దగ్గు.. తగ్గేదెలా?
ABN , First Publish Date - 2023-02-28T00:57:52+05:30 IST
ఇటీవల కాలంలో జిల్లాలో అధికశాతం మంది అనారోగ్యానికి గురవుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఒకటే దగ్గు.. గొంతునొప్పి, కళ్లె పడటం వంటి వాటితో అల్లాడిపోతున్నారు.
అధిక మందిలో గొంతు నొప్పి, జ్వరం
వెంటాడుతున్న సీజనల్ ప్రభావం
ఆసుపత్రుల్లో పెరుగుతున్న బాధితులు
వాతావరణంలో మార్పులే కారణమంటున్న వైద్యులు
ఒంగోలు (కార్పొరేషన్) ఫిబ్రవరి 27 : ఇటీవల కాలంలో జిల్లాలో అధికశాతం మంది అనారోగ్యానికి గురవుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఒకటే దగ్గు.. గొంతునొప్పి, కళ్లె పడటం వంటి వాటితో అల్లాడిపోతున్నారు. పదిహేనురోజులుగా ప్రతి ఇంటా ఈ సమస్యతో బాధపడుతున్న వారు కనిపిస్తున్నారు. దీంతోపాటు జ్వరం, ఒళ్లు నొప్పులు, విపరీతమైన నీరసంతో బాధపడుతున్నారు. అయితే కొవిడ్ తర్వాత సమస్యలుగా కొందరు భయపడుతుండగా, వాతావరణంలో వచ్చే మార్పులు, సీజన్ వ్యాధులు సర్వ సాధారణమే అని వైద్యులు వెల్లడిస్తున్నారు. కాగా రోజురోజుకూ సమస్య పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం కోసం బారులు తీరుతున్నారు. అదేవిధంగా ఆర్‌ఎంపీల వద్ద కూడా వైద్యం చేయించుకుంటున్నారు. మొత్తంగా గత పది, పదిహేను రోజులుగా జిల్లా అంతటా వైరల్ ఫీవర్ అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.
పగలు ఎండ.. రాత్రి మంచు
పగటి వేళ మండిపోయే ఎండ, రాత్రివేళలో చలి వాతావరణం, వేకువజామున మంచు కారణంగానే ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడిప్పుడే చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారుతున్న కారణంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు సమాచారం. అయితే వీలైనంత వరకు చలికి, మంచుకు దూరంగా ఉంటే వైరల్ ఫీవర్స్ నుంచి తప్పించుకోవచ్చంటున్నారు.