ఉరిమే ఉత్సాహం

ABN , First Publish Date - 2023-03-19T02:30:49+05:30 IST

అధికార పార్టీ దౌర్జన్యాలు, అక్రమాలు, వేధింపులతో నాలుగేళ్లపాటు ఇబ్బందిపడ్డ తమ్ముళ్లకు కొండంత బలమొచ్చింది. పట్టభద్రుల రూపంలో వారికి పట్టుదొరికింది.

ఉరిమే ఉత్సాహం

తెలుగు తమ్ముళ్లలో ఫుల్‌ జోష్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో నూతనోత్తేజం

పశ్చిమ రాయలసీమ విజయంతో మరింత ఊపు

కేక్‌కటింగ్‌లు, బాణసంచా మోతలు

అన్నిచోట్లా విజయోత్సవాలు

ఎక్కడచూసినా విద్యావంతుల తీర్పుపై చర్చ

అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్‌ ఉంటుందన్న ధీమా

అధికార పార్టీ దౌర్జన్యాలు, అక్రమాలు, వేధింపులతో నాలుగేళ్లపాటు ఇబ్బందిపడ్డ తమ్ముళ్లకు కొండంత బలమొచ్చింది. పట్టభద్రుల రూపంలో వారికి పట్టుదొరికింది. రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా సాధించలేకపోయిన శాసనమండలి పట్టభద్రుల స్థానాలను ప్రస్తుతం గెలవడంతో అందరిలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి జరిగిన మూడు ప్రాంతాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీడీపీ గెలుపొందింది. ప్రధానంగా తూర్పు రాయలసీమ స్థానం నుంచి కంచర్ల శ్రీకాంత్‌ భారీ మెజారిటీతో గెలవడం జోష్‌ నింపింది. మొత్తంగా విద్యావంతులు అనూహ్య తీర్పు ఇచ్చి టీడీపీ శ్రేణుల్లో ఉరిమే ఉత్సాహాన్ని నింపారు.

ఒంగోలు, మార్చి 18 (ఆంఽధ్రజ్యోతి): పట్టభద్రులు తెలుగుదేశం పార్టీకి జైకొట్టడంతో తమ్ముళ్లకు పండగొచ్చింది. రాష్ట్రంలో జరిగిన మూడు పట్టభద్రుల శాసనమండలి స్థానాల్లో టీడీపీ జయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపు ఆపార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ప్రత్యేకించి ఉమ్మడి ప్రకాశం జిల్లా అంతర్భాగంగా ఉన్న తూర్పు రాయలసీమ స్థానంలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరుకు చెందిన కంచర్ల శ్రీకాంత్‌ భారీ మెజారిటీతో గెలుపొందారు. చిత్తూరులో గురువారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డిపై 34,110 ఓట్ల భారీ మెజారిటీతో శ్రీకాంత్‌ గెలుపొందారు. ఆ మేరకు రిటర్నింగ్‌ అధికారి అయిన చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణ్‌ నుంచి ధ్రువీకరణ పత్రం పొందారు. కాగా ఈ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఏకోన్ముఖంగా పనిచేశాయి. వరుస పరాజయాలతో ఒకవైపు, అధికారంలో ఉన్న వైసీపీ దౌర్జన్యం, దాడులు, అరాచకాలతో మరోవైపు విసిగిపోయిన టీడీపీ కేడర్‌ గెలుపుపై పూర్తి నమ్మకంతో పనిచేసింది. ఇలాంటి సమయంలో ఎన్నికలు జరిగిన మూడు పట్టభద్రుల స్థానాల్లో గెలవడం అందులో ఇక్కడ అభ్యర్థి భారీ మెజార్టీ సాధించడంతో తెలుగు తమ్ముళ్లు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

సంబరాలే సంబరాలు

జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆనందోత్సాహాలను పరస్పరం పంచుకుంటూ తెలుగు తమ్ముళ్లు గెలుపు సంబరాలు చేసుకున్నారు. సాధారణంగా ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉండే ఈ తరహా సందడి ఈసారి గ్రామీణ ప్రాంతాలకు చేరింది. పట్టణాల్లోని వివిధ వార్డులు, వందలాది గ్రామాల్లో గత 24 గంటలుగా కేక్‌ కటింగ్‌లు, బాణసంచాలు పేల్చడం, ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు నివాళులు వంటి కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. శుక్రవారం రాత్రికే తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో టీడీపీ గెలుపుపై స్పష్టత వచ్చింది. పశ్చిమ రాయల సీమలో ఢీ అంటే ఢీ అనేలా ఉన్నప్పటికీ కొంతమేర వైసీపీ అభ్యర్థికి ఆధిక్యం కన్పించింది. అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో టీడీపీ విజయం సాధించినట్లు శనివారం సాయంత్రానికి స్పష్టత రావడం ఆపార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెంచింది. కాగా విద్యావంతులు అనుకూల తీర్పు ఇవ్వడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే తధ్యం అన్న ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు కేక్‌ కట్‌ చేసి నేతలకు తినిపించారు. వారిలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు డాక్టర్‌ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు ఉన్నారు.

కేక్‌లు కట్‌చేసి, బాణసంచా కాల్చి..

డాక్టర్‌ కంచర్ల శ్రీకాంత్‌ గెలుపుతో ఒంగోలులో తెలుగు తమ్ముళ్లు సంబరాల్లో మునిగిపోయారు. శనివారం స్థానిక కేశవస్వామిపేటలో 27వ డివిజన్‌కు చెందిన కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. స్థానిక గాంధీ రోడ్‌లోని 23,25 డివిజన్లకు చెందిన టీడీపీ నాయకులు స్వీట్లు పంచుకున్నారు.29వ డివిజన్‌లో నాయకులు సంబరాలు చేశారు. కనిగిరిలో టీడీపీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే, ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి విజయోత్సవ ఆనందాన్ని పంచుకున్నారు. వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. పామూరులో నాయకులు పెద్దఎత్తునబాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఎర్రగొండపాలెంలో ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు టీడీపీ ఆఫీసులో కేక్‌కట్‌ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. పొదిలిలో నిర్మమహేశ్వరాలయంలో పూజలు చేసిన టీడీపీ నేతలు పెద్దబస్టాండ్‌ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి బాణసంచా కాల్చారు. అనంతరం విశ్వనాథపురం సెంటర్లో కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు.

Updated Date - 2023-03-19T02:30:49+05:30 IST