అశోక్‌బాబు టీడీపీ కోవర్టు!
ABN , First Publish Date - 2023-02-22T02:15:47+05:30 IST
వైసీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు టీడీపీకి కోవర్టుగా ఉంటూ సొంత పార్టీని నాశనం చేస్తున్నారని అసమ్మతి నేతలు ధ్వజమెత్తారు.
కొండపి వైసీపీ ఇన్‌చార్జిపై అసమ్మతి నేతల ఫైర్
అనుచరులతో ఇసుక, మద్యం, బియ్యం మాఫియా నడుపుతున్నారని ఆరోపణ
ఆయన్ను పదవి నుంచి తొలగించకపోతే మార్చి ఆఖరులో తాడేపల్లికి పాదయాత్ర
కొండపి, ఫిబ్రవరి 21 : వైసీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు టీడీపీకి కోవర్టుగా ఉంటూ సొంత పార్టీని నాశనం చేస్తున్నారని అసమ్మతి నేతలు ధ్వజమెత్తారు. ఆయన తన అనుచరులతో ఇసుక, మద్యం, బియ్యం అక్రమ వ్యాపారాలు చేయిస్తూ దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కొండపిలోని వైసీపీ నాయకుడు బొక్కిసం ఉపేంద్ర చౌదరి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అసమ్మతి నాయకులు అశోక్‌బాబుపై నిప్పులు చెరిగారు. ఉపేంద్ర మాట్లాడుతూ ఇటీవల కొండపిలో ఎమ్మెల్యే స్వామి నిరసన కార్యక్రమం చేపట్టి.. సీఎం జగన్‌ను విమర్శించారని, అందుకు ప్రతిగా అశోక్‌బాబు ఖండిస్తారని తామంతా ఎదురు చూశామన్నారు. అలా చేయని అశోక్‌బాబు తర్వాత జరుగుమల్లిలో జరిగిన గృహసారథుల సమావేశంలో తమను టీడీపీ కోవర్టులని విమర్శించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు మాట్లాడుతూ టీడీపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో కోవర్టుగా అశోక్‌బాబు పనిచేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు నిజమైన పార్టీ కార్యకర్తలను, నాయకులను పక్కకు నెట్టి తన మనుషులను ఏజెంట్లుగా అన్ని మండలాల్లో నియమించుకుని మాఫియా నడుపుతున్నారని ధ్వజమెత్తారు. వారితో ఇసుక, మద్యం, బియ్యం వ్యాపారాలు చేయిస్తూ మామూళ్లు దండుకుంటున్నారని విమర్శించారు. త్వరలోనే ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఆయన్ను అధిష్ఠానం తప్పిస్తుందన్నారు. అలా జరగని పక్షంలో మార్చి ఆఖరున నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి అశోక్‌బాబు బాధితులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధికసం ఖ్యలో తాడేపల్లి వరకు పాదయాత్రగా వెళ్లి అశోక్‌బాబును మార్చాలని ఒత్తిడి తెస్తామన్నారు. కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డపాటి అరుణ మాట్లాడుతూ టీడీపీ కోవర్టుగా పనిచేస్తున్న అశోక్‌బాబును నియోజకవర్గంలో లేకుండా తరిమికొడతామన్నారు. జరుగుమల్లి జడ్పీటీసీ సభ్యురాలు చంద్రలీల మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు తనకు తెలియకుండా మండలంలో నిర్వహిస్తున్నారని విమర్శించారు. జరుగుమల్లి మండలం నర్సింగోలుకు చెందిన పాడిబండ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కుటుంబ విషయాల్లో అశోక్‌బాబు జోక్యం చేసుకుంటూ తనను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. సమావేశంలో శాలివాహన సంఘ నాయకుడు కృష్ణమూర్తి, మాచేపల్లి నాగయ్య, డేవిడ్, దుగ్గిరాల వెంకటేశ్వర్లు, దివి శ్రీనివాసరావు, బొక్కిసం సుబ్బారావు, వేమవరపు వసంతరావు తదితరులు పాల్గొన్నారు.