సెగలు.. పొగలు

ABN , First Publish Date - 2023-06-03T00:35:21+05:30 IST

ల్లాలో వేసవి తీవ్రత సెగలు కక్కింది. మూడొంతులకుపైగా ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సెగలు.. పొగలు
మధ్యాహ్న సమయంలో నిర్మానుష్యంగా ఉన్న ఒంగోలులోని మంగమూరు రోడ్డు

జిల్లావ్యాప్తంగా మండిన ఎండలు

40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఆపై వేడిగాలులు

నేడు, రేపు మరింత అధికంగా ఉండే అవకాశం

ఒంగోలు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేసవి తీవ్రత సెగలు కక్కింది. మూడొంతులకుపైగా ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడిగాలులు కూడా వీస్తుండటంతో జనం అల్లాడిపోయారు. శుక్రవారం ఏ ప్రాం తంలో చూసినా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఉదయం 9గంటలకే కొన్నిచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీవ్రత కొనసాగింది. ప్రత్యేకించి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 వరకు ఎండ మండిపోయింది. సాయంత్రం 5 గంటలకు కూడా జిల్లాలో ఉష్ణోగ్రతలు తీసిన 102 కేంద్రాల్లో 70 చోట్ల 40 నుంచి 44 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. కాగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల మధ్య గరిష్ఠంగా బేస్తవారపేట మండలం పిటికాయగుళ్లలో 44.86డిగ్రీల ఎండకాచింది. ముండ్లమూరులో 44.35, గుండ్లాపల్లిలో 44.25, దొనకొండలో 44.23, పెద్ద అలవలపాడులో 44.15, త్రోవగుంటలో 43.85, పునుగోడులో 43.79, మూలపాడులో 43.29 డిగ్రీలు నమోదైంది. అది ఒంగోలు నగరంలో 42 డిగ్రీలుగా ఉంది. చాలా ప్రాంతాల్లో ఎండల తోపాటు వేడిగాలులు కూడా పెరిగాయి. దీంతో సాయంత్రం వరకు ప్రజానీకం బయట తిరిగేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. కాగా జిల్లాలో శని, ఆదివారాల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కొన్ని మండ లాల్లో 45డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2023-06-03T00:35:21+05:30 IST