ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

ABN , First Publish Date - 2023-06-03T01:27:40+05:30 IST

మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద 108 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

గిద్దలూరు, జూన్‌ 2 : మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద 108 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తున్నారు. 3వ తేదీ శనివారం మహాగణపతి పూజ, గోపూజ, యాగశాల ప్రవేశం, భజన కార్యక్రమాలు, 4వ తేదీన ప్రత్యేక హోమాలు, ఉత్సవ విగ్రహాల గ్రామోత్సవం, 5న పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం, 108 శివలింగాల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు, అలాగే ఆలయ ప్రాంగణంలోని నాగదేవత, గణపతి, నవగ్రహాలు, అంకాలమ్మ, పోతురాజు, నందీశ్వర, నారాయణస్వామి వార్ల ధ్వజశిఖర కళశ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన నిర్వాహకులు, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్‌ కోటా నరసింహులు తెలిపారు.

రేపటి నుంచి ఎడ్ల పోటీలు

108 అడుగుల ఆంజనేయకస్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈనెల 4, 5 తేదీలలో బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్‌ కోటా నరసింహులు ఒక ప్రకటనలో తెలిపారు. 4న ఆదివారం పెద్దబండపందెం నిర్వహించి మొదటి బహుమతి రూ.80వేలు, రెండవ బహుమతి రూ.60వేలు, 3వ బహుమతి రూ.40వేలు, 4వ బహుమతి రూ.30వేలు, 5వ బహుమతి రూ.20వేలు, 6వ బహుమతి రూ.10వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. 5వ తేదీ సోమవారం చిన్నబండ పాలపండ్ల ఎడ్ల పోటీలు నిర్వహించి మొదటి బహుమతి రూ.50వేలు, రెండవ బహుమతి రూ.30వేలు, మూడో బహుమతి రూ.20వేలు, నాలుగో బహుమతి రూ.10వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంట్రీ ఫీజులతో 9032950715, 8885542379 నంబరును ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

నల్లగుంట్లలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

పెద్ద దోర్నాల : మండలంలోని నల్లగుంట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాల యంలో శ్రీ సీతారామ లక్ష్మణ హను మంతుల విగ్రహ ప్రతిష్ఠామహోత్సవ వేడుకలు శనివారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గణపతిపూజ, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా ఆలయ కమిటి ఆధ్వర్యంలో వేదపండితులు శ్రీరామ, సీతా, లక్ష్మణ, హనుమంతుని విగ్రహా లకు జలాభిషేకం, కుంకుమార్చన, తదితర క్రతువులు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు హాజరై భక్తిశ్రద్ధలతో స్వామి వార్లను సేవించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొడ్డా శేషాద్రి, బట్టు సుధాకర్‌ రెడ్డి, దేసు.నాగేంద్రబాబు, అంబటి.వీరారెడ్డి, ఎస్‌.శేఖ ర్‌, దోరెద్దుల శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:27:40+05:30 IST