కొలిక్కిరాని బదిలీలు

ABN , First Publish Date - 2023-06-02T23:22:53+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కొలిక్కిరాని పరిస్థితి ఏర్పడింది. మే 31వతేదీ వరకు బదిలీల కోసం ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వాటిని పరిశీలించి బదిలీలు చేయాల్సి ఉంది. అయితే ముందుగా ప్రజాప్రతినిధుల నుంచి బదిలీల కోసం సిఫార్సు లేఖలు వచ్చినా మరలా వారి ఆమోదం కోసం పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

కొలిక్కిరాని బదిలీలు

ప్రజాప్రతినిధుల ఆమోదం కోసం ఎదురుచూపులు

పలుశాఖల్లో ఇదే పరిస్థితి

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 2 : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కొలిక్కిరాని పరిస్థితి ఏర్పడింది. మే 31వతేదీ వరకు బదిలీల కోసం ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వాటిని పరిశీలించి బదిలీలు చేయాల్సి ఉంది. అయితే ముందుగా ప్రజాప్రతినిధుల నుంచి బదిలీల కోసం సిఫార్సు లేఖలు వచ్చినా మరలా వారి ఆమోదం కోసం పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సాధారణంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఐదేళ్ళు పైబడి ఒకే స్థానంలో పనిచేసే ఉద్యోగులతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులను, భార్యాభర్తలు ఉద్యోగులైతే వారి బదిలీలు, అంతర్‌ జిల్లాల బదిలీలు చేయాల్సి ఉంటుంది. అయితే రానున్నది సాధారణ ఎన్నికల సీజన్‌ కావడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు క్షేత్ర, మండల స్థాయిలో తమకు అనుకూలమైన అధికారులు, ఉద్యోగులను నియమించుకునేందుకు అధికారులపై వత్తిడి పెంచారు. గత ఏడాది భారీ స్థాయిలో ఉద్యోగుల బదిలీలు జరగ్గా ఈసారి అంతకు మించి బదిలీల కోసం దరఖాస్తులు వచ్చాయంటే అధికార పార్టీ నేతల ప్రమేయం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన వెంటనే ఉద్యోగులకు బదిలీల ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉండగా శుక్రవారం రాత్రి వరకు కూడా కొలిక్కిరాలేదు. అన్ని ప్రధానమైన శాఖల్లో ఇదే పరిస్థితి. ప్రజాప్రతినిధుల నుంచి ఉదయం ఒక జాబితా వస్తే, సాయంత్రం సమయంలో మరలా ఇంకొక పేరు మార్చాలని ఒత్తిడి వస్తుండటంతో సంబంధిత శాఖల అధికారులు మల్లగుల్లాలుపడుతున్నారు. మండల స్థాయి అధికారుల పోస్టుల విషయంలో మరింత ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. కీలకమైన రెవెన్యూశాఖలో శుక్రవారం రాత్రి బదిలీల ఉత్తర్వులు వెలువడగా ఇతర శాఖల్లో అవి రాని పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2023-06-02T23:22:53+05:30 IST