హిజ్రాలతో బేజారు
ABN , First Publish Date - 2023-06-07T23:27:10+05:30 IST
చీరాల, గ్రామీణ ప్రాంతాల్లో హిజ్రాల బెదిరింపులతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కల్యాణ మండపాలు, ఇంటి వద్ద ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నట్లు సమాచారం అందగానే అక్కడికి గుంపులుగా చేరి వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే శుభకార్యం జరగనివ్వమని, దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరిస్తున్నారు. లేకపోతే శాపనార్థాలు పెడుతూ శుభకార్యం వద్ద ఆందోళన వాతావరణం సృష్టిస్తున్నారు. ముందుగా సమాచారం అందగానే ఇంటి వద్దకు చేరుకుని కార్యక్రమం ముందురోజు, తరువాత రోజు తేదీలను గోడల మీద రాస్తున్నారు.
డబ్బులివ్వాలని డిమాండ్
ఇవ్వకుంటే బెదిరింపులు
సామాన్యుల భయాందోళన
చీరాలటౌన్, జూన్ 7 : చీరాల, గ్రామీణ ప్రాంతాల్లో హిజ్రాల బెదిరింపులతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కల్యాణ మండపాలు, ఇంటి వద్ద ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నట్లు సమాచారం అందగానే అక్కడికి గుంపులుగా చేరి వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే శుభకార్యం జరగనివ్వమని, దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరిస్తున్నారు. లేకపోతే శాపనార్థాలు పెడుతూ శుభకార్యం వద్ద ఆందోళన వాతావరణం సృష్టిస్తున్నారు. ముందుగా సమాచారం అందగానే ఇంటి వద్దకు చేరుకుని కార్యక్రమం ముందురోజు, తరువాత రోజు తేదీలను గోడల మీద రాస్తున్నారు. వాటి గురించి వివరణ అడిగితే ఎవ్వరు ముందుగా వస్తే వారు ఇంటి గోడపై రిజిస్ర్టేషన్ చేసుకున్నట్లు ఆవిధంగా ముద్ర వేస్తామని చెబుతున్నారు. ఇదంతా సామాన్యులకు దిక్కుతోచని స్థితిగా మారుతోంది. ఈక్రమంలోనే గురువారం చీరాల మండల పరిధిలోని ఈపూరుపాలెం విజయలక్ష్మి ఽథియేటర్ వెనుక రెండు నూతన గృహాప్రవేశాలు జరగనున్నాయి. దీంతో బుధవారమే సమాచారం అందుకున్న హిజ్రాలు సుమారు పదిమంది అక్కడకు చేరుకున్నారు. ఇరువురు యజమానుల వద్ద చెరొక పదివేలు డిమాండ్ చేశారు. వారు అంత ఇవ్వలేమని చెరొక రెండు వేలు ఇస్తామని బతిమిలాడారు. అయినా ఆ నగదు తమకు సరిపోదని ఇరువురు రూ. 20 వేలు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. ఈక్రమంలోనే ఇళ్ల గోడలపై పైవిధంగా గుర్తులు రాశారు. ఇంటి వద్ద ఆందోళన వాతావరణం సృష్టించారు. దీంతో చేసేదేమీలేక ఇంటి యజమానులు ఈపూరుపాలెం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్సై జనార్దన్ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపారు. అయితే అప్పటికే హిజ్రాలు అక్కడ నుంచి పరారయ్యారు. వెళుతూ వారు గురువారం వస్తామని బెదిరించి వెళ్లారు. సామాన్యులను ఈ విధంగా బెదిరింపులకు గురి చేస్తున్నవారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.