురు అధికారులను ఆ బాధ్యతను అప్పగించారు. వారు కొద్ది రోజుల క్రితం విచారణ ప్రారంభించారు. అనేక మందికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు కట్టబెట్టినట్లు గుర్తించారు. సాధారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంటే నోటిఫికేషన్‌ నుంచి నియామక పత్రాలు ఇచ్చే వరకు ఉత్తరప్రత్యుత్తరాలతోపాటు మెరిట్‌ జాబితా, అభ్యర్థుల ధ్రువీకరణపత్రాలు అన్నీ ఉండాలి. కానీ 2020లో చేపట్టిన నియామకాలకు సంబంధించి అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడాన్ని విచారణాధికారులు గుర్తించి అవాక్కయ్యారు.

తమకు వైద్యారోగ్యశాఖ నుంచి అందిన కొద్దిపాటి దరఖాస్తులను పరిశీలించి అనుమానం ఉన్న వారితో నేరుగా మాట్లాడి అవసరమైన ధ్రువీకరణపత్రాలు తెప్పించుకున్నారు. వాటికి, ఉద్యోగ సమయంలో ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలకు ఆసలు సంబంధం లేదని గుర్తించినట్లు తెలిసింది. కొన్ని సర్టిఫికెట్‌లను అభ్యర్థులు చదువుకున్నట్లు ఇచ్చిన యూనివర్సిటీలు, కాలేజీలకు పంపి వాస్తవ సర్టిఫికెట్లా? కాదా? అని నిర్థారించుకున్నట్లు తెలిసింది. వాటిలో కొన్ని నకిలీవని తేలినట్లు సమాచారం. వాటన్నింటిపై విచారణాధికారులు కలెక్టర్‌కు సోమ, మంగళవారాల్లో సమగ్ర నివేదికను ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతో అక్రమార్కులు వణికిపోతున్నారు.

Updated Date - 2023-12-10T23:12:23+05:30 IST