కొంపకొల్లేరే?

ABN , First Publish Date - 2023-09-25T23:22:29+05:30 IST

‘ఔను నిజమే చంద్రబాబు అరెస్టు విషయంలో సాధారణ ప్రజలు అయ్యోపాపం అంటున్నారు. కిందిస్థాయిలో చేస్తున్న నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో టీడీపీ శ్రేణులపై భారీ సంఖ్యలో కేసులు నమోదు చేయిస్తున్నారు. వైసీపీలో ఉన్న మాకు వారు బంధువులు కావడంతో బంధాలు అడ్డువస్తున్నాయి. మున్ముందు వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి..’ ఇది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు ఆ పార్టీశ్రేణులు వినిపిస్తున్న మాట. కేసుపై కేసు వస్తుంది. ఎన్నికల దా కా చంద్రబాబు బయటకు రాలేడు. లోకేష్‌ కూడా లోపలకు వెళ్లవచ్చు తద్వారా పోల్‌ మేనేజ్‌మెంట్‌లో టీడీపీ వైఫల్యం చెంది మనకు కలిసొస్తుందన్న అత్యాశ వైసీపీ నాయకుల్లో బలంగానే ఉంది. అదే మాటను పదేపదే ప్రచారం చేస్తూ టీడీపీ శ్రేణుల మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకు పక్కా పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నారు. అయినా ప్రజల నుంచి వస్తున్న అయ్యోపాపం అనే భావన తమ కొంపముంచుతుందనే భయం వైసీపీ వారిని వెంటాడుతోంది.

కొంపకొల్లేరే?

అధికార పార్టీ కేడర్‌లో అంతర్మథనం

బాబు అరెస్టుపై అయ్యో పాపం అంటున్న సాధారణ ప్రజలు

అన్నివర్గాల్లో పెరిగిన సాఽనుభూతి

నిరసనలు, ఆందోళనల్లో పాల్గొంటున్న తెలుగు తమ్ముళ్లపై అక్రమ కేసులు

ఈ దుందుడుకు చర్యలతో వైసీపీలో ఉన్న వారి బంఽధువర్గాల్లోనూ జగన్‌ మీద వ్యతిరేకత

కొందరు వైసీపీ నాయకుల్లోనూ అసహనం

ఆరా తీస్తున్న వైసీపీ పెద్దల దృష్టికి షాకింగ్‌ అంశాలు

చంద్రబాబుకు అండగా నిలిచేందుకు వైసీపీకి రాజీనామాలు చేసి వస్తున్న ప్రజాప్రతినిధులు

గిద్దలూరు, కనిగిరిలో చేరికలే అందుకు నిదర్శనం

‘ఔను నిజమే చంద్రబాబు అరెస్టు విషయంలో సాధారణ ప్రజలు అయ్యోపాపం అంటున్నారు. కిందిస్థాయిలో చేస్తున్న నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో టీడీపీ శ్రేణులపై భారీ సంఖ్యలో కేసులు నమోదు చేయిస్తున్నారు. వైసీపీలో ఉన్న మాకు వారు బంధువులు కావడంతో బంధాలు అడ్డువస్తున్నాయి. మున్ముందు వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి..’ ఇది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు ఆ పార్టీశ్రేణులు వినిపిస్తున్న మాట. కేసుపై కేసు వస్తుంది. ఎన్నికల దా కా చంద్రబాబు బయటకు రాలేడు. లోకేష్‌ కూడా లోపలకు వెళ్లవచ్చు తద్వారా పోల్‌ మేనేజ్‌మెంట్‌లో టీడీపీ వైఫల్యం చెంది మనకు కలిసొస్తుందన్న అత్యాశ వైసీపీ నాయకుల్లో బలంగానే ఉంది. అదే మాటను పదేపదే ప్రచారం చేస్తూ టీడీపీ శ్రేణుల మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకు పక్కా పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నారు. అయినా ప్రజల నుంచి వస్తున్న అయ్యోపాపం అనే భావన తమ కొంపముంచుతుందనే భయం వైసీపీ వారిని వెంటాడుతోంది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉండగా కిందిస్ధాయిలో టీడీపీ శ్రేణులు ఆయనది అక్రమ అరెస్టు అంటూ ఆందోళనలు చేస్తున్నాయి. బాబు అరెస్టుతో ఏర్పడిన రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని కొద్దిరోజులు ప్రజల్లో తిరిగే కార్యక్రమాలను వాయిదా వేసుకున్న అధికారపార్టీ శాసనసభ్యులు, నాయకులు వినాయక చవితి అనంతరం ప్రజల్లోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పర్యాయం బాబు ఎపిసోడ్‌ నేపథ్యంలో టీడీపీ కేడర్‌ కన్నా వైసీపీ శ్రేణులే ఎక్కువగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. దీంతో పార్టీశ్రేణులు ఏర్పాటు చేసుకున్న గణేష్‌ ఉత్సవాల కార్యక్రమానికి హాజరవ్వాల్సిన పరిస్థితి వైసీపీ నేతలకు ఏర్పడింది. దానికి తోడు వైసీపీ నాయకులు టీడీపీ ఓట్లను తొలగించేందుకు చేసిన ఫిర్యాదులపై పరిశీలన కూడా ప్రారంభమైంది. దీంతో బయట ఎక్కడెక్కడో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతోపాటు స్థానికంగా ఉన్నా బయటకు రాని నాయకులు తిరిగి నియోజకవర్గాల్లో పర్యటించాల్సి వస్తోం ది. దీంతో వారంతా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు శ్రీకారం పలికారు.

బంధాలు బయటకు వస్తున్నాయి

ఇంకోవైపు స్థానికంగా ఎక్కడికక్కడ పోలీసులు టీడీపీ శ్రేణులు, అభిమానులపై నమోదు చేస్తున్న కేసులు కూడా ఇబ్బందికరంగా మారాయి. కొందరిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు, మరికొందరిపై సాధారణ కేసులు, ఇంకొందరిపై బైండోవర్‌ కేసులను పోలీసులు నమోదు చేస్తున్నారు. అనుమతి లేకుండా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించటం, బంద్‌ పేరుతో రోడ్డుపైకి రావటం, ఆర్టీసీ బస్సుల ను అడ్డుకోవటం, వాహనాల టైర్లను దహనం చేసి నిరసనలు చేయ టం లాంటి కార్యక్రమాల పేరుతో ఈ కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 25 వరకు కేసులు పెట్టటం, ప్రతి నియోజకవర్గంలో 100మందికిపైగా టీడీపీ శ్రేణులను కేసుల్లో ఇరికించారు. వివిధ కారణాలతో రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ బంధుత్వం, దాయాదితనం, స్నేహం రూపంలో అత్యధిక ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య సంబంధాలు ఉన్నాయి. దీంతో స్థానిక పరిస్థితికి అనుగుణంగా టీడీపీలో ఉన్న వారిపై కేసుల నమోదును వైసీపీ శ్రేణుల్లో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అలజడి ఆరంభమైంది. ఈ క్రమంలో గిద్దలూరు జడ్పీటీసీ సభ్యుడు ఆదివారం వైసీపీని వీడి టీడీపీ చేరడం గమనార్హం. అలాగే వైసీపీలోని స్థానిక నాయకులు కొందరు బయటకు వచ్చి కేసుల్లో ఉన్న కొందరు టీడీపీ శ్రేణులతో ఉన్న బంధాన్ని చెబుతూ కేసులో నుంచి వారిని మినహాయించండి అంటూ కోరటం కూడా ప్రారంభమైంది.

కేసులపై తొందరొద్దు

పశ్చిమ ప్రాంతానికి చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కేసుల విషయంలో తొందరపడకండి అవసరమైతే తమ దృష్టికి తీసుకురండి అని కూడా స్థానిక పోలీసు అధికారులకు సూచనలు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక వైసీపీ ఇన్‌చార్జి అయితే పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి కేసుల్లో ఉన్న కొందరికి మినహయింపు ఇవ్వండి అంటూ కూడా కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో కానీ తాజాగా కిందిస్ధాయిలో నెలకొన్న ఈ పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందో అనే అందోళన అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల్లో వ్యక్తమవుతోంది. ఎవరో ఒకరు అరా తప్పా ఈ తాజా పరిణామాల్లో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఎక్కువమంది ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు బహిరంగ ప్రకటన చేయకపోవటమే నిదర్శనం. ఈ విషయంలో అంతర్గతంగా మదనపడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా తమ మనోభావాలను అధినేత జగన్‌ దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేక ఒకరితో ఒకరు మాట్లాడుకునే సందర్భంలో ఆవేదన చెందుతున్నారు. గ్రామసీమల్లో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన వినాయకచవితి ఉత్సవాలకు హాజరయ్యేందుకు కూడా కొందరు వెనుకాడుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ప్రభుత్వం చంద్రబాబు, లోకేష్‌ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుందా లేదా అనే దానికి అనుగుణంగా సాధారణ ప్రజల మనోభావాలు ఎలా మారుతాయో చూడాల్సి ఉందని వారు భావిస్తున్నారు. దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ప్రజల్లోకి, వినాయకచవితి ఉత్సవాల కార్యక్రమాలకు వెళ్లినంత స్పీడుగా వైసీపీ వారు వెళ్లలేకపోవటం గమనార్హం.

సానుభూతి పెరుగుతోంది.. కష్టమే

‘చంద్రబాబు అరెస్టు అయినప్పుడు ఏదో అనుకున్నాం.. కానీ క్రమేపీ సాధారణ ప్రజలు అయ్యోపాపం అంటున్నారు. అంతేకాక లోకే్‌షను అరెస్టు చేస్తారు.. ఎవ్వరినీ బయటకు రానివ్వరు. మరికొన్ని కేసులు సిద్ధం చేశారనే ప్రచారం కూడా ప్రజల్లోకి వెళ్లింది. దీంతో పాటు ఎన్నికలు కూడా ముందుగానే వస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపఽథ్యంలో క్రమేపీ చంద్రబాబు విషయంలో అన్యాయంగా అరెస్టు చేశారు అనే భావన ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పెరిగితే మనకు ఇబ్బందే’ అనే సమాచారాన్ని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు ప్రజల్లో మమేకమయ్యే కిందిస్థాయి నేతలు చెబుతున్నారు. రాజకీయంగా తమతో ఉండే ముఖ్యనాయకులు మినహా సాధారణ ప్రజల్లో తాజా పరిణామాల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అంశాన్ని కొందరు ముఖ్య నాయకులు గుర్తిస్తున్నారు. వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే మరో నాయకుడితో ముచ్చటించే సమయంలో కక్షసాధింపు చర్యల దిశగా జగన్‌ పోతున్నారనే భావన జనంలో వ్యక్తమవుతోంది కదా అని అనడం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో కొందరు శాసనసభ్యులు, ముఖ్య నాయకులు పట్టణ ప్రాంతాల్లో ఉండే కొన్నివర్గాల ప్రముఖులతో మాట్లాడటం కూడా గమనార్హం. వారి నుంచి ముఖ్యంగా రూ.300 కోట్ల అవినీతి అంటూ బాబును అరెస్టు చేయటం ఇబ్బందిగా అనిపిస్తుందని స్పష్టంగా చెబుతున్నట్లు తెలిసింది. విద్యాధికులు అయితే కేసులోని లోటుపాట్లను ఎత్తి చూపుతున్నట్లు సమాచారం.

Updated Date - 2023-09-25T23:22:29+05:30 IST