అన్న’ం వైపే అందరూ...!
ABN , First Publish Date - 2023-09-02T00:37:26+05:30 IST
ఆకలితో వచ్చిన అన్నార్తులకు లేదనకుండా అన్నం పెడుతున్నారు. అక్షయపాత్రలా పేదవారి ఆకలి తీరుస్తూ వారి కళ్లలో ఆనందాన్ని చూస్తున్నారు. అందరికీ అన్నం పెట్టాలని ఆలోచన వచ్చిందే తడవుగా లక్షలు వెచ్చించారు. రోజూ వందల మందికి కడుపునింపుతున్నారు డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి. విమర్శించిన వారే తిరిగి శభాష్ అనేలా కనిగిరిలో అన్నా క్యాంటీన్‌ను నిరంతరాయంగా, నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఆ మహాయజ్ఞం శుక్రవారంతో 200 రోజులు పూర్తిచేసుకుంది. అయితే పోటీగా వైసీపీ వారు ప్రారంభించిన ఆహా క్యాంటీన్ తొలిరోజు నుంచే వెలవెలబోతోంది. సరైన ప్రణాళిక లేకపోవడం, ఏదో తూతూమంత్రంగా ప్యాకెట్లు తెచ్చిపెట్టి అమ్మే విధంగా ఉండటంతో అటువైపు ఎవరూ చూడని పరిస్థితి.
కనిగిరిలో నిత్యకల్యాణం పచ్చతోరణంలా అన్నా క్యాంటీన్
రూ.5కు కడుపునిండా భోజనం
వైసీపీ ప్రభుత్వం పోటీగా ఆహా క్యాంటీన్ ఏర్పాటు
పైపెచ్చు రూ.30 ధర
వెలవెలబోతుండడంతో అధికార పార్టీ నేతల్లో కలవరం
టీడీపీ ఇన్‌చార్జి ఉగ్ర ఆధ్వర్యంలో నిరంతరాయంగా 200 రోజుల నుంచి పేదలకు భోజనం
విమర్శించిన నోళ్లే శభాష్ అంటున్నాయ్
చివరకు తుస్‌మనడంతో వైసీపీ నేతల మల్లగుల్లాలు
ఆకలితో వచ్చిన అన్నార్తులకు లేదనకుండా అన్నం పెడుతున్నారు. అక్షయపాత్రలా పేదవారి ఆకలి తీరుస్తూ వారి కళ్లలో ఆనందాన్ని చూస్తున్నారు. అందరికీ అన్నం పెట్టాలని ఆలోచన వచ్చిందే తడవుగా లక్షలు వెచ్చించారు. రోజూ వందల మందికి కడుపునింపుతున్నారు డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి. విమర్శించిన వారే తిరిగి శభాష్ అనేలా కనిగిరిలో అన్నా క్యాంటీన్‌ను నిరంతరాయంగా, నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఆ మహాయజ్ఞం శుక్రవారంతో 200 రోజులు పూర్తిచేసుకుంది. అయితే పోటీగా వైసీపీ వారు ప్రారంభించిన ఆహా క్యాంటీన్ తొలిరోజు నుంచే వెలవెలబోతోంది. సరైన ప్రణాళిక లేకపోవడం, ఏదో తూతూమంత్రంగా ప్యాకెట్లు తెచ్చిపెట్టి అమ్మే విధంగా ఉండటంతో అటువైపు ఎవరూ చూడని పరిస్థితి.
కనిగిరి, సెప్టెంబరు 1 : ఈ ఏడాది జనవరి 6న జననీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి రూ.10లక్షలు వెచ్చించి కనిగిరిలో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. ప్రారంభించినపుడు రోజూ రూ.5కే అన్నం, ఐదు రకాల కూరలు, పెరుగుతో భోజనం పెడుతున్నారు. మొదట్లో ‘ఇలా రోజు వండిపెట్టడం సాధ్యమేనా?, ఉగ్రకు అంతా పట్టుదల ఉందా.. అసలు ఎంత ఖర్చవుతుంది.. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ప్రజాధనం వెచ్చించి సంక్షేమ పథకాల్లో అది కూడా ఒకటిగా నిర్వహించారు. ఇప్పుడా పార్టీ అధికారంలో లేదు. నిర్వహణలో ఏదన్నా తప్పు దొర్లితే అధికారపార్టీ కాచుక్కూర్చుని ఉంది. ఎన్నిరోజులు సాగుతుందిలే’ అంటూ పలురకాలుగా మాట్లాడిన పరిస్థితి. ప్రధానంగా వైసీపీ వారు బహిరంగంగానే మాట్లాడారు. డాక్టర్ అకుంఠిత దీక్షతో టీడీపీ నేతల సేవా, సహకారాలతో ప్రతిరోజూ ఎంతోమంది ఆకలి తీరుస్తూ విమర్శించి వారి నోళ్లను మూయించారు. కేవలం రూ.5కే అన్నం పెడుతున్న ఆయనను అందరూ అభినందించారు.
వెలవెలబోతున్న ఆహా క్యాంటీన్
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా స్థానిక అధికారపార్టీ నేతల తీరు ఉంది. కనిగిరిలో అన్నాక్యాంటీన్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులు ఆలోచనలో పడ్డారు. ఈ తరుణంలో వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీ కేంద్రాల్లో ‘ఆహా క్యాంటీన్’ ద్వారా అన్నం పెట్టేందుకు కార్యక్రమాన్ని రూపొందించి పట్టణ కేంద్రాల్లో ప్రారంభించింది. అందులో భాగంగా కనిగిరిలో పోలీస్‌స్టేషన్ ఆవరణలో పెరుగు అన్నం లేదా పులిహోరా రూ.30లకు పెట్టేందుకు టెంట్ వేసి ప్రారంభించారు. ఆహా క్యాంటీన్‌లో పెట్టిన ఆ వంటకాన్ని తినాలంటే మంచినీళ్లు కూడా ఉండవు. అన్నం కొని, ఎక్కడైనా మంచినీళ్లు కొని వేరేఎక్కడికో పోయి తినాల్సిందే. మెప్మా ద్వారా నిర్వహించే ఈ ఆహా క్యాంటీన్ జనాలు రాకపోవటంతో వెలవెలబోతోంది. ఈ క్యాంటీన్ నిర్వహణ కోసం పదార్థాలను వండి తెచ్చేవారు ఇబ్బందిపడుతున్నారు. ప్రతిరోజు అంతా మిగిలిపోతుండటంతో పారేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. అందరూ అన్నాక్యాంటీన్ బాట పట్టడంతో ఆహా వద్ద సిబ్బంది ఈగలు తోలుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు.
పక్కా ప్రణాళికతో నిర్వహణ
ప్రతిరోజూ కూరలు మాత్రం అదనంగా తయారుచేయిస్తూ.. పెరుగు కావాల్సినంత సమకూరుస్తూ ఓ ప్రణాళికగా అన్నాక్యాంటీన్ నిర్వహిస్తున్నారు. అనంతరం కావాల్సినంత మందికి అన్నం వడ్డించేలా ఏర్పాటు చేసకుంటున్నారు. ఆకలితో వచ్చిన వారు అధికంగా వచ్చినట్లు గుర్తిస్తే అందుకు తగినంతగా సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చిన వారికి లేదనకుండా ప్రణాళికా బద్ధంగా సాగే అన్నా క్యాంటీన్‌లో రూ.5 భోజనంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ప్రతిక్షణం పర్యవేక్షణ చేస్తూ టీడీపీ వలంటీర్లు విశిష్ఠ సేవలు అందిస్తున్నారు. దీంతో రోజుకురోజుకు వచ్చేవారి సంఖ్య పెరుగుతూ నేడు 500 మందికి అన్నం పేట్టే అక్షయపాత్రగా మారింది. డాక్టర్ ఉగ్ర ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నాక్యాంటీన్ ప్రజాదరణ పొందుతోంది. రోజువారీ కూలీ, రిక్షా కార్మికులు, ఆటోడ్రైవర్లు, బేల్దారి కూలీలు, పాదచారులు, సాధువులు, ఆదరణ కోల్పోయిన వృద్ధులు, విద్యార్దులు, పరాయి ఊళ్ళ నుంచి పనులపై వచ్చిన ప్రజలు ఇలా ఎంతోమంది క్యాంటీన్‌లో రుచికరమైన భోజనం కోసం బారులు తీరుతున్నారు. దీంతో అన్నాక్యాంటీన్ దిగ్విజయంగా వెలిగిపోతోంది.
పదవి కోసం కాదు.. పేదవాడి ఆకలి తీర్చాలన్నదే తపన
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్ర
ఏ సేవా కార్యక్రమం నిర్వహించినా ప్రతిఫలం, పదవులను ఆశించి ఎప్పుడూ చేయలేదు. కనిగిరి ప్రాంతంలో పుట్టి పెరిగినందుకు ఈ ప్రాంతం అన్నివిధాలుగా బాగుండాలన్నదే నా తపన. కొన్ని సందర్భాల్లో ఎంత డబ్బు ఉన్నా పట్టెడన్నం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. స్థితిమంతులు సమయం లేక ఆకలితో సాగుతుంటారు. బక్కజీవులు ఆర్థిక ఇబ్బందులతో డబ్బులు లేక ఆకలితో పడుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదన్నదే నా ఆలోచన. టీడీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ నిర్వహించి ఎంతో ఆకలి తీర్చిన చంద్రబాబు ఆశయం నన్ను కదిలించింది. రూ.5 కే అన్నం పెట్టాలనుకున్నా. మొదట్లో సంశయం చెందా. ఖర్చుతో కూడుకుంది అనుకున్నా. అయినా పర్వాలేదు నా వద్ద సమకూరినంత వరకే పేదల ఆకలి తీర్చాలనుకున్నా. అడుగు పడింది. ఆ ఆడుగుకు ఎంతోమంది అడుగులు కలిశాయి. పేదల ఆకలి తీర్చాలనే నా ఆలోచన నిర్విరామంగా కొనసాగేలా సహకారం అందించిన దాతలకు కృతజ్ఞతలు. చాలామంది వేడుకల్లో ఆహారం వృథాగా పడేస్తుంటారు. అలా వృథా అయ్యేకన్నా ఇలాంటి వాటికి సహకారం అందించాలని కోరుతున్నా. 200రోజులు పూర్తిచేసుకుని ఎలాంటి పొరపాట్లు రాకుండా జరిగేలా సేవలందిస్తున్న టీడీపీ వలంటీర్లకు, సిబ్బందికి అభినందనలు.