లెక్కలేదంతే!

ABN , First Publish Date - 2023-05-25T23:40:15+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖలో గత కొంతకాలం నుంచి పోస్టుల నియామకం నుంచి డిప్యుటేషన్ల వరకు జరుగుతున్న అక్రమాలు అంతా ఇంతా కాదు. అన్ని ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్లు రద్దు చేసి వారి పాత స్థానాలకు పంపితే ఆ శాఖలో మాత్రం తమకు అనుకూలమైన వ్యక్తులకు పెద్దపీట వేస్తున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే వారి తప్పులను బయటకు తీసి బెదిరిస్తున్న పరిస్థితి. అక్కడ ఏమి జరిగినా ఎవ్వరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైద్యశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పయ్యావుల శ్రీనివాసులుపై అనేక అవినీతి ఆరోపణలు, పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.

లెక్కలేదంతే!
డీఎంహెచ్‌వో కార్యాలయం

మంత్రి చెప్పినా. ఆ శాఖ ఆర్డీ చెప్పినా పట్టింపు లేదు

ఇక్కడ మేము చెప్పిందే వేదం

ఒకరి ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదు

ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నా లెక్కలేనితనం

జిల్లావ్యాప్తంగా వైద్యశాఖలో పనిచేసే ఉద్యోగులకు రూల్స్‌ తెలియవట

ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నా కాపాడే వ్యక్తి ఎవ్వరా అని చర్చలు

వైద్యశాఖకు అండగా నిలుస్తున్న ఉన్నతాధికారి ఎవరూ?

ప్రభుత్వ శాఖలన్నింటికి ఒక రూల్‌.... వైద్యశాఖకు మాత్రం ప్రత్యేక రూల్‌. ఆ కార్యాలయంలో ఏమి జరిగినా ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదట... అసలు ఆ శాఖ గురించి ప్రశ్నించే అర్హత ఎవ్వరికి లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు బాధ్యులు. ‘కార్యాలయంలో పనిచేయాలంటే అన్ని తెలిసి ఉండాలి.. అలా తెలిసిన ఉద్యోగులు జిల్లాలో ఒక్కరు కూడా లేరు. ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కార్యాలయంలో పనిచేసే వారే కరెక్టు. బయట వచ్చే ఆరోపణలకు మేము రెస్పాండ్‌ కావాలా... అంత అవసరం లేదు.’ ఇదీ జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం తీరు.. స్వయంగా జిల్లా మంత్రి, వైద్యశాఖకే చెందిన ఆర్డీ ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ శాఖలో నియామకాల నుంచి బదిలీల వ రకు కొందరు ఇష్టారీతిన చేస్తున్నారు. అయితే అక్రమార్కులకు అండగా నిలుస్తున్న అజ్ఞాత అధికారి ఎవ్వరా? అంటూ ఆ శాఖ ఉద్యోగుల్లోనే చర్చ నడుస్తోంది.

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 25: వైద్య ఆరోగ్యశాఖలో గత కొంతకాలం నుంచి పోస్టుల నియామకం నుంచి డిప్యుటేషన్ల వరకు జరుగుతున్న అక్రమాలు అంతా ఇంతా కాదు. అన్ని ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్లు రద్దు చేసి వారి పాత స్థానాలకు పంపితే ఆ శాఖలో మాత్రం తమకు అనుకూలమైన వ్యక్తులకు పెద్దపీట వేస్తున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే వారి తప్పులను బయటకు తీసి బెదిరిస్తున్న పరిస్థితి. అక్కడ ఏమి జరిగినా ఎవ్వరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైద్యశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పయ్యావుల శ్రీనివాసులుపై అనేక అవినీతి ఆరోపణలు, పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అతను నెల్లూరు జిల్లాలో పనిచేసిన సమయంలో ఏసీబీ చిక్కారు. అలాగే డిప్యుటేషన్‌పై జిల్లాకు వచ్చిన తర్వాత వచ్చిన అవినీతి ఆరోపణలతోపాటు ఇష్టారీతిన ఉద్యోగ నియాకాలు, డిప్యుటేషన్లు వేస్తున్నారని ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లడంతో వైద్యశాఖ ఆర్డీ డాక్టర్‌ యాస్మిన్‌ అతనిని మాతృశాఖకు పంపాలని ఆదేశాలు జారీచేసి పక్షం రోజులు గడిచింది. కానీ ఆ ఆదేశాలు పాటించిన పరిస్థితి లేదు.

మంత్రి ఆదేశించినా సరే..

వారంరోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ సమావేశానికి మంత్రులు వస్తున్నట్లు తెలిసి దళిత సంఘాలు కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ దళిత సంఘాలతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో పనిచేసే సూపరింటెండెంట్‌ చేస్తున్న అవినీతిపై పెద్ద నివేదికను కూడా ఆయనకు ఇచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే ఆ సూపరింటెండెంట్‌ను మాతృశాఖకు సరెండర్‌ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కానీ ఇంతవరకు ఆ ఉద్యోగిని మాతృ శాఖకు పంపడం కానీ సరెండర్‌ చేయడం కానీ జరగలేదు

ఆ అజ్ఞాత అధికారి ఎవ్వరు?

కాగా వైద్యారోగ్య శాఖలో అవినీతి, అక్రమాలపై పెద్దఎత్తున ఆ శాఖ ఉద్యోగుల్లో చర్చ నడుస్తోది. మంత్రి చెప్పినా.... ఆర్డీ ఆదేశాలు ఇచ్చినా పాటించడం లేదంటే ఎవరో అజ్ఞాత అధికారి పూర్తిస్థాఽయి అండ ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో డిప్యుటేషన్లు వేయగా, ఆ శాఖ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల నియామకాల్లో అనేక అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు అందించారు. అయినా పట్టించుకోవడం లేదంటే పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తి అండగా ఉన్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అవినీతి కేసుల్లో ఉంటే కీలక శాఖ ఏలా కేటాయిస్తారు?

కాగా అవినీతి కేసుల్లో పట్టుబడిన ఉద్యోగులకు ఏ శాఖలో కూడా కీలక పోస్టులు కేటాయించరు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నం. నెల్లూరు జిల్లాలో పనిచేసే సమయంలో పయ్యావుల శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ కేసును ఎదుర్కొంటున్న ఉద్యోగిని నాన్‌ ఫోకల్‌ పోస్టులో కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తాత్కాలికంగా వైద్యశాఖకు ఆయనను పంపారు. ఆ రోజు వచ్చిన సూపరింటెండెంట్‌ ఇప్పుడు ఆ శాఖను శాసించే స్థాయికి చేరుకున్నారు. అతనికి ఆశాఖ ఉన్నతాధికారుల మద్దతు సంపూర్ణంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అతను వారికి బినామీలా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.

అవినీతి ఆరోపణలు ఉంటే వెంటనే మార్పు

కాగా ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఏదైనా అవినీతి, అరోపణలు వస్తే వెంటనే సంబంధిత ఉద్యోగిని మార్చుతారు. కానీ వైద్యశాఖ మాత్రం అందుకు భిన్నం... ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా ఆయనే లేకపోతే కార్యాలయంలో ఫైల్స్‌ కూడా రాసేవారు లేరని చెప్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఎక్కువమంది ఉద్యోగులు ఉండే ఏదైనా శాఖ ఉందా అంటే అది వైద్య శాఖే.. అటువంటి శాఖలో వందలాది మంది పనిచేస్తుంటే కనీసం సూపరింటెండెంట్‌ పోస్టుకు అర్హత ఉన్న ఉద్యోగి ఒక్కరంటే ఒక్కరు లేరని.... అందువల్లనే కొనసాగిస్తున్నామని చెప్తున్నారంటే అతను ఏ స్థాయిలో లాబీయింగ్‌ నడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

వైద్యశాఖను గాడిలో పెట్టేది ఎవ్వరు?

వైద్యశాఖలో జరుగుతున్న తంతును గాడిలో పెట్టే దిక్కు ఎవ్వరనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాకు చెందిన మంత్రి చెప్పినా, వైద్యశాఖ ఉన్నతాధికారులు చెప్పినా వారి ఆదేశాలను పాటించాల్సిన అవసరం తమకు లేదని బహిరంగంగా చెప్తుంటే... ఇక ఆ శాఖను కాపాడేది ఎవరనేది ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నెల్లూరులో నిధుల దుర్వినియోగంపై విచారణ!

నెల్లూరు జిల్లాలో డీఎంహెచ్‌ఓగా రాజ్యలక్ష్మీ పనిచేసిన సమయంలో కొవిడ్‌ నిధులతో పాటు ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల నెల్లూరు జిల్లాకు వచ్చిన కేంద్ర ఆడిట్‌ బృందం(ఏజీ) ఈ నిధుల వ్యయ తీరు తెన్నులపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. నెల్లూరుకు చెందిన దుర్గారావు అనే వ్యక్తి సీఎం కార్యాలయానికి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశాలు జారీచేశారు. కొవిడ్‌ సమయంలో నెల్లూరు జిల్లాలో పనిచేసి, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో డిఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న రాజ్యలక్ష్మీతో పాటు అప్పటి సూపరింటెండెంట్‌, ఎస్టాబ్లి్‌షమెంట్‌ విభాగంలో పనిచేసే సీనియర్‌ సహాయకులు, అకౌంటెంట్‌, అప్పటి డెమో ఇన్‌చార్జీగా పనిచేసిన వారిపై విచారణకు ఆదేశించారు. ఆ విచారణ ఈనెల 19న నెల్లూరులో విచారణ జరగాల్సి ఉంది. అయితే ఈ విచారణకు ఆరోగ్యం బాగాలేదని కొంతమంది విచారణాధికారిని కోరడంతో వాయిదా వేసినట్లు తెలిసింది. తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుందో వేచిచూడాల్సి ఉంది.

Updated Date - 2023-05-25T23:40:15+05:30 IST