ఈసారీ నిరాశే!
ABN , Publish Date - Dec 31 , 2023 | 01:10 AM
కంభం చెరువు ఆయకట్టు రైతులకు ఈసారీ నిరాశే మిగిలింది. ఇటీవల అల్పపీడనం, తుఫాన్ ప్రభావంతో భారీవర్షాలు కురిసి జిల్లాలోని పలు చెరువులు, ప్రాజెక్టులు నిండగా కంభం చెరువుకు మాత్రం కేవలం 2 అడుగుల మేర నీరు మాత్రమే చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
120 ఏళ్లలో నిండింది 11 సార్లే
కంభం చెరువులో ప్రస్తుతం 10 అడుగుల నీరు
కంభం, డిసెంబరు 30 : కంభం చెరువు ఆయకట్టు రైతులకు ఈసారీ నిరాశే మిగిలింది. ఇటీవల అల్పపీడనం, తుఫాన్ ప్రభావంతో భారీవర్షాలు కురిసి జిల్లాలోని పలు చెరువులు, ప్రాజెక్టులు నిండగా కంభం చెరువుకు మాత్రం కేవలం 2 అడుగుల మేర నీరు మాత్రమే చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన కంభం చెరువు 2020లో కురిసిన వర్షాలకు నిండి అలుగుపారిన విషయం విదితమే. ఇప్పటివరకు చెరువు మొత్తం నిండింది 20 సార్లే. శ్రీకృష్ణదేవరాయల సతీమణి వరదరాజమ్మ సుమారు 500 ఏళ్లకు పూర్వం 25 వేల హెక్టార్ల విస్తీర్ణంలో చుట్టూ కొండలే ఆనకట్టలుగా చెరువును నిర్మించారు. ఇరిగేషన్ రికార్డుల ప్రకారం 1917, 1948, 1949, 1950, 1956, 1963, 1966, 1975, 1983, 1996, 2020 సంవత్సరాలలో మాత్రమే చెరువు పూర్తిగా నిండింది. 21 అడుగుల లోతు ఉన్న చెరువుకు 1996 తరువాత అప్పుడప్పుడూ 15, 16 అడుగుల మేర నీరు చేరింది. ప్రస్తుతం 10 అడుగుల మేర మాత్రమే ఉంది. చెరువు కింద అధికారికంగా 12 వేలు, అనధికారికంగా 6వేల ఎకరాల ఆయకట్టు ఉంది.