నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
ABN , First Publish Date - 2023-03-16T00:49:26+05:30 IST
హోరాహోరీగా సాగిన తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో తుది అంకమైన ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది.
చిత్తూరు కలెక్టర్ పర్యవేక్షణలో ప్రక్రియ
గెలుపుపై మూడు పక్షాల్లోనూ ధీమా
పట్టభద్రులకు 40, టీచర్లకు 14 టేబుళ్లు
బ్యాలెట్ పత్రాలన్నీ కలిపి కౌంటింగ్
ఒంగోలు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : హోరాహోరీగా సాగిన తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో తుది అంకమైన ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది. ఇందుకోసం చిత్తూరులోని ఆర్‌వీఎస్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి అయిన అక్కడి కలెక్టర్ హరినారాయణ నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలు కలిపి ఉన్న తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో శాసనమండలి పునరుద్ధరణ అనంతరం ఎన్నికలు జరగడం ఇది నాల్గోసారి. పట్టభద్రుల స్థానంలో 3,79,810, ఉపాధ్యాయ స్థానంలో 27,694 మంది ఓటర్లు ఉండగా 2,68,387మంది పట్టభద్రులు, 24,741మంది ఉపాధ్యాయులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో చూస్తే 82,225మంది పట్టభద్రుల్లో 59,835 మంది ఓట్లు వేయగా, 5,789 మంది ఉపాధ్యాయ ఓటర్లలో 5,332 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. పట్టభద్రుల స్థానానికి 22 మంది, ఉపాధ్యాయ స్థానానికి ఎనిమిది మంది బరిలో ఉండగా టీడీపీ, వైసీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా సాగింది. అధికారం అండగా వైసీపీ, ప్రభుత్వంపై వ్యతిరేకత, కేడర్ బలంతో టీడీపీ, పోరాటాలు, నిబద్ధత ప్రాతిపదికన పీడీఎఫ్ అభ్యర్థులు ఎన్నికలు ఎదుర్కొనగా ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అంతా చిత్తూరులోనే..
మొత్తం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చిత్తూరులోనే ఏర్పాటు చేశారు. అక్కడి ఆర్‌వీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో పట్టభద్రులు, లాకాలేజీలో ఉపాధ్యాయ స్థానం కౌంటింగ్ జరగనుంది. పెద్దసంఖ్యలో ఓట్లు ఉన్న పట్టభద్రుల స్థానం లెక్కింపున కు 40 టేబుళ్లు, ఉపాధ్యాయ స్థానానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భిన్నంగా ఈ లెక్కింపు జరగనుంది. బ్యాలెట్ పత్రాలు అన్నింటినీ కలిపేసి లెక్కిస్తారు. దీంతో పోలింగ్ కేంద్రాలు లేదా నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చాయన్న విషయం తెలిసే అవకాశం లేదు. అంతేకాక సాధారణ ఎన్నికలలో ఎక్కువ ఓట్లు వస్తే వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. ఇందులో చెల్లిన ఓట్లలో 50శాతం ఆపై మరొక ఓటు వచ్చిన వారిని గెలిచినట్లు గుర్తిస్తారు. తొలి ప్రాధాన్యత ఓటు ప్రకారం లెక్కింపు సాగుతుంది.
తొలి ప్రాధాన్యతతో కష్టమే
తొలి ప్రాధాన్యతతో నిర్దేశిత ఓట్లు వస్తే ఆ అభ్యర్థి గెలిచినట్లే లెక్క. ఎవరికీ అలా రాకపోతే తొలి ప్రాధాన్యత ఓటు అందరికన్నా తక్కువ వచ్చిన అభ్యర్థిని తొలగించి అతని బ్యాలెట్‌లో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను చూసి ఇతరులకు కలుపుతారు. ఇలా నిర్దేశిత ఓట్లు వచ్చే వరకు లెక్కిస్తారు. ఎన్నికలు జరిగిన తీరును పరిశీలిస్తే తొలి ప్రాధాన్యత ఓటుతో ఏ ఒక్కరూ గెలిచే అవకాశం ఉండదని ద్వితీయ అవసరమైతే తృతీయ ప్రాధాన్యత ఓట్లు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఆ ప్రకారం చూస్తే ఓట్ల లెక్కింపు ఆలస్యం కావచ్చు. గురువారం ఉదయం కౌంటింగ్ ప్రారంభించినప్పటికీ అర్ధరాత్రి దాటేంత వరకూ ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉండదని, ఒకవేళ శుక్రవారం ఉదయం వరకు కూడా పట్టవచ్చని సమాచారం.